పర్ సపోజ్… హిందూ మత, ఆధ్యాత్మిక ద్వేషంతో కసిగా శబరిమల గుళ్లోకి రుతుస్త్రీలను ప్రవేశపెట్టిన కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ గట్టిగా చెంపలేసుకుని, హరివరాసనం పాడుకుంటూ, ఇరుముడి సర్దుకుంటూ గుడికి వెళ్లి సాగిలబడితే ఎలా ఉంటుంది..? పోనీ, తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలకు బృందా కారత్ హాజరై బతుకమ్మ ఆడితే..? కనీసం బోనం ఎత్తితే..? సీతారాం ఏచూరి వైష్ణో, అమరనాథ్ నుంచి దిగువన రామేశ్వరం దాకా ఆదిశంకరాచార్యుల తరహాలో తీర్థయాత్ర చేపడితే..?
ఆశ్చర్యపోకండి… ఎహె, ఆ పార్టీ ప్యూర్ నాస్తికం, హేతువాదం, పదార్థవాదం, యదార్థవాదం, మతవ్యతిరేకం… నాన్సెన్స్, ఈ దేవుళ్ల కొలువు చేయడం ఏమిటి..? నెవ్వర్… మేం నమ్మలేం అంటారా..? కాలం ఎప్పుడూ ఒకేరీతిలో ఉండదండీ… మారుతూ ఉంటుంది, ఉండాలి, లేకపోతే కుదరదు… గద్దర్ గుళ్లల్లో శెల్ల జాపి అక్షింతలు, అయ్యవార్ల ఆశీస్సులు స్వీకరించడం లేదా..? సీపీఐ నారాయణ తిరుమల పోలేదా, స్వరూపానందను కలవలేదా..? కమ్యూనిస్టులు అయినంతమాత్రాన మడికట్టుకోవద్దని ఏ సిద్ధాంతకర్త చెప్పాడు..?
అంతెందుకు..? క్రిస్టియన్లే అయినా రాహుల్ గాంధీ నేను కశ్మీర్ బ్రాహ్మణుడిని అని లోకమంతా వినిపించేలా చెప్పడం లేదా..? జంధ్యం సర్దుకుంటూ గుళ్లో పొర్లుదండాలు పెట్టడం లేదా..? ప్రియాంకగాంధీ గంగ స్నానాలు, జపాలు ఆచరించడం లేదా..? అఫ్‌కోర్స్, ఎన్నికల సమయంలోనే చేసినా సరే, అవసరానికి హిందూ దేవుళ్లు, మతం, గుళ్లు, ఉత్సవాలు గుర్తొస్తున్నాయా లేదా..? జగన్ పుష్కర స్నానాలు, పంచాంగ శ్రవణాలు, తిరుమల దర్శనాలు చేయడం లేదా..?
Ads
రాజకీయాల్లో ఏదైనా ఆచరణీయమే… ఇన్నాళ్లూ ఎర్రజెండా నాస్తికకళను తగ్గించుకోలేదు… కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ విజృంభణ పెరిగిపోయేసరికి ఇక సిద్ధాంతపరంగానే కాదు, కాషాయం బ్యాచులతో ఇక సాంస్కృతిక పోరాటం కూడా చేస్తారట… వాళ్లకు దీటుగా గుళ్లు, ఉత్సవాలు, దేవుళ్ల కార్యక్రమాల్లో దూకుడుగా పాలుపంచుకుంటారట… ఎవరో కాదు, తమిళనాడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ స్వయంగా చెబుతున్నాడు… పార్టీ వార్షిక సమావేశాలు మధురైలో వచ్చేవారం జరగబోతున్నాయి… అందులో ఈ తీర్మానం కూడా పెట్టేసి మమ అనిపించేస్తారట…
‘‘అబ్బే, వోట్ల కోసం కాదు, మేం కులం, మతం ప్రాతిపదికన వోట్లు అడగబోం… తమిళనాట బోలెడు గుళ్ల ఉత్సవాలు మతసామరస్యాన్ని, సెక్యులరిజాన్ని బోధిస్తుంటాయి… ఇప్పుడవి ప్రమాదంలో పడ్డాయి… వాటిని రక్షించడానికే మేం దేవుడు, మతం బాటను పట్టాల్సి వస్తోంది..’’ అంటున్నాడు ఆయన… గుడ్, ఆల్‌రెడీ శబరిమల విషయంలో ప్రజల మనోభావాలు గాయపడినందుకు సీపీఐ చెంపలేసుకుంది… అయితే పార్టీ సిద్ధాంతాలు మార్చేసుకుని, అర్జెంటుగా అందరూ విశ్వాసులు (దేవుడిని నమ్మేవాళ్లు) అయిపోరు… ఇదీ రాజకీయ పోరాట వ్యూహం అన్నమాట…
సో, తమ్మినేని వీరభద్రం భయ్యా, ఈసారి భద్రాచలం రాముడి కల్యాణోత్సవానికి పార్టీ తరఫున ముత్యాల తలంబ్రాలు తీసుకువెళ్లండి, పర్లేదు, ప్రభుత్వంతోపాటు భక్తులూ సమర్పించవచ్చు… కామ్రేడ్ వి.శ్రీనివాసరావూ, ముందుగా తిరుమల దర్శనం చేసుకుని, అక్కడి నుంచి ఈ సిద్ధాంత మార్పిడికి శ్రీకారం చుడదాం… డివిజన్ల వారీగా పార్టీ ఆఫీసుల్లో సత్యనారాయణవ్రతాలు ఏర్పాటు చేస్తే బెటరేమో కూడా ఇద్దరు కార్యదర్శులూ మథనం సాగించాలని మనవి… ఏదో, ఆ బెజవాడ అమ్మవారి దయ వల్ల ఈ సిద్ధాంతమార్పిడి సజావుగా జరగాలని కోరుకుందాం…!!
Share this Article