‘‘ఏ ఆజాదీ ఝూట్ హై’… దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అప్పటి కమ్యూనిస్టు పార్టీ స్పందన ఇది… ఈ విముక్తి అబద్ధం, ఇది అసలు స్వాతంత్య్రమే కాదు అని 75 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు కమ్యూనిస్టులు… విడిపోయినా, సీపీఎం ఆ ధోరణికే కట్టుబడి ఉంది… అందుకే జాతీయ జెండా కూడా ఎగురవేయదు పార్టీ… పంద్రాగస్టు రోజున కూడా జాతీయ జెండాను పట్టించుకోదు… దేశమంతా ఒక విధిగా ఆరోజున జాతీయ పతాకాన్ని ఎగరేయడమో, సెల్యూట్ చేయడమో చూస్తుంటాం కదా… ఆ పార్టీ మాత్రం లైట్ తీసుకునేది… అధికార పదవుల్లో ఉన్న పార్టీ నాయకులు మాత్రం పతాకావిష్కరణ చేసేవాళ్లు… అది తప్పదు కాబట్టి..! ఒక గుర్తింపు పొందిన పార్టీ, జాతీయ పతాకాన్ని, స్వాతంత్య్రాన్ని గుర్తించకపోతే… వేరే దేశాల్లో కుదరదు, కానీ ఇది భారతదేశం కదా, చల్తా… ఇన్నాళ్లూ సీపీఎం పార్టీకి చెల్లింది కదా మరి… ఇప్పుడు బెంగాల్‌లో ఒక్క సీటు కూడా గెలవని రేంజుకు కొట్టుకుపోయాక పార్టీకి స్వాతంత్య్రం వచ్చింది… కాదు, కాదు, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన భావన కలిగింది దానికి… అబ్ బోలో, ఏ ఆజాదీ ఝూట్ నహీఁ అంటోంది…
ఇప్పుడు పంద్రాగస్టు వేడుకలు జరుపుతానంటోంది… పతాకావిష్కరణ, జెండావందనం చేస్తానంటోంది… ఏడాది పొడవునా సెలబ్రేట్ చేద్దామంటోంది… బెంగాల్‌లోని పార్టీ ప్రతీ ఆఫీసులోనూ ఈసారి పంద్రాగస్టు వేడుకల్ని తొలిసారిగా జరపబోతోంది… ఎందుకీ మార్పు..? మాజీ ఎమ్మెల్యే సుజన్ చక్రవర్తి ఈమేరకు పంపిన ప్రతిపాదనకు పార్టీ సెంట్రల్ కమిటీ వోకే చెప్పింది… ఏమిటిలా మీ ధోరణి మారింది..? అని ఓ విలేఖరి అడిగితే… ‘‘మేం గతంలో కూడా పంద్రాగస్టు కార్యక్రమాలు చేసేవాళ్లం, కాకపోతే దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చాగోష్టులను పెట్టేవాళ్లం, 75 ఏళ్లు అనేది ఓ అకేషన్ కదా, మళ్లీ రాదు కదా, అందుకే ఈసారి ఘనంగా చేద్దామనుకుంటున్నాం’’ అని సీపీఎంకే పరిపాటైన ఓ వింత సమర్థన చేసుకొచ్చాడు ఆ చక్రవర్తి… కానీ రాజకీయ విశ్లేషకులు అంచనా వేసే కారణాలు వేరు… ఎలాగంటే..?
Ads
కమ్యూనిస్టులు ఎప్పుడూ దేశం మూడ్‌కు భిన్నంగా వెళ్తున్నారు… ఉదాహరణకు సీపీఎం దృష్టంతా క్యూబా, వియత్నాం, చైనా వంటి దేశాల సంక్షేమం మీదే… మొన్న చైనా కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ఉత్సవాలకు కూడా ఇక్కడి ప్రతినిధులు హాజరయ్యారు… ఒకవైపు సరిహద్దుల్లో టెన్షన్లుంటయ్, మన జవాన్లు ప్రాణాలు విడుస్తుంటారు… ప్రతి అడుగులోనూ చైనా మన ప్రయోజనాలను పాతరేస్తూ ఉంటుంది… మన పార్టీలు మాత్రం ‘మా దేశ విముక్తి ఓ పెద్ద అబద్ధం’ అనే నినాదంతో, కనీసం జాతీయ పతాకాన్ని కూడా గౌరవించకుండా, స్వాతంత్య్రాన్ని గుర్తించకుండా… శత్రువు పాదాలకు ఊడిగం చేస్తుంటయ్… ఇవన్నీ జనానికి అర్థమవుతున్నయ్… జాతీయతావాదం బీజేపీకి బలంగా మారుతోంది… అందుకే సీపీఎంకు హఠాత్తుగా దేశం, పతాకం, స్వాతంత్య్రం గుర్తొచ్చినయ్… కోట్ల మంది విశ్వాసాల్ని పాతరేసి, శబరిమలలో రుతుస్త్రీలను ప్రవేశపెట్టిన కేరళ నాస్తికత్వం తరువాత లెంపలేసుకుంది… మళ్లీ దాని జోలికి పోవడం లేదు… అలాగే పంద్రాగస్టు వేడుకలు కూడా… సో, ఈ పంద్రాగస్టు పతాకరెపరెపలు కూడా కడుపులో నుంచి వచ్చిన నిజమైన ప్రేమ ఏమీ కాదు… తప్పనిసరై…!! (ఈ స్టోరీ ఏ తెలుగు పత్రికలోనూ కనిపించలేదు… చివరకు ప్రజాశక్తి అనబడే సీపీఎం సొంత పత్రికలో కూడా…)
Share this Article