లెఫ్ట్, రైట్ పార్టీలు కాస్త నిబద్ధత పంథాలో ఉండేవి గతంలో… పూర్తి రైట్ అంటే బీజేపీ… ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేవైఎం వంటి అనుబంధ సంస్థల్లో పనిచేసి మెల్లిగా ఎలివేట్ అయ్యేవాళ్లు నాయకులు… వేరే పార్టీల నాయకుల్ని అంత త్వరగా నమ్మదు బీజేపీ… కానీ ఇప్పుడలా కాదు… మోడీషా శకం కదా… పక్కా కాంగ్రెస్ తరహా… ఏ పార్టీయో, కేసులున్నాయో లేదో, ఎలాంటి గత చరిత్ర అనేది ఏమీ చూడటం లేదు… డబ్బోదస్కమో, ఇతర ప్రలోభమో, వచ్చావా, పార్టీలో చేరావా అనేదే ప్రధానం… అదిప్పుడు అన్ని బూర్జువా పార్టీల్లాగే… కాదు, కాదు… వాటికన్నా ఎక్కువ…! బీజేపీ ప్యూరిటీ అనేది ఇప్పుడు ఇక పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే కాదు… కానీ లెఫ్ట్ పార్టీలు కాస్త నయం, ఎవరిని పడితే వారిని చేర్చుకోవు, వాటి నుంచి ఎవరూ జంప్ కారు, జంప్ కానివ్వరు అనే భ్రమలు ఉంటే వాటి నుంచి కూడా బయటికి వచ్చేయండి… అవేమీ అక్కర్లేదు… లెఫ్ట్ నుంచి జంపింగులను కేసీయార్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు, లెఫ్ట్ అంటే అదేదో సైద్ధాంతిక నిబద్ధనాయకుల పార్టీ అనే పిచ్చి భ్రమల్ని తను బద్ధలు కొట్టేశాడు ఎప్పుడో…! అంతేకాదు, కేరళలో ఆ పార్టీ సీనియర్ నాయకులు పినరై విజయన్ అయితే మరో నాలుగు అడుగులు ముందుకేసి… డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ తదితర అనుబంధ సంస్థల్లో పనిచేసి, తమను తాము నిరూపించుకుని పార్టీలో ఎదగాలి అనే ఓ పాతబడిన సైద్దాంతిక చట్రాన్ని తుత్తునియలు చేశాడు… ఏ పార్టీ నుంచి ఎవరొచ్చినా సరే, అలుముకుని ఎర్ర కండువాలు కప్పేస్తాం అంటున్నాడు… ఐనా మన భ్రమ గానీ, లెఫ్ట్ అంటే అదేమైనా పాత లెఫ్టా… ఆల్‌రెడీ ప్రజలు ‘లెఫ్ట్’ అన్నదేగా… ఇంకా దిగజారడానికి ఏముంది..? బీజేపీకి దానికీ తేడా ఏముంది..?
పైన ఫోటో చూశారు కదా… కేరళ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్టీలో అత్యంత సీనియర్… పేరు కేపీ అనిల్ కుమార్… నిన్న కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు, ఎంచక్కా సీపీఎం వాళ్లు ఎర్ర కండువాలు వేసి ఆహ్వానించేశారు… నిజానికి ఆ కాంగ్రెస్ నాయకుడిని ఆ పార్టీయే ఈమధ్య సస్పెండ్ చేసింది… ఎందుకు..? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాల్లో ఓ రీతి లేదు, నీతి లేదు అని నిందించాడు… కేరళ ప్రతిపక్ష నేత సతీశన్, కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ తమవాళ్లకే పదవులు కట్టబెట్టాడు అని ఆరోపించాడు… తన 43 ఏళ్ల కాంగ్రెస్ జీవితంలో ఇంత అరాచకాన్ని ఎప్పుడూ చూడలేదనీ, తనకు వెన్నుపోటు పొడుస్తున్నారనీ, ఒక కాంగ్రెస్ కుటుంబంలో పెట్టి, రక్తమంతా కాంగ్రెసే నిండిన తనకు రగిలిపోతుందనీ అన్నాడు… రాజీనామా చేసిపారేశాడు… (కాంగ్రెస్ పార్టీలో వెళ్లిపోవడాలు, అలగడాలు జస్ట్, కామనే కదా…) కానీ ఈయన నేరుగా సీపీఎం హెడ్ క్వార్టర్స్ ఏకేజీ సెంటర్ వెళ్లాడు… అక్కడ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణన్, రాంచంద్రన్ పిళ్లై, ఎంఏ బేబీ తదితరులు సాదరంగా స్వాగతించారు… అరె, కాంగ్రెస్ అనుసరిస్తున్న హిందుత్వ అనుకూల విధానాలకు నిరసనగా బయటికి వచ్చాడు కాబట్టి, నువ్వూ మావాడివే అంటూ అర్జెంటుగా ఓ సైద్దాంతిక సమర్థనను వినిపించారు… ఏం దరిద్రం పట్టుకుంది కామ్రేడ్స్ మీకు..?!
జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్‌కు ఓ దశ లేదు, ఓ దిశ లేదు, ఈ దేశ సెక్యులరిజం, డెమోక్రటిక్ స్పూర్తిని బీజేపీ తగులబెడుతుంటే ప్రేక్షకపాత్ర వహించడం తప్ప పోరాటం లేదు, ప్రతిఘటన లేదు అంటున్నాడు సదరు నయా సీపీఎం లీడర్… తనతోపాటు మాజీ ఎమ్మెల్యే సదాశివన్ నాయర్ కూడా కాంగ్రెస్ పార్టీ విధించిన సస్పెన్షన్‌లో ఉన్నాడు… ఆయన కూడా సీపీఎంలో చేరినట్టే… నిజానికి వీళ్లే కాదు… పాలక్కాడ్ లీడర్ ఏవీ గోపీనాథ్ కూడా గత నెలాఖరున కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు, కారణం పెద్దగా ఏమీలేదు, తనకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి దక్కలేదు… అంతే… 50 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచేసుకున్నాడు… పీఎస్ ప్రశాంత్ మరో లీడర్… సీపీఎంలో చేరిపోయాడు… కేరళ కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఓటమికి బాధ్యత ఫిక్స్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రన్‌ను మార్చేసి సుధాకరన్‌ను పెట్టింది… ప్రతిపక్ష నేతగా చెన్నితల రమేష్‌ను మార్చేసి సతీశన్‌ను పెట్టింది… ఊమెన్ చాందీ, చెన్నితల, రాంచంద్రన్ వర్గాన్ని పక్కన పెట్టేయడంతో పార్టీ లుకలుకలాడుతోంది ఇప్పుడు… కేవలం పార్టీ పదవులు దక్కలేదనే కారణంతో దశాబ్దాల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకుని, వచ్చేస్తున్న ఈ లీడర్లను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా సీపీఎం ఏం సంకేతం ఇస్తోంది..? సేమ్, బీజేపీలాగే మాకూ ఓ సైద్దాంతిక నిబద్ధత, మన్నూమశానం ఏమీ లేదు, ఎవరొచ్చినా సరే చేర్చేసుకుంటాం, మనమూ మారిపోతున్నాం… లేకపోతే మట్టిగొట్టుకుపోతాం అనే సందేశాల్ని పార్టీ కేడర్‌కు ఇస్తోందా..? ఏం దుర్ధశ ఇది కామ్రేడ్స్…!?
Ads
Share this Article