నా కోడి కూయకపోతే తెల్లారదు… అని ఎవరైనా అనుకుంటే ఏమంటాం..? నవ్వుకుంటాం..! పెదవి విరుస్తాం…! నమస్తే తెలంగాణలో హుజూరాబాద్ ఫలితం మీద వార్త చూశాక కూడా అంతే… హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణలో ఓ ప్రాధాన్యవార్త… మూడు నెలలుగా హుజూరాబాద్ ఎన్నిక మీద పేజీలకొద్దీ, ప్రత్యేక సంచికలకొద్దీ, బస్తాలకొద్దీ, టన్నులకొద్దీ కథనాలు కుమ్మీ కుమ్మీ… ఈటల మీద నానా బురదా గుమ్మరించీ… తీరా ఆ ఫలితాన్ని మాత్రం రెండో పేజీలో కనీకనిపించకుండా సింగిల్ కాలమ్ వేస్తే దాన్నేమనాలి..? ఎవరికి సిగ్గు..? ఎవరిని చూసి పాఠకలోకం పకపకా నవ్వుతోంది..? ఆ ఎన్నికకు ప్రాధాన్యం ఉంది కాబట్టే ఆంగ్ల పత్రికలు, ఆంధ్రా పత్రికలు, హైదరాబాద్ బేస్డ్ చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, వెబ్ పత్రికలు, చివరకు అప్ కంట్రీ పేపర్లు సైతం సరైన ప్రాధాన్యం ఇచ్చాయి… జర్నలిజంలోని బేసిక్ వాల్యూస్‌ను గౌరవించాయి… చివరకు నమస్తే సాక్షి, నమస్తే ప్రభలు కూడా మంచి కవరేజీ ఇచ్చాయి… జస్ట్, నమస్తే తెలంగాణ, దానికి తాత వంటి మనతెలంగాణ తప్ప…!
కాస్త భయంభయంగానైనా సరే ఈనాడులో కూడా హుజూరాబాద్ ఫలితం వార్తకు సరైన జడ్జిమెంట్… సరైన ప్లేస్‌మెంట్… అవునూ, ఓ చిన్న డౌట్… అన్ని చానెళ్లలో కవరేజీ హోరెత్తిపోతుంటే మీ టీవీలో మాత్రం రౌండ్లవారీగా వోట్ల వివరాల్ని దాచేస్తే, కవర్ చేయకపోతే… ఫలితం ఏమైనా మారుతుందా..? మీ పత్రికల్లో సింగిల్ కాలమ్ వార్తలు రాసుకుంటే మాత్రం రిజల్ట్‌లో తేడా వస్తుందా..? ఎస్, ఓటమితో కడుపు రగిలిపోతుంటే… బీజేపీని, కాంగ్రెస్‌ను తిట్టేస్తూ కథనాలు రాసుకో ఎప్పటిలాగే… కానీ రిజల్ట్ వార్తే లైట్ తీసుకుంటే ఎలా..? ఖచ్చితంగా అది ఫస్ట్ పేజీ వార్త… దేశంలో బీజేపీకి వాతలు అంటూ బ్యానర్ కొట్టి అందులో సింగిల్ కాలమ్ హుజూరాబాద్ వార్త ఇన్‌సర్ట్ చేసింది మనతెలంగాణ… ఫాఫం… పాత్రికేయంలో చేతులు తిరిగినవాళ్లే అందరూ… కానీ..?
Ads
ఆంధ్రజ్యోతి అయితే నమస్తే తెలంగాణను వెక్కిరిస్తున్నట్టుగా నమస్తే ఈటల అని ఓ చమత్కారపు హెడ్డింగ్ పెట్టి, కసికసిగా పండుగ చేసుకుంది… దాని ధోరణి మరీ అతి… ఇంగ్లిష్ పత్రికలు కూడా ఉపఎన్నిక రిజల్ట్‌ను అతి చేయలేదు, తక్కువ చేయలేదు… ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే… పాలిటిక్స్ ఎంత భ్రష్టుపట్టిపోయినా సరే… విలువలు, ప్రమాణాలూ కనిపించకపోయినా సరే… ఓడిపోయినప్పుడు ప్రజలతీర్పు పట్ల గౌరవాన్ని చూపించాలి… ఒరిగేదేముంది అని కేటీయార్ స్పందన కాస్త రఫ్‌గా ఉన్నా సరే, ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం అని హరీష్‌రావు చాలా హుందాగా ఓటమిని అంగీకరించాడు… ఓటమి అనేది నిజం… మరి తెలంగాణ పేరు పెట్టుకున్న ఓ పత్రిక, ఇంటిపత్రిక అని ఊదరగొట్టే పత్రిక తెలంగాణలో ఓ ముఖ్యమైన ఉపఎన్నిక ఫలితాన్ని అలా లోపలి పేజీల్లో పారేయడం దేనికి..?
నిజానికి అటు అన్ని రౌండ్లూ అయిపోతున్నయ్… టీఆర్ఎస్ ఓటమి ఖాయమైపోయింది… క్యాంపు చల్లబడిపోయింది… బీజేపీ పతాకాలు ఎగురుతున్నయ్… ఒక్కసారిగా టీవీలు డిబేట్లను, స్క్రోలింగులను కాంగ్రెస్ ఓటమి మీదకు మళ్లించేశాయి… ఎప్పుడేం మాట్లాడాలో తెలియని కేరక్టర్లు ఎలాగూ కాంగ్రెస్‌లో ఉంటయ్ కదా… జగ్గారెడ్డి, కోమటిరెడ్డి గట్రా… వాళ్ల వ్యాఖ్యల్ని పట్టుకుని ‘‘అయిపోయింది, కాంగ్రెస్ కథ ఒడిశింది, డిపాజిట్ కూడా పోయింది, ఇక రేవంత్‌కు చిక్కులు, తిప్పలే’’ అని ఒకటే ఊదర… కాంగ్రెస్ అన్నీ తెలిసే టీఆర్ఎస్‌ను ఓడించిందనే బహిరంగ రహస్యం ఈ మీడియాకు తెలియదా..? హంబగ్… టీఆర్ఎస్ ఓటమి తాలూకు నైరాశ్యాన్ని డైవర్ట్ చేసి, ఆ మూడ్ మొత్తాన్ని కాంగ్రెస్ మీదకు నూకేయడం..! ఎన్నిక ఫలితం కవరేజీ సమయంలో ఓసారి పరిశీలిస్తే టీన్యూస్ 36, 40 వ్యూస్ ఉంటే, మరో చానెల్ 40, 50 వేల వ్యూస్… అదీ తేడా… టెన్ టీవీ, టీవీ9, ఎన్టీవీ కూడా కేసీయార్ అనుకూల చానెళ్లే కదా… అవేమీ రిజల్ట్ చెప్పకుండా, ముడుచుకుపోలేదు కదా… సో, మొదట చెప్పినట్టు… నా కోడి కూయకపోతే తెల్లారదు అనే ధోరణి అంతిమంగా మీడియా హౌజుకే నష్టం…!! (వర్తమాన కాలంలో పాత్రికేయం, విలువలు అని ఎవరూ మాట్లాడటం లేదు, కానీ ప్రజలు ఏం చూస్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో గమనించాలి కదా… అదే కదా రేటింగ్స్‌కైనా, సర్క్యులేషన్‌కైనా ప్రామాణికం… అబ్బే, వాటిని ఎవడు పట్టించుకుంటారులే అంటారా..? పోనీ, మన ఆత్మలకైనా కాస్త కన్విన్సింగ్ జవాబు చెప్పుకోవాలి కదా…)
Share this Article