‘‘కేరళ సి.ఎం. మామూలోడు కాదు…. ఏం చేశారో తెలుసా…? కమ్యూనిస్టు భావజాలం నీది.. చాలా కష్టం. నువ్వు బతకలేవురా అంటూ కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను అంటుంటారు.
కానీ కమ్యూనిస్టులు ఎలాంటి వారో అందరికీ తెలుసు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడంలో వారిది కీలక పాత్ర.
ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ముఖ్యమంత్రులే ఉన్నారు.
Ads
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో వీరికి అందె వేసిన చేయి.
అందులో కేరళ సిఎం పినరయి విజయన్ మొదటి వారు. ఎలా అంటారా. .చూడండి..
కేరళ ముఖ్యమంత్రిగా ఇప్పటికి విజయన్ 533 రోజుల పాటు పాలనను కొనసాగించారు.
ఈ పాలనలో ఆయనపై చిన్న ఆరోపణలు కూడా లేదు. ఎప్పుడూ సాదాసీదాగా ఉండే కేరళ సిఎం అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒక పనిచేశారు.
తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చి, ఎవరి తోడు లేకుండా ఒక ఆటో ఎక్కి, కాకా హోటల్‌కు వెళ్ళి కడుపు నిండా భోజనం చేశారు.
కాకా హోటల్లో కొంతమంది కేరళ సిఎంను గుర్తించారు కానీ మరికొంతమంది గుర్తించలేదు.
గుర్తించిన వారికి మాత్రం ఆయన చెప్పొద్దంటూ చేతులూపాడు. హోటల్ సిబ్బంది కూడా మామూలు వ్యక్తికి ఎలాగైతే భోజనం పెడతారో…
అదేవిధంగా సిఎంకు భోజనం పెట్టారు. ఆయన భోజనం చేసి వెళ్ళిన తరువాత సిఎం అని తెలుసుకున్న హోటల్ సిబ్బంది ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు కేరళ సిఎం ఒంటరిగా వెళ్ళి భోజనం చేసిన ఫోటో వైరల్‌గా మారుతోంది.
సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూడటం కోసం తాను ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తున్నానంటున్నారు కేరళ సి.ఎం…’’
https://www.youtube.com/watch?v=ROnINpRasYY
అర్థమైంది కదా… కేరళ సచివాలయ సిబ్బంది ఓనమ్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాద్యా (సంప్రదాయ శాకాహార పండుగ విందు) అది… కాకా హోటల్ కాదూ, మరేమీ లేదు… అఫ్ కోర్స్, అలా తన సచివాలయ సిబ్బందితో కలిసి సాద్యాలో పాలుపంచుకోవడం మెచ్చుకోదగిందే… పెద్దగా ఆడంబరం, అట్టహాసాలు కూడా లేకుండా…! ఏ సీఎం కూడా సెక్యూరిటీ లేకుండా సగటు మనిషిలా జనంలో కలిసిపోయే పరిస్థితులు ఏమీ లేవు, అలాంటి నాయకులూ లేరు… సీఎం ఎటు కదలాలన్నా వందిమాగధులు, భారీ కాన్వాయ్‌లు, ట్రాఫిక్ క్లియరెన్సులు, ఓ రాజు కదిలి వచ్చినట్టే కదా… అప్పట్లో త్రిపుర సీఎం నిరాడంబర జీవనం గురించి చెప్పుకునేవాళ్లు… కానీ నిజానికి జనంలో ఓ సగటు మనిషిలా కలిసిపోవడం అనేది గోవా మాజీ సీఎం, మాజీ దేశరక్షణ మంత్రి పరీకర్ విశేష లక్షణం… చాలా ఉదాహరణలున్నయ్, ఇంకెప్పుడైనా వివరంగా చెప్పుకుందాం… ఈ కింద ఫోటో గుర్తుంచుకొండి…
Share this Article