.
1) ఇది లొంగుబాటా..? సాయుధ పోరాట విరమణా..? అలాంటప్పుడు సీఎంల ఎదుట యూనిఫామ్‌లో సెల్యూట్ కొట్టి తలవంచడం ఏమిటి..? 2) ఆ ఆయుధం ఓనర్ ఎవరు..? పార్టీదేనా..? వాళ్లెవరు అప్పగించడానికి..? 3) ఇప్పుడిక మిగిలిన కీలక నేతలు నేపాల్, ఫిలిప్పీన్స్ బాటపట్టారా..? రక్షణ కోసం..! లేక కర్రెగుట్టల వైపు వచ్చారా..? 4) అసలు మావోయిస్టు పార్టీ మనుగడ ఉంటుందా..? 5) ఇక తరువాత అర్బన్ నక్సలైట్ల పనిపడతారా..?
…. తక్కళ్లపల్లి, మల్లోజుల ఆధ్వర్యంలో దాదాపు 3 వందల మంది, 200కు పైగా ఆయుధాలతో (దాదాపు 20 దాకా ఏకే-47లు కూడా..) మెయిన్ స్ట్రీమ్‌లో కలిశాక పై ప్రశ్నల మీద చర్చోపచర్చలు సాగుతున్నాయి… వాటి జోలికి పోవడం లేదు గానీ, ఆయుధం అనే దగ్గర ఆలోచనలు స్థంభిస్తున్నాయి…
Ads
పోరాటం తప్పదు అని మళ్లీ అదే అభయ్ పేరిట వెలువడుతున్న ప్రకటనలు లొంగిపోవడం దిగజారుడు చర్య, ఆయుధాల అప్పగింత ద్రోహం అని ఆరోపిస్తున్నది… అంతకుముందే లొంగిపోయే పక్షంలో ఆయుధాలను పీఎల్జీఏకు అప్పగించి వెళ్లాలనీ చెప్పింది… ఆయుధాలు అప్పగించకపోతే పీఎల్జీఏ బలవంతంగా స్వాధీనం చేసుకుంటుందనీ హెచ్చరించింది…
అసలు ఆ ఆర్మీలకే లీడర్లు లొంగిపోతుంటే, వాళ్ల నుంచి ఆయుధాలు లాక్కునేది ఎవరు..? లెఫ్ట్ ఓవర్ నక్సలైట్లు చెబుతున్న సోకాల్డ్ ప్రజలు (నక్సలైట్లే) శిక్షించడం ఏమిటి..? ఇంకా చాలా కమిటీలు కూడా ఈ సాయుధ లొంగుబాటలో ఉన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి…
నో, మాది లొంగుబాటు కాదు, ఆయుధాల విసర్జన, అంటే సాయుధ పోరాట విరమణ, ఇంకా కేడర్‌ను బలిచేయలేం, అందుకే జనజీవన స్రవంతిలోకి వస్తున్నాం, ఇందులోనే పోరాడతాం అంటున్నారు వేణు, వాసు తదితరులు… కానీ మిగిలిపోయిన నక్సలైట్ల భయం ఏమిటంటే..?
ఈ ఆయుధాలు మరో సల్వాజుడుం వంటి డీఆర్జీ బలగాల చేతుల్లోకి వెళ్తాయని, లొంగిన నక్సలైట్లనూ అందులో చేరుస్తారని…. అంటే ఏ తుపాకులు మొన్నటిదాకా నక్సలైట్ల చేతుల్లో ఉన్నాయో, అవే తుపాకులు ఇప్పుడు నక్సలైట్ల మీదకు పేలుతాయని..! ఆ తుపాకీధారులే మిగిలిపోయిన నక్సలైట్లను వేటాడతారని..!
ఆ భయాలు సహేతుకమే… రాజ్యం ఏదైనా చేయగలదు… ఐతే ఆయుధం ఓనర్ ఎవరు..? అనేక మంది ప్రాణాలకు తెగించి శత్రువుల వద్ద లాక్కున్న ఆయుధాలు, అవి పార్టీ సొంతం అంటారు మిగిలిపోయిన నక్సలైట్లు… ఆ ఆయుధాలనే కదా మేం విసర్జించాలని అనుకుంటున్నది, సాయుధ పోరాట విరమణ అంటేనే అది కదా… సో, ప్రభుత్వానికి అప్పగించేస్తున్నాం అనేది బయటికి వచ్చిన వాళ్ల వాదన…
తపంచాలు, గ్రెనేడ్ లాంచర్ల వంటివి నక్సలైట్లే అడవుల్లో తయారు చేసుకోగలరు… కానీ ఏకే-47 వంటి ఆయుధాలూ శత్రువు వశం కావడం పోరాటంలో ఉన్న నక్సలైట్లకు జీర్ణం కావడం లేదు… అదీ కోపానికి కారణం…
సరే, ఇవన్నీ అలా వదిలేస్తే… ఒకవేళ నిజంగానే కీలక నేతలు ఇప్పుడున్న అన్‌సేఫ్ సిట్యుయేషన్‌లో ఏ విదేశాలకో వెళ్లిపోతే మాత్రం… లొంగుబాట్ల సంఖ్య ఇంకా పెరుగుతుంది… నాయకులే పలాయనం చిత్తగిస్తే సైనికుల మనోస్థయిర్యం దెబ్బతినదా..?
మిగిలిన కీలక నేతలు 12 మందేనా…
రెండేళ్ల కాలంలో వివిధ ఎన్ కౌంటర్లలో దాదాపు 130 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,500 మంది పోలీసులకు లొంగిపోయారు… 30 నుంచి 40 శాతం సెంట్రల్ కమిటీ సభ్యులు చనిపోవడం, లొంగిపోవడం… మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర నష్టం కలిగించింది… నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ తర్వాత పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది…
ప్రస్తుతం పార్టీలో కేవలం 12 మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నట్లుంది… వీరిలో మడావి హిడ్యా కీలక వ్యక్తి… హిడ్మా పలు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ పర్సన్, ఈయన కోసం ఏడాదిగా ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతోంది… దండకారణ్యాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి…
హిడ్మాకు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది… పార్టీలో తన రేంజే సపరేటు… తన ఆర్మీ కంపెనీలో పనిచేసే సాధారణ సభ్యులకు సైతం 6 నెలలకోసారి కనిపిస్తాడని అంటారు… ఆయన వివరాలు, జాడలు ఏవీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు…
పోరాటంలో ఉన్న వారిలో 8 మంది అగ్రనేతలు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే… వీరిలో గణపతి, తిరుపతి, చంద్రన్న, హనుమంతు ఉన్నట్లు సమాచారం… ఈ నేపథ్యంలో హిడ్మా ఒక్కడు పట్టుబడితే ఇక మావోయిస్టు పార్టీ శకం ముగిసినట్లేనని కేంద్ర హెూం శాఖ భావిస్తోంది… ఇదీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ పరిస్థితీ, గతీ..!!
Share this Article