జై నారాయణ..
జైజై నారాయణ..
‘నిషేధం’ ఉద్యమం..
వర్థిల్లాలి.. వర్థిల్లాలి..
—————–
మొన్న (శనివారం) సాయంత్రం టీవీ9 ఆన్ చేయగానే, సీపీఐ నారాయణ గారు ప్రత్యక్షమయ్యారు. బిగ్ బాస్ షో, దాని యాంకర్ నాగార్జునపై భగ్గుమంటున్నారు. ఒక్కోసారి ఆయన మాటలు తూటాల్లాగా పేలుతుంటాయి. ఇప్పుడు తూటా కాదు.. ఏకంగా ‘మిస్సైల్’ పేల్చేశారు. బిగ్ బాస్ హౌస్ కు తనదైన శైలిలో ‘బ్రోతల్ హౌస్’గా నామకరణం చేశారు. నారాయణ గారు టీవీ తెరపై అప్పుడప్పుడు ఇలా సడన్ గా ప్రత్యక్షమవుతున్నారు. ఆయన ప్రత్యక్షానికి సందర్భం కూడా కాస్తంత ఇంట్రెస్టింగ్ గానే ఉంటున్నది.. ఇప్పటిలాగానే..
———————-
ఏమాటకామాట చెప్పుకోవాలి. రాజకీయేతర అంశాలతో వార్తల్లో వ్యక్తిగా, తానే (తన మాటనో.. చేష్టనో) ఒక ‘వార్త’గా మారిపోతుంటారు నారాయణ గారు. ఇతర ‘బూర్జువా’ నేతలకు చేతగాని ఈ అరుదైన, అద్భుతమైన ‘కళ’ను ఈ కమ్యూనిస్టు ఉద్ధండుడు భలేగా పట్టేశారు. ఈసారి.. సారీ.. గతంలో కూడా ఇలాగే బిగ్ బాస్ షో మీద పడ్డారు. దానిని నిషేధించాలని గట్టిగా డిమాండ్ చేశారు. టీవీ తెరపై ఆయన ఒకవైపు మాట్లాడుతుంటే.. మరోవైపు ఆ షోలోని రసవత్తర ‘రసాత్మక’ సన్నివేశాలు కనిపించాయి. ఆయన గారి ‘నిషేధం’ డిమాండుకు ఈ సన్నివేశాలు, ఇలాంటివే మరికొన్ని కారణం కావచ్చు. నారాయణ గారి డిమాండ్ వింటుంటే.. చిత్రంగా ఆయనపై నాకు జాలేసింది. అంతలోనే గౌరవ భావం ఏర్పడింది. ఈ జాలి, గౌరవం ఎందుకో కూడా చెప్పాలి మరి.
———————-
Ads
బిగ్ బాస్ షో.. సింగిల్ ఎపిసోడ్ గానీ, సింగిల్ బిట్ గానీ నేను ఇప్పటివరకూ చూడలేదు. కాకపోతే, చూసినవాళ్లు మాట్లాడుకోవడం.. విశ్లేషించుకోవడం.. కొందరైతే చీదరించుకోవడం చూశాను, విన్నాను, చదివాను. కానీ, టీవీ తెరపై నారాయణ గారిని ఒకపక్కన, ఆ రసవత్తర, రసాత్మక సన్నివేశాలను మరోపక్కన చూడాల్సి రావడం.. నాకైతే కాస్తంత ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే.. మనలాంటి మామూలు మనుషులమైతే.. దేనినైనా సరే, పైపైన చూసి ఏదేదో వాగేస్తుంటాం. తోచినట్లుగా వ్యాఖ్యానిస్తుంటాం. కానీ ఆయన అలా కాదు. ఆయనొక కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు. విషయం ఏదైనా సరే.. దాని గురించి సంపూర్ణంగా, సమగ్రంగా అధ్యయనం (వినడమో, చదవడమో, చూడడమో) చేశాకనే మాట్లాడతారు, వ్యాఖ్యానిస్తారు. బిగ్ బాస్ షోను నిషేధించాలని అంత గట్టిగా డిమాండ్ చేస్తున్నారంటే.. ఆ షోను, అందులోని అభ్యంతకర సన్నివేశాలను ఎంతో సీరియస్ గా (తీక్షణంగా, అత్యంత శ్రద్ధగా, ఒకటికి పదిసార్లు) వీక్షించే ఉంటారు. పాపం.. ఆయన మానసికంగా ఎంత డిస్టర్బ్ అయ్యుంటారో కదా..
అంతేనా…
ఈ షోను ఇంటిల్లిపాదీ, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు-వయసొచ్చిన పిల్లలు (‘యూత్’ అనాలేమో..) కలిసి చూడాల్సొచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంటారు. మరి, ఈ షోను చూస్తున్నప్పుడు నారాయణ గారి పక్కన ఎవరైనా ఉన్నారేమో.. ఉండి ఉంటే, ‘ఈయన ఇవి కూడా చూస్తారా..’ అని రకరకాలుగా కామెంట్ చేశారేమో, ఇంకా ఏమేమి అని ఉంటారో, అవన్నీ తట్టుకోలేక-భరించలేక-సమాధానం చెప్పలేక-నోళ్లు మూయించలేక ఎంతగా తిప్పలు పడ్డారో.. ‘అయ్యో పాపం..’ అనిపించింది. అందుకే, ఆయనపై జాలి కలిగింది. ఇది మొదటి కారణం.
———————-
పనిలో పనిగా ఈ షో ప్రయోక్త (యాంకర్) అక్కినేని నాగార్జునపై కూడా నారాయణ గారు విరుచుకుపడ్డారు. ‘డబ్బు కోసం ఇంతగా కక్కుర్తి పడాలా..? ఇప్పుడు ఆయనకు ఏం తక్కువైందని..?’ అని ప్రశ్నించారు. ఆ సందర్భంలోనే ‘‘మొన్న బాలయ్య ‘అఖండ’ వచ్చింది. వినోదాత్మకంగా ఉంది. నాగార్జున నటించిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’.. గొప్పగా ఉన్నాయి’’ అన్నారు. అలాంటాయన ఇలాంటి షో ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించారు. అఘోరాలు, అతీత శక్తులకు సర్టిఫికెట్లు ఇస్తూ, పట్టం కట్టిన ‘అఖండ’లో వినోదాన్ని.. ఆధ్యాత్మిక చిత్రాలైన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’లో గొప్పదనాన్ని చూడడం నారాయణ గారికే చెల్లింది. అందుకే, ఆయనపై జాలి కలిగింది. ఇది రెండవ కారణం.
———————-
ఎవరి పని వారికి ఉంటుంది. నారాయణ గారి పని నారాయణది. నాగార్జున గారి పని నాగార్జునది. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు.. అని చెప్పడానికి కొలమానాలు, కొలబద్దలు ఉండవు. ఎవరి ప్రొఫెషన్ వాళ్లది. నారాయణ గారు నమ్ముకున్న కమ్యూనిస్టు పరిభాషలో చెప్పాలంటే.. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ప్రతిదీ వ్యాపారీకరణ (కమర్షియలైజేషన్)గా మారింది. ‘వినోదం’ కూడా అందులో ఒకటి. ఈ వ్యాపారంలో నీతి, నియమాలు ఉండవు. వాటిలో వీటిని వెతుక్కోవడమంటే.. ‘గొంగట్లో అన్నం తింటూ.. వెంట్రుకలను ఏరుకోవడం’లాగా ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. ‘బిగ్ బాస్ షోలో ‘సందేశం’ ఏమైనా ఉన్నదా..?’ అని, నారాయణ గారు ప్రశ్నించారు కాబట్టి. బిగ్ బాస్ షో.. కోట్ల రూపాయల వ్యవహారంతో కూడిన బిజినెస్. దానిని అలా నడిపించకపోతే.. సందేశాలు గట్రా నింపేస్తే.. ఫ్లాప్ షోగా మారుతుందని, మిగులుతుందని నిర్వాహకులకూ తెలుసు, పార్టిసిపెంట్స్ కూ తెలుసు, వీక్షకులకూ తెలుసు. తెలియనిదల్లా నారాయణ గారికి ఒక్కరికే. అందుకే, ఆయనపై జాలి కలిగింది. ఇది మూడవ కారణం.
———————-
కమ్యూనిస్టులంటే.. అందరికీ గౌరవమే. కమ్యూనిజాన్ని పచ్చిగా, పిచ్చిగా వ్యతిరేకించే, ద్వేషించే వాళ్లు కూడా.. కమ్యూనిస్టుల నిబద్ధతను, నిజాయితీని అంగీకరిస్తారు, గౌరవిస్తారు. వాళ్లు యథాలాపంగా, ఇష్టమొచ్చినట్లుగా కారుకూతలు కూయరు. నారాయణ గారిని చూస్తుంటే.. ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందేమోనని అనేకమందికి అనిపిస్తూ ఉండొచ్చు. ‘బిగ్ బాస్ హౌస్’ కాదది.. ‘బిగ్ బాస్ బ్రోతల్ హౌస్’ అని ఆయన అభివర్ణించారు. అసలు ఆ షోనే పక్కాగా స్క్రిప్టెడ్ అని సోషల్ మీడియాలో కథనాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. ఆ హౌస్ లోకి బాబు గోగినేని వంటి అతి గౌరవనీయ వ్యక్తులు, కాస్తంత పేరొందిన మేల్-ఫిమేల్ జర్నలిస్టులూ/యాంకర్లూ, సంపూర్ణేష్ బాబు వంటి నటులూ.. ఇలా చాలామందే వెళ్లొచ్చారు. నారాయణ గారి భాషలో చెప్పాలంటే.. ఇప్పుడు మనం వీళ్లందరినీ అర్జంటుగా ‘బ్రోతల్స్’ జాబితాలోకి ఎక్కించాల్సిందేనా..? ఆ హౌస్ ‘బ్రోతల్’ అయినప్పుడు.. అందులోకి వెళ్లిన వారిని కూడా ‘బ్రోతల్స్’ అనాల్సిందేనా..?
నారాయణ…
నారాయణ..
ఏమిటి కామ్రేడ్ ఇది..? ఒకవేళ అక్కడ అలాంటి వ్యవహారాలే నడుస్తున్నట్లయితే.. బాబు గోగినేని లాంటి వారో, ఇంకొకరో బయట పెట్టకుండా, గొంతు విప్పకుండా ఉంటారా..? ఒకటీ రెండు స్క్రిప్టెడ్ సన్నివేశాలు చూసి, ఏదేదో జరిగిపోతున్నదని గుండె బాదుకుంటూ, గొంతు చించుకుంటూ నారాయణ గారు హైరానా పడిపోతున్నారు. సరిగ్గా ఇందుకే, ఆయన గారిపై జాలి కలిగింది. ఇది నాలుగవ కారణం.
———————-
నారాయణ గారిపై జాలి పడడానికి ఇవన్నీ కారణాలు సరే.. మరి, గౌరవ భావం ఏర్పడడానికి కారణాలేమిటి..? అవి కూడా చెబుతాను. అవి చెప్పకపోతే.. ఆయన గారిని అవమానించినట్లే అవుతుంది. ఇప్పుడు వాటిలోకి వెళ్దాం.
———————-
– నారాయణ గారంటే.. నాకు ప్రత్యేకాభిమానం ఉంది. ఇతర కమ్యూనిస్టు నేతలు ఏమాత్రం పట్టించుకోని అంశంపై ఈయన మాత్రమే సూటిగా, స్పష్టంగా, గట్టిగా గొంతెత్తి నినదించారు. అందుకే, ఆయనంటే నాకు గౌరవ భావం. ఇది మొదటి కారణం.
– ‘‘కామ్రేడ్.. అంత లోతుగా, ఓపిగ్గా, శ్రద్ధగా స్టడీ చేయడానికి, గొంతు నొప్పి పుట్టేలా- ‘బ్రోతల్ హౌస్’.. ‘బ్రోతల్ హౌస్’.. ‘నిషేధించాలి’.. ‘నిషేధించాలి’ అని నినదించడానికి మీకు ఈ షో ఒక్కటే దొరికిందా..? మీరు స్టడీ చేయడానికి, గొంతెత్తడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ ఇష్యూ ఏ ఒక్కటీ దొరకలేదా..?’’ అని నారాయణ గారిని సహచర కామ్రేడ్స్ గట్టిగా ప్రశ్నిస్తారని, నిలదీస్తారని, కడిగి పారేస్తారని ఆయనకు తెలుసు. అయినా సరే, ‘అవన్నీ మీరు చూసుకోండి. ఈ షో.. నాకు వదిలేయండి’ అన్నట్లుగా.. నారాయణ గారు గొంతెత్తారు చూడండి.. అది నచ్చింది. అందుకే, ఆయనంటే నాకు గౌరవ భావం. ఇది రెండవ కారణం.
———————-
– కామ్రేడ్ నారాయణ గారూ.. నేను మీకు గతం నుంచే అభిమానిని. ఈ రోజు మీరు వినిపించిన ‘నిషేధం’ డిమాండుతో మునుపటి అభిమానం రెట్టింపయింది. మీరు ఏమాత్రం తగ్గొద్దు. మీరొక ‘ట్రెండ్ సెట్టర్’ కావాలి. మిమ్మల్ని విమర్శించే వాళ్లను ఏమాత్రం పట్టించుకోవద్దు. మరీ ముఖ్యంగా మన కామ్రేడ్లు ఉన్నారే.. వాళ్లను అస్సలు పట్టించుకోవద్దు. మీరు వింటానంటే.. నావి చిన్న చిన్న విన్నపాలు విన్నవించుకుందామని అనుకుంటున్నా.
– ఈ ‘నిషేధం’ ఉద్యమాన్ని మీరు అస్సలు ఆపొద్దు. ఇలాంటి షోలు మన సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. వీటిని నిషేధిస్తే.. మన రెండు రాష్ట్రాల ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లుతారు. బిగ్ బాస్ ఒక్కటే కాదు, మరో రూపంలో దీనిని తలదన్నే ‘జబర్దస్ట్’లాంటి షో నడుస్తున్నది. ఒక్క స్కిట్ కూడా మిస్సవకుండా అన్నీ చూడండి. మన ‘నిషేధం’ జాబితాలో దాన్ని అర్జంటుగా చేర్చాలి.
– క్రైం, హర్రర్ సినిమాలను తలదన్నేలా మన తెలుగు సీరియల్స్ తయారయ్యాయి. ఇంకా చెప్పాలంటే… అవి కూడా బిగ్ బాస్ షో మాదిరిగానే (కాకపోతే, విజువల్ కాదు, వెర్బల్) ఉన్నాయి. వాటిని కూడా మీరు ఓ పట్టు పట్టాలి. అది మీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి, ఒక్క సీరియల్ కూడా మిస్సవకుండా చూడండి.
– అరెర్రెర్రె.. మర్చిపోయాను. మీరు ఇన్నాళ్లూ వాడిని ఎలా వదిలి పెట్టారు కామ్రేడ్..? వాడేనండీ.. ఆ వెధవ.. ఆర్జీవీ గాడు.. వెధవన్నర వెధవ. మనం ఎంతగా తిడుతున్నా సరే.. వాడు మాత్రం ‘నన్ను.. వెయ్యేళ్లు(వె) ధనికుడవై(ధ) వర్థిల్లు(వ)’ అని దీవించినట్లుగా తెగ ఫీలవుతుంటాడు. వాడు ఆ మధ్యన జీఎస్టీ పేరుతో సినిమా తీశాడు. మీరు చూల్లేదా..? అది పెద్ద రచ్చ రచ్చయ్యింది. మన లేడీ కామ్రేడ్లు సంధ్య, దేవి.. వాడిపై ‘హీరోయినిక్’గా ఫైట్ చేశారు. పాపం.. అప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లోగానీ, ఆ మాటకొస్తే మన ఇండియాలోనే లేరనుకుంటాను. లేకపోతే, ఆ ఇద్దరు మాత్రమే ఆ రౌడీ ఆర్జీవీతో పోరాడుతుంటే.. మీరు నోరెళ్లబెట్టి, గుడ్లప్పగించి చూస్తూ ఊరుకునేవారా..? లేదు.. లేదు.. (మనలో మాట.. ఆ ఇద్దరు మాత్రమే అంతగా పోట్లాడుతుంటే.. మన మహిళాసంఘాలుగానీ, వాటి నేతలుగానీ ఒక్కరంటే ఒక్కరు కూడా గొంతెత్త లేదు. పాపం.. అప్పుడు వాళ్లకు గొంతు నొప్పి వచ్చి ఉంటుందేమో లెండి). కాబట్టి, చెప్పొచ్చేదేమంటే.. మీరు అర్జంటుగా ఆ ‘జీఎస్టీ’ చూడాలి. ఆ తరువాత కూడా సినిమా కుర్ర ఆడోళ్లతో ఏవేవో పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు కూడా చేశాడు. వాటిలో మీకు బోల్డంత ‘సబ్జెక్ట్’ దొరుకుతుంది. దానిని ‘స్టడీ’ చేయాలి.
– ఇప్పుడు పైన చెప్పినట్లుగా.. జబర్దస్ట్ షోను, సీరియల్సును, ఆ ఆర్జీవీ గాడిని.. మీ ‘నిషేధం’ జాబితాలో అర్జంటుగా చేర్చాలి. మన కామ్రేడ్స్ ఏమంటారోనని సందేహించకండి. రైతాంగ కష్టాలు, కార్మికుల కడగండ్లు, పేదోళ్ల పాట్లు, నిరుద్యోగం, ఆడోళ్లపై అఘాయిత్యాలు, దళితులపై దాష్టీకాలు.. ఇవన్నీ ఔట్ డేటెడ్ సబ్జెక్టులు. వీటిని మీరు అస్సలు పట్టించుకోవద్దు. మన ఎర్ర జెండా పార్టీలు కూడా వాటిని ఏనాడో మర్చిపోయాయి. గుర్తొచ్చినప్పుడు మాత్రం.. లేని ఓపిక తెచ్చుకుని, ఏదో హడావుడి చేస్తుంటాయి. అయినా, అవన్నీ మనకెందుకు నారాయణ గారూ..? మన కామ్రేడ్స్ చూసుకుంటారు.. లేకపోతే లేదు. వాటిని వాళ్లకొదిలేయండి. మీరు మాత్రం.. ఈ కొత్త ‘నిషేధం’ ఉద్యమం కొనసాగించండి. మస్తు పాపులారిటీ వస్తుంది. టీవీ వాళ్లకు కూడా మీలాంటోళ్లు దొరకడం లేదు. మీకు మస్తు కవరేజీ ఇస్తారు. మీ వెంట నడవడానికి, మీ గొంతులో గొంతు కలపడానికి నేనున్నాను. మనం మందడుగు వేస్తే.. మరెంతోమంది కదిలొస్తారు. బెస్టాఫ్ ‘లక్’ నారాయణ గారూ…
జై నారాయణ..
జైజై నారాయణ..
‘నిషేధం’ ఉద్యమం..
వర్థిల్లాలి.. వర్థిల్లాలి…
By…- ‘సముద్రం’
Share this Article