సడెన్‌గా దూరం నుంచి చూస్తే జయలలితను చూసినట్టే అనిపిస్తది… ఆమె పేరు దీప… దీపజయకుమార్… జయలలిత పెద్దన్న బిడ్డ… జర్నలిజంలో మధురై కామరాజ్ వర్శిటీలో మాస్టర్స్ చేసింది, తరువాత వేల్స్, కార్డిఫ్ వర్శిటీలో ఇంటర్నేషనల్ జర్నలిజం కోర్సు చేసింది… కొన్నాళ్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సబ్‌ఎడిటర్‌గా కొలువు చేసింది… ఏదో పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసింది గానీ జనం పట్టించుకోలేదు, సోదరుడి పేరు దీపక్… ఇంత పరిచయం దేనికీ అంటే..? మద్రాస్ హైకోర్టు తాజాగా ఓ తీర్పు చెప్పింది… జయలలిత అధికారిక నివాసం వేదనిలయం అలియాస్ పొయెస్ గార్డెన్‌ను దీపకు, దీపక్‌కు అప్పగించాలని ఆదేశించింది… దాన్ని జయలలిత స్మారకంగా మార్చాలనే నిర్ణయాన్ని కోర్టు రద్దు చేసింది… వెంటనే తాళాల్ని వారంలోపు అక్కాతమ్ముళ్లకు ఇచ్చేయాలని చెప్పింది…
నిజానికి జయలలితకు వారసుల్లేరు… ఆమె మరణించాక ఆ వందల కోట్ల ఆస్తులు, బినామీల పేరిట ఉన్న సంపద ఏమైందో ఎవరికీ తెలియదు… ఆ యవ్వారాలు మొత్తం తెలిసిన శశికళ కొన్నాళ్లు జైళ్లో ఉండి ఈమధ్యే విడుదలైంది… ఆమె సోయిలో ఉన్న ఆస్తులు ఇక ఆమె గతే… జయలలితకు హైదరాాబాదులోనూ ఆస్తులున్నయ్… ఎవరికి ఎంత దక్కితే అంత… ప్రజల నుంచి దోచుకున్న, దాచుకున్న సొత్తు చివరకు ఎవరెవరి పాలైందో… దీప, దీపక్ జీవితమంతా కష్టపడినా ఆ వివరాలు తెలియడం కష్టమే… ఒక అవివాహితకు తన సొంత వారసుల్లేకపోతే, రక్తసంబంధీకులు వారసులు… గత సంవత్సరం మే నెలలో హైకోర్టు ఈ అక్కాతమ్ముళ్లను వారసులుగా గుర్తించింది… తరువాత వీళ్లు ఆ ఆస్తుల స్వాధీనంలో ఏమేరకు ప్రగతి సాధించారనేది పెద్దగా తెలియదు… కానీ ఈ వేదనిలయాన్ని మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, జయలలిత స్మారకంగా మారుస్తామని ప్రకటించింది… ప్రభుత్వం లీగల్ చిక్కులు రాకూడదనే, జిల్లా యంత్రాంగంలో వేలం నోటీసు ఇప్పించి, ప్రభుత్వమే 67.8 కోట్లకు కొని, డిపాజిట్ చేసింది… ఇప్పుడు ఆ ప్రొసీజర్‌ను కూడా కోర్టు కొట్టేసింది…
Ads
అదీ వందల కోట్ల ఆస్తి… నిజానికి ఆమె ఆస్తుల వివరాలు, కోర్టు తీర్పు తరువాత వీళ్లిద్దరూ ఏమేరకు అవన్నీ చెక్కబెట్టుకోగలుగుతున్నారనే ఎపిసోడ్ కాదు మనం చెప్పుకునేది… వేదనిలయం మాకు కావాలి అని వాదించడానికి దీప తీసుకున్న పాయింట్స్ ఇంట్రస్టింగ్ అనిపించాయి… ‘‘అది జయలలిత ఆస్తి కాదు, ఆమె తల్లి అనగా మా నానమ్మ ఎన్.ఆర్.సంధ్య అలియాస్ వేద 1967లో కొన్న ఇల్లు… ఆమె పేరే పెట్టుకుంది వేదనిలయం అని… దానిపై మాకు పూర్తి హక్కుంది… అలాగే జయలలిత ఆస్తులకూ మేమే వారసులం… అలాంటప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా ఏకపక్షంగా, అన్యాయంగా ఎలా లాక్కుంటుంది…? ఒకవైపు ఆంటీ మరణంపై ఎంక్వయిరీకి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ వేసిన ప్రభుత్వమే ఆమె నివసించిన ఇంటిని స్వాధీనం చేసుకుంటే ఎలా..? ఎంక్వయిరీని దెబ్బతీయదా ఇది..? ద్వంద్వ ప్రమాణాలు కావా ఇవి..?
ఎఐడీఎంకే ప్రభుత్వానిది సిగ్గులేని చర్య… ఎందుకంటే..? ఒక మహిళకు సంబంధించిన బట్టల్ని, ఆభరణాల్ని, వస్తువుల్ని, చివరకు చెప్పుల్ని కూడా ప్రభుత్వం లాక్కుంటుందా..? సదరు మహిళ గౌరవాన్ని కించపరచడమే అవుతుంది… ఇదేనా జయలలితకు పాత అన్నాడీఎంకే ప్రభుత్వం ఇచ్చిన గౌరవం..? ఆమె మరణించింది, నాకు ఆమె తల్లివంటిది… ఆమెకు సంబంధించిన జ్ఞాపకాల్ని, వస్తువుల్ని అధికారులు తీసేసుకుంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి..? బంగారం, వెండి, రాగి, ప్లాటినం నగలు, డైమండ్స్, ఇతర విలువైన వస్తువులెన్నో ఉన్నయ్ ఇంట్లో… పురావస్తు విలువ ఉన్నవీ ఉన్నయ్… వాటిల్లో మా నానమ్మకు వాళ్ల తండ్రి ఇచ్చినవీ ఉన్నయ్, ఆ హెరిటేజ్ వస్తువుల్ని, మా తాతల్నాటి జ్ఞాపకాల్ని, మా నానమ్మ ఆస్తిని మేమెందుకు వదులుకోవాలి..? ఆయన మైసూరు రాయల్ ప్యాలెస్ వైద్యుడు…’’ ఇదీ ఆమె వాదన… నిజమే గానీ, ఇప్పుడు ఆ ఇంట్లోని వస్తువుల్ని ఎవరు పంచనామా చేశారు..? ఏం మిగిల్చారు అధికారులు..? అదీ అన్నింటికన్నా విలువైన ప్రశ్న…
Share this Article