మనకేమైనా ఆ హిందీ పాటలన్నీ అర్థమవుతాయా..? ఆ ట్యూన్లన్నీ మనకు ఎరుక ఉన్నవేనా..? వాటిని పదే పదే వింటుంటామా ఏం..? తక్కువే కదా… చాలా తక్కువ కదా… కానీ నాన్-హిందీ శ్రోతలను, ప్రేక్షకులను సైతం ఇండియన్ ఐడల్ మ్యూజిక్ ప్రోగ్రాం ఎందుకు ఆకర్షిస్తోంది..? ఎందుకంత రక్తికడుతోంది..? దేశంలోకెల్లా టాప్ రియాలిటీ షోల జాబితాలోకి ఎందుకు వస్తోంది..? సీరియళ్ల స్థాయిలో రేటింగ్స్ ఎలా సంపాదిస్తోంది..? అసలు ఏముంది అందులో..? మన శిరీష భాగవతుల ఇప్పుడా షోలో లేదు… మన షణ్ముఖ ప్రియను నార్త్ వ్యూయర్స్ టార్గెట్ చేసి, ట్రోల్ చేస్తున్నారు… అవునూ, ఆ హిందీ షో మనమెందుకు చూస్తున్నాం…? ఇంట్రస్టింగు ప్రశ్న కదా… ఇదంతా సోనీ టీవీ వాళ్ల క్రియేటివ్ టీం శ్రమ, ప్రయాస, ఆలోచన, ప్రయత్నం… ఎప్పటికప్పుడు ఓ కొత్తదనాన్ని అద్దుతున్నారు… ఆ కొత్తదనానికి ఉద్వేగాన్ని జతచేస్తున్నారు… కన్నీటిని, చప్పట్లను మిళాయిస్తున్నారు… ఒకసారి హిందీ రియాలిటీ షోల తీరు చూశాక తెలుగు రియాలిటీ షోలను తలుచుకుంటే, ఆ నాసిరకం క్రియేటివిటీని చూస్తే జాలి, నవ్వు ఒకేసారి కలుగుతయ్… పక్కా…
- ఒక మహిళ… 76 ఏళ్లు… సీరియళ్లు చూస్తూ, మంచం దిగకుండా పెత్తనం చలాయించడం లేదు ఆమె… పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 దాకా రకరకాల స్నాక్స్, చిప్స్, టిఫిన్స్ చేస్తోంది… కరోనా కాలంలో దెబ్బతిన్న ఫుడ్ బిజినెస్‌ను చక్కబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది…
- మరొక మహిళ… 68 ఏళ్లు… పేదరికం కారణంగా పిల్లల్ని పెద్దగా చదివించలేదు, దొరికిన పనల్లా చేస్తూ ఉంటుంది, ఓసారి భర్తకు అనారోగ్యం, ఎంఆర్ఐ కంపల్సరీ అన్నారు, కానీ 5000 కావాలి… డబ్బుల్లేవు, ఎవరో చెప్పగా విన్నది, వృద్ధుల మారథాన్ పోటీ… వెళ్లింది, పరుగు తీసింది… గెలిచింది…
- ఒకాయన వయస్సు 62 ఏళ్లు… 50లో ఉన్నప్పుడు ఏమైందో బరువు పెరగసాగాడు… 125 కిలోలకు పెరిగాడు, ఇల్లు కదిలేవాడు కాదు, ఒక ఏడాది మంచం దిగలేదు… డిప్రెషన్… అకస్మాత్తుగా తనకుతానే సంకల్పం చెప్పుకున్నాడు… బరువు తగ్గే రకరకాల మార్గాలు, కసరత్తులు… ఏడాదిలో 50 కిలోలు తగ్గి, ఇప్పుడు 75 కిలోలు… మోడలింగ్ చేస్తున్నాడు… సినిమాల్లో నటిస్తున్నాడు…
- ఒక జంట… భర్త వయస్సు 82, భార్య 76… ఇంకేముంది..? అంతా అయిపోయింది, దేవుడు పిలిచేదాకా నిరీక్షించడమే అని మొత్తం వదిలేసుకోలేదు… సరదాగా ఇన్‌స్టాలో తమ వీడియోలు పెట్టసాగారు, డాన్సులు, ముచ్చట్లు… అన్నీ వైరల్ కాసాగాయి… మంచి ట్రెండింగ్‌లో పడ్డారు… జీవితంలో అంత్య వసంతాన్ని ఆస్వాదిస్తున్నారు…
- ఓచోట లాఫింగ్ క్లబ్, మరోచోట సింగింగ్ క్లబ్… అలాంటి వాళ్లను పిలిచి ఈ వేదికలో కూర్చోబెట్టి, వాళ్లు కోరిన పాటల్ని పాడించి… సీనియర్ సిటిజెన్స్ స్పెషల్ ప్రోగ్రాం చేశారు… ఆ జడ్జిలు, ఆ కంటెస్టెంట్లు, ఆ యాంకర్, ఆ ఆర్కెస్ట్రా వదిలేయండి కాసేపు… ఈ ఉదాహరణలు ఎంత స్పూర్తిదాయకం… 60, 70 దాటగానే అంతా అయిపోయినట్టు కాదు, అసలు ఏమీ అయిపోయినట్టు కాదు అనే ఓ కొత్త స్పూర్తిని, ఉత్సాహాన్ని నింపుతాయి కదా… సో, మ్యూజికల్ షోకు రకరకాల ఫ్లేవర్లు అద్దుతున్నారు… ఏవేవో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు… గుడ్…
- పోనీయ్, కొన్నిసార్లు రక్తికట్టకపోవచ్చు… మ్యూజికల్ షోలో ఈ పైత్యం ఏమిటనే విమర్శలూ రావచ్చు… జానేదేవ్… సినిమా సెలబ్రిటీలనే గెస్టులుగా పిలిచి, చప్పట్లు కొట్టించాలా..? ఎక్కడెక్కడి నుంచో ప్రేక్షకులను తీసుకొచ్చి, విశిష్ట అతిథులను చేయడం వంటి కొత్త ఐడియాలు ఎందుకు చేయకూడదు..? ఇండియన్ ఐడల్ టీం చేస్తున్నది అదే… ఈరోజు మాన్సూన్ స్పెషల్ షో అట… అఫ్ కోర్స్, ఇదంతా దందాయే, రేటింగుల కోసం తాపత్రయమే… కాకపోతే అందులోనే జనానికి ఆనందాన్ని పంచే కాస్త క్రియేటివిటీ…!
Share this Article
Ads