పాపం, సీపీఐ… ఒకప్పుడు తెలంగాణ విముక్తి కోసం, పీడితుల భుక్తి కోసం సాయుధ పోరాటం చేసిన పార్టీ… వాళ్ల అసలు లక్ష్యాలు ఏమిటీ, ఇండియన్ యూనియన్‌లో కలిశాక కూడా పోరాటం ఎందుకు చేశారో, తరువాత ఎందుకు విరమించారో చరిత్ర… వేరే చర్చ.,. కానీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చూస్తే నిజంగా జాలేస్తున్నది… తెలంగాణలో కాదు, మొత్తం దేశంలోనే అది ఆరిపోతున్న దీపం… కేరళ, తమిళనాడు గట్రా… ఎవడైనా ఎక్కడైనా రెండుమూడు సీట్లు దయతో ముష్టి విసిరేస్తే, వాటినే కొరుకుతూ సంబరపడాల్సిన పార్టీ… కారణం, ఇదుగో ఇలాంటి లీడర్లు… ఈయన జాతీయ కార్యదర్శి… ఎప్పుడూ ఏదో రాష్ట్రంలో ఏ ఫ్యూడల్ పార్టీకో, ఏ కుటుంబ పార్టీకో, ఏ ఏకవ్యక్తి కేంద్రిత పార్టీకో ఎర్రటి తోకగా అతుక్కుపోయి, ఆనందపడిపోయి… ఆనక కాళ్ల మీద పడిపోయి… ఆనందపడిపోతున్న దురవస్థ… ఎప్పుడో జాతీయ హోదా పోయింది… సొంతంగా గెలిచే సీటు లేదు… నిజమైన కమ్యూనిస్టులకు, అది ప్రవచించిన నీతిబోధలకు తమ జీవితాల్ని, ఆ పార్టీకి తమ సర్వశక్తులూ అంకితం చేసి, నానారకాలుగా నష్టపోయిన వారికి ఎంతటి బాధ..?
అకస్మాత్తుగా చంద్రబాబు దేవుడవుతాడు… నాలుగు రోజులకే చంద్రబాబు దెయ్యంలా కనిపిస్తాడు… అలాగే ఏం కనిపించిందో, ఆయన తల వెనుక ఏ వెలుగు చక్రాలు తిరుగుతూ ఆకర్షించాయో, ఏం అర్థం చేసుకున్నారో గానీ హఠాత్తుగా జనసైనికులను మించి పవన్ భజన చేస్తారు… తరువాత ఛట్‌మని బంధం తెగిపోతుంది… అంతే అకస్మాత్తుగా కేసీయార్ పాదాల్లో ఏదో మహత్తు కనిపిస్తుంది… ఆయన చీదరించుకున్నా సరే, వాటి చుట్టూ ప్రదక్షిణ చేసేస్తుంటారు… పన్నెండు ఆమడల దూరంలో ఉంచాడు జగన్ వీళ్లను… ఇది చూడండి… కేసీయార్ సింబల్ ఆఫ్ తెలంగాణ అట… ఇదీ వాళ్ల భాష..? వాళ్ల బాష్యం..? కేసీయార్ తెలంగాణ చిహ్నం ఎలా అయ్యాడు నారాయణా..? తెలంగాణ చరిత్ర తెలుసా నీకు..? తెలంగాణ విముక్తి పోరాటం చేసిన పార్టీకి వారసుడివేనా నువ్వు అసలు..?
Ads
కేసీయార్… ఎ లీడర్ ఆఫ్ తెలంగాణ… అన్నీ కలిసొచ్చి సీఎం అయ్యాడు… అప్పట్లో కాంగ్రెస్‌లో విలీనం చేసి ఉంటే… కేసీయార్ చరిత్ర ఎక్కడ ఆగిపోయి ఉండేది..? కేసీయార్‌ను మీ అవసరం కోసం మెచ్చుకొండి, కేసీయార్ అంటే భక్తిభావన ఉండటం తప్పుకాదు, చాలామంది పాదపూజ చేస్తున్నారు… కానీ మరీ తెలంగాణపై కేసీయార్‌కు పేటెంట్ రైట్స్ ఉన్నాయనేంత స్థాయికి మీ జ్ఞానప్రతిభ వికసించి, పరిమళించాలా..? ఈ పేటెంట్ రైట్స్ ఏమిటి..? ఈ సింబల్ ఆఫ్ తెలంగాణ ఏమిటి..? ఎక్కడ ఉపఎన్నిక వాసన తగిలినా చాలు, చటుక్కున పరుగు తీసి, కేసీయార్ కేడర్కన్నా ఎక్కువ భక్తి చూపించడమేమిటో అసలు..? కేసీయార్ ఎవరిని పెట్టినా గెలుపు ఖాయం అట… దుబ్బాకలో, హైదరాబాదులో ఏం జరిగింది..? జనరల్ ఎన్నికల్లో బీజేపీకి 4 సీట్లు ఎలా వచ్చినయ్..? అసలు ఒక నిర్ణీత వయస్సు దాటాక, నిర్బంధ పదవీవిరమణ పథకాన్ని సీపీఐ ఎందుకు అమలు చేయదు..? నారాయణల్ని ఎందుకు వదిలించుకోదు..?! కనీసం కేసీయార్ భజన కోసం కాస్త తెలంగాణతనం తెలిసినవాళ్లను, తెలంగాణఘనం గురించి ఎరిగినవాళ్లను పురమాయిస్తే బెటర్ కదా..!!
Share this Article