Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తొట్లె వేసుడు… నామకరణం… ఉయ్యాల్లో వేయడం… మరి ఈ డోలారోహణం ఏమిటో…

June 30, 2023 by M S R

డోలారోహణం అనగా ఉయ్యాల్లో వెయ్యడం… తెలుగు ఉయ్యాల వద్దు, సంస్కృత డోల ముద్దు…

ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు వేయడం సాధారణం. లేదా అత్యధిక మంది వాడే భాష సహజంగా గొప్పది అనుకుంటాం. ఈ కోణంలో చూసినప్పుడు ఆధునిక కాలంలో నిత్యవ్యవహారంలో వాడుకలో లేనే లేని భాష- సంస్కృతం. ఆ సంస్కృతం గొప్పది అనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి.

1. వేదాలు, పురాణాలు ఇతర భారతీయ పురాతన గ్రంథాలన్నీ మొదట సంస్కృతంలోనే ఉండేవి.
2 . ఆధ్యాత్మిక సాహిత్యం, మంత్ర భాగం సంస్కృతమే.
3. స్వాతంత్రానికి ముందు వరకు రాజులు ఎక్కువ ప్రోత్సహించిన భాష- సంస్కృతం.
4 . శాస్త్ర గ్రంథాలన్నీ మొదట సంస్కృతంలోనే ఉండేవి.
5. భారతీయ భాషలన్నిటికి సంస్కృతం మూలం అన్న నమ్మకం.
6. ఇప్పుడు ఇంగ్లీషు మాట్లాడితేనే మనుషులుగా గుర్తిస్తున్నట్లు…ఒకప్పుడు సంస్కృతం తెలిస్తేనే గొప్పవారిగా గుర్తించేవారు.
7. పొరుగింటి పుల్లకూర రుచి.
8. ఆధిపత్య ధోరణి.
9. అగ్రవర్ణాలు ఎక్కువగా ప్రోత్సహించడం
ఇంకా అనేకానేక కారణాలున్నాయి కానీ… అవన్నీ ఇక్కడ అనవసరం.

Ads

“నిండు నూరేళ్లు చల్లంగ ఉండు”
అన్నది పదహారణాల అచ్చ తెలుగు మాట.
“శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అన్నది సంస్కృత వేదాశీర్వచనం.
నిజానికి అర్థంలో రెండూ ఒకటే. కానీ మనకు “చల్లంగ ఉండు” అంటే మొరటుగా, పట్టించుకోనట్లుగా, తేలికగా అనిపిస్తుంది. “శతమానం భవతి” అనగానే గంభీరంగా, మహా మంత్ర ఆశీర్వచనంగా, చాలా పవిత్రంగా, గొప్ప మర్యాదగా అనిపిస్తుంది.
భాషకు సంబంధించి మన మనసులో ఉన్న అభిప్రాయాలను బట్టి వీటి విలువలు ఆధారపడి ఉంటాయి. ఇంతకంటే ఈ చర్చలోకి వెళితే సంప్రదాయవాదుల మనసు గాయపడుతుంది. వదిలేద్దాం.

“కట్టెదుట వైకుంఠము కాణాచయిన కొండ, తెట్టెలాయె మహిమలే, తిరుమల కొండ” అని అన్నమయ్య ఏరికోరి తెలుగును నూరి నూరి పదం పాడితే వెంకన్న నాలుగు మాడవీధుల్లో ఆనందపరవశంతో చిందులేశాడు.
“లావొక్కింతయు లేదు…” అని పోతపోసిన తెలుగులో పోతన గజేంద్రుడు ఏడిస్తే అలవైకుంఠపురంబు వదిలి శ్రీమన్నారాయణుడు నేరుగా వచ్చాడు.
“ఓరామా! నీ నామమెంత రుచిరా?” అని రామదాసు తెలుగు కండ చక్కెర కలిపి పాడితే ఆ తీపి రుచిని భద్రాద్రి రామయ్య కూడా ఆస్వాదించాడు.
“నగుమోము కనలేని నా జాలి తెలిసీ…” అని త్యాగయ్య తమిళగడ్డ మీద అచ్చ తెలుగులో గొంతెత్తితే జాలిగల రాముడు అయోధ్య వదిలి మనోవేగంతో కావేరీ తీరానికి వచ్చాడు.
అన్నమయ్య, పోతన, రామదాసు, త్యాగయ్యలు సంస్కృతంలో అపార పాండిత్యం ఉన్నవారు. అయితే వారు తెలుగువారు. తెలుగు భాషాభిమానులు. ఇలాంటివారు పట్టుమని పదిమంది పట్టుబట్టి తెలుగులో రాయడం వల్ల తెలుగు ఈమాత్రమయినా బతికి బట్టగట్టగలిగింది.

సంస్కృతం మీద మన ప్రేమ కంటిని మించిన కాటుక వంటిది. కంటికి కాటుక అందం. కానీ కన్ను కనపడనంతగా కాటుక పులుముకుంటే కళ్లు పోతాయి. చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటుంది. భాషా పరిణామక్రమంలో ఎంతో కొంత మూల రూపాలు, ఇతర భాషల పదాలు వస్తాయి. సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకుని తెలుగును చిన్న చూపు చూసిన మన నిర్లక్ష్యం ఇప్పుడు మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్లు ఉంది.

తెలుగు కూడు, బువ్వ, ముద్ద, ఎంగిలిపడు మొరటు, అనాగరికం. సంస్కృత భోజనం, ఆహారం, ఉపాహారం, అన్నం చాలా గొప్పవి. నాజూకయినవి. మొక్కుకు దిక్కు లేదు. నమస్కారం సంస్కారవంతమైనది. చదువు పనికి రానిది. విద్య గొప్పది. తుండు గుడ్డ పనికిరానిది. ఉత్తరీయం మహా గొప్పది. కాపు కాయకూడదు. ఫలసాయమే రావాలి. తిండి గింజలు తినకూడదు. ధాన్యమే ధ్యానంగా తినాలి. ఎండ పొద్దు వద్దు. మధ్యాహ్నం ముద్దు.
ఇలా తెలుగు భాషలో అందంగా, అద్భుతంగా, సహజంగా ఉన్న మాటలను వాడడం మానేసి సంస్కృతం మాటలను వాడడం శతాబ్దాల క్రితమే మొదలు పెట్టాం. తెలుగు అధికార భాష, తెలుగు మాతృ భాష అన్న మాటల్లో కూడా అధికార, మాతృ మాటలు తెలుగు కాదు. సంస్కృతం.

భాషకు సంబంధించి మనది ప్రతీకాత్మక లేదా సంకేత బాధ. నిజం బాధ కాదు. తెలుగు మీడియా ప్రామాణిక భాషలో పారిభాషిక పదాలన్నీ సంస్కృతమే. ఐక్య రాజ్య సమితి, అణ్వాయుధం, శిఖరాగ్ర సమావేశం
శీతలీకరణ కేంద్రం, ప్రశ్నోత్తర సమయం, సభాపతి, అనంతర పరిణామం, స్నాతకోత్సవం, విద్యాభ్యాసం, గృహ ప్రవేశం, ప్రత్యక్ష ప్రసారం… ఇవే మాటలకు తమిళంలో ఏయే మాటలు వాడుతున్నారో తెలుసుకుంటే తెలుగులో తెలుగు ఎంతో తెలిసిపోతుంది.
మనం రోజూ వాడే మాటల్లో ఏది తెలుగో? ఏది సంస్కృతమో? తెలుసుకుంటే మన సంస్కృతం మోజు ఎంత బలమయినదో పాలు తాగే పసిపిల్లలకు కూడా అర్థమైపోతుంది. గడచిన యాభై ఏళ్ళల్లో తెలుగులో సంస్కృతం స్థానాన్ని ఇంగ్లీషు ఆక్రమించింది.
ఈ పరిణామ క్రమంలో చూసినప్పుడు తెలుగు తనకు తానుగా ఎందుకు వెనక్కు వెళ్ళిపోతోందో? ఎవరికి వారు అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మనవడి “డోలారోహణం” కార్యక్రమం హైదరాబాద్ లో ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. రావాల్సిన ముఖ్యులందరూ వచ్చారు. రావాలి కూడా. కలవారి ఇళ్లల్లో నిత్యోత్సవాలు లోక కల్యాణాల్లా జరుగుతూ ఉంటాయి. ఎవరిష్టం వారిది. అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు.

“డోలారోహణం” అనగానేమి? అని చాలామంది గూగులమ్మను, పండితులను ఆశ్రయించారు. బిడ్డను తొలిసారి ఉయ్యాలలో వేసే ఒక పండుగ. కోస్తాలో అది బారసాల; రాయలసీమలో తొట్టెలో వెయ్యడం లేదా ఉయ్యాల్లో వెయ్యడం ( అన్నమయ్య నాటికే ఉయ్యాల్లో వెయ్యడం, ఉయ్యాల పండగ, ఉయ్యాలోత్సవం అన్న మాటలు వాడుకలో ఉన్నాయి) తెలంగాణాలో “తొట్లె”, తొట్లల యేసుడు, ఇరవై ఒకటో రోజు (పేరు పెట్టడం, ఉయ్యాల్లో వేయడం కలిపి) అని జరుపుకుంటున్నారు.

మధ్యలో ఎవరు, ఎప్పుడు ప్రవేశపెట్టారో కానీ తెలంగాణాలో అద్భుతమయిన మాండలికపు మాట “తొట్లల యేసుడు” కాస్త “డోలారోహణం” అని ఆహ్వాన పత్రికల్లో సంస్కృతీకరింపబడింది.

అందరూ అంటున్నారని మనవడి తొట్ల యేసుడుకు “డోలారోహణం” అని రేవంత్ రెడ్డి కూడా పేరు పెట్టుకుని ఉండవచ్చు. మీడియా కూడా ఆ మాటను అలాగే వాడి ఉండవచ్చు.

పుట్టినా…పుట్టినట్లు కాని దేవుడికేనా…డోలారోహణ?
పుట్టిన జీవుడికి లేదా?
అద్వైత భావనలో దేవుడు- జీవుడు ఒకటి కాదా?
అని తర్కం లేవదీస్తే…తర్కడోలలో కళ్లు తెరిచి “డోలాయామ్…చల డోలాయామ్…”అని సంస్కృత నిద్రలోకి జారుకోవడం తప్ప చేయగలిగింది లేదు!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త ఎఐ పంచాయితీ… కథలూ, క్లైమాక్సులూ మార్చేసి రీరిలీజులు…
  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…
  • యోగీ భాయ్… ఎవరో గానీ నిన్ను ముందుజాగ్రత్తగా తొక్కేస్తున్నారు భయ్యా…
  • ‘‘గతేడాది బతికే ఉన్నానేమో గుర్తులేదు.., ఇప్పుడయితే బతికే ఉన్నా.,.‘‘
  • బీసీ రిజర్వేషన్లు… క్రెడిట్ రేవంత్‌రెడ్డిది… ఎవరెవరో హైజాక్ ప్రయత్నాలు…
  • కీచక ప్రజ్వల్ కేసు..! న్యాయవ్యవస్థపై ఆశల్ని బతికించే తీర్పు..!!
  • వినుడు వినుడు విజయవాడ వెతలూ… వినుడీ జనులారా..!!
  • ఎవరు నిజమైన జర్నలిస్టు అనే ప్రశ్న సరే… అసలు జర్నలిస్టు అంటే ఎవరు..?
  • ఆహ్లాదానికీ అసభ్యతకూ నడుమ గీత చెరిపేశాడు రాఘవేంద్రుడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions