అందరికీ నీతులు చెప్పేవాళ్లు… అందరికన్నా నీతిమంతులుగా ఉండేందుకు ప్రయత్నించాలి..! ముందుగా కేరళలోని ఓ కేసు ఏమిటో చదవండి… నిన్న తిరువల్ల పోలీసులు 39 ఏళ్ల సి.ఇ. సాజి అనే వ్యక్తిని అరెస్టు చేశారు… ఆయన అధికార పార్టీ సీపీఎం సభ్యుడు… తనపై కేసు ఏమిటయ్యా అంటే..? తమ పార్టీకే చెందిన ఓ మహిళ నగ్న వీడియోను ఆన్లైన్లో సర్క్యులేషన్లో పెట్టాడు… అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది… ఈ కేసులో సాజితోపాటు మరో పదకొండు మంది నిందితులు, సాజి అరెస్టు కాగా, మిగతావాళ్లు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు… ఈ కేసులో ప్రధాన నిందితులు సీపీఎం బ్రాంచ్ సెక్రెటరీ సీసీ సాజిమన్, పార్టీ యువజన విభాగం డీవైఎఫ్ఐ లీడర్ నాసర్… ఆ మహిళ బట్టలు విప్పి, ఫోటోలు తీసి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారనేది పోలీసుల అభియోగం… నిజం చెప్పాలంటే సీరియస్ కేసు…
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏం చెప్పిందంటే..? ‘‘గత మేలో వాళ్లిద్దరూ నన్ను ఓ కారులో బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారు… సెడెటివ్ కలిపిన డ్రింక్ తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారు… రెండు లక్షలు ఇవ్వాలని బెదిరించారు, ఇవ్వకపోతే నగ్నదృశ్యాలను సోషల్ మీడియాలో పెడతామన్నారు… ఈ దారుణంలో ఓ లాయర్ కూడా ఉన్నాడు..’’ అసలే అధికార పార్టీ సభ్యుడాయె… పోలీసులు స్వేచ్ఛగా కేసు పెట్టేందుకు వెనకాముందు… కానీ సొసైటీ నుంచి విమర్శలు పెరిగేసరికి పోలీసులు ఇక కేసు పెట్టారు… దర్యాప్తు చేస్తున్నారు… ఇవండీ కేసు పూర్వాపరాలు…
(పార్టీ ప్రతీకాత్మక చిత్రం)
Ads
మామూలుగా మహిళల హక్కులు, స్వేచ్ఛతో పాటు వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాలు వెంటనే స్పందిస్తుంటాయి కదా… మరి ఆ పార్టీకే చెందిన ఓ మహిళకు అదే పార్టీకి చెందిన సభ్యులతో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైతే సీపీఎం ఇంకెలా స్పందించాలి..? సీరియస్‌గా వ్యవహరిస్తుందని అనుకుంటాం కదా సహజంగానే… కానీ జరిగేది వేరు, జరుగుతున్నదీ వేరు… ఈ సాజిమాన్ మీద గతంలో కూడా ఓ కేసుంది… ఓ వివాహిత గర్భం దాల్చడానికి కారకుడై, డీఎన్ఏ రిపోర్టు కూడా తారుమారు చేయడానికి ప్రయత్నించాడు… దీనికి తన రాజకీయ నేపథ్యాన్ని వాడుకున్నాడు… అంతర్గతంగా ఒత్తిడి పెరిగి పార్టీ తనను లోకల్ కమిటీ సభ్యత్వం నుంచి బహిష్కరించింది… కానీ తరువాత కొట్టాలి బ్రాంచ్‌కు ఏకంగా కార్యదర్శిని చేసింది, అంటే బహుమానమా..?
ఇంకా అయిపోలేదు… ఆ కేసులో ఇతర నిందితులు పార్టీ రీజనల్ కమిటీ ఆఫీసులో తలదాచుకుంటున్నారని మరో గోల… పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శ… అన్నింటికన్నా విభ్రాంతిని కలిగించింది ఏమిటంటే..? సీపీఎం తన సొంత పార్టీ బాధితురాలి పట్ల సానుభూతిని, సంఘీభావాన్ని చూపాల్సింది పోయి, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది…!! అంటే బాధితురాలికే శిక్షా..?! సస్పెన్షన్ ఎందుకో తెలుసా..? సొంత పార్టీ సభ్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకట… దారుణం… ఇదే విషయాన్ని జర్నలిస్టులు అడిగితే పార్టీ ఏరియా కార్యదర్శి ఫ్రాన్సిస్ ఆంటోనీ ‘‘అబ్బే, లైంగిక దాడి, వేధింపులకు సంబంధించి మాకేమీ ఫిర్యాదు రాలేదు, వస్తే, ఒకవేళ నిజమని తేలితే యాక్షన్ తీసుకుంటాం కదా… మహిళా సంఘం ఈమెపై వేరే ఫిర్యాదు చేసింది, అందుకని ఈమెను సస్పెండ్ చేశాం…’’ అనేశాడు తేలికగా…!! ఇంకా చెప్పుకోవడానికి, వివరంగా విశ్లేషించుకోవడానికి ఏం మిగిలింది..?!!
Share this Article