నిజానికి నేను గమనించలేదు ఈ యాడ్… ఓ మిత్రుడు పంపించి, చూస్తుంటే మనసు ద్రవించినట్టయింది అన్నాడు… తను అంతగా ఫీలయ్యాడు అంటే అందులో విషయం ఉన్నట్టే అనుకుని చూశా… కరెక్ట్… టచింగ్… ఎంత బాగుందో…
నిజానికి ప్రసార మాధ్యమాల్లో తమ ఉత్పత్తుల ప్రచారానికి కంపెనీలు బోలెడు యాడ్స్ చేయిస్తుంటాయి… కోట్ల ఖర్చు, క్రియేటివ్ యాడ్ ఏజెన్సీలు… తమ ప్రకటన వినియోగదారుల్ని కనెక్ట్ కావాలి, దానికేం చేయాలి… ఇదొక పరిశ్రమ, ఇదొక ప్రయాస, ఇదొక మథనం…
కొన్ని కంపెనీలు ఏదో యాడ్ ఏజెన్సీకి ఇచ్చేశాంలే అని చేతులు దులుపుకుంటాయి… కానీ కొన్ని కంపెనీలు భిన్నంగా వెళ్తాయి… తమ టేస్ట్ చూపిస్తాయి… తమ ఉత్పత్తి ఆహా ఓహో అని డప్పులు కొట్టవు అవి… ఏదో ఓ ఎమోషన్ బిల్డప్ చేసేలా క్రియేట్ చేయిస్తాయి… తమ బ్రాండ్‌కు వినియోగదారులు అలా కనెక్టయి ఉండేలా జాగ్రత్తపడతాయి… భిన్నంగా, క్రియేటివ్‌గా…
Ads
అమూల్ చూస్తాం కదా… కార్టూన్ తరహా చిత్రాలను వర్తమాన అంశాలపై గీయిస్తూ కొన్ని సెటైరిక్‌గా, కొన్ని అభినందనపూర్వకంగా కొన్ని ఎమోషనల్‌గా ఉంటాయి, వాటికి అభిమానులూ ఉన్నారు… గుండు బాస్ బంగారం యాడ్స్ ఒక టైపు… నేనిప్పుడు చెబుతున్నది పార్లే జీ బిస్కెట్ల యాడ్… అందరికీ తెలిసిన ప్రొడక్ట్… మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే నాణ్యమైన బిస్కెట్లు, ఎన్నిరకాల బిస్కెట్లు మార్కెట్‌ను ముంచెత్తినా సరే, లైఫ్ బాయ్ సబ్బులాగా ఈ బిస్కట్ల సేల్స్ అలాగే ఉంటుంటాయి…
ఇప్పుడు టచింగుగా ఉండే ఓ యాడ్ విడుదల చేసింది… (దిగువన యూట్యూబ్ లింక్ ఉంది)… ఓ టీచర్ తన స్కూల్‌లో చెట్లను రోజూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది… ఓరోజు ఓ అమ్మాయి అడుగుతుంది, చూసుకోవడానికి తోటమాలి ఉన్నాడు కదా, మీకు ఎందుకు వాటితో అంత బంధం అని..! ఆమె చెబుతూ ఉంటుంది, ఫలానా చెట్టు 1995 బ్యాచ్ అమ్మాయి, అదుగో ఆ చెట్టు క్లాసులో టాపర్ వాడు…
వాళ్ల పేర్లతో పెట్టిన మొక్కలు, పెరిగి ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్నాయి… గుర్తొస్తుంటారు… అంటూ తదేకంగా వాటిని చూస్తుంటే ఆ అమ్మాయి ప్యూన్‌ను అడుగుతుంది, ఎందుకీరోజు ఇంకా ఎక్కువగా మేడమ్ ఫీలవుతోంది అని… ఎందుకంటే, ఆమె రిటైర్ కాబోతోంది, వీళ్లందరినీ మిస్ అవుతుంది కదాని.!
సీన్ కట్ చేస్తే… ఆమె రిటైరయ్యే రోజున… ఒక్కో చెట్టు చాటు నుంచి ఒక్కొక్కరే వచ్చి తాము 1995 బ్యాచులో ఎవరమో చెబుతుంటారు… ఆమె ఈ సర్ప్రయిజ్‌కు కదిలిపోతుంది… ఎక్సలెంట్ కదా ఓ రిటైరయ్యే టీచర్‌కు ఇలాంటి వీడ్కోలు… మొదట మాట్లాడిన అమ్మాయి చెబుతుంది, మేడమ్, మీకు మేమిచ్చే ఫేర్వెల్ పార్టీ ఇది అని… టీచర్ ఉద్వేగంగా చూస్తూ ఉంటుంది… అంతే, అదే యాడ్…
ఇదొక చిన్న కథ… ఇందులో మా బిస్కెట్ల నాణ్యత అదీ ఇదీ అనే సోది రొటీన్ ప్రచారం కనిపించదు… ఓ ఎమోషనల్ టచింగు ప్రజెంటేషన్‌తో సాగే బ్రాండ్ ప్రమోషన్… అక్కడక్కడా పిల్లలు ఆ బిస్కెట్లు చేతిలో పట్టుకుని కనిపిస్తారు, అంతే… రియల్లీ టచింగ్ వన్… తుచ్ఛమైన తెలుగు అనువాదాలతో కనిపించే వందల యాడ్స్‌తో పోలిస్తే ఈ యాడ్ వందల రెట్లు బెటర్… బెటర్… అచ్చు పార్లేజీ బిస్కెట్లలాగే..!!
మామూలుగా యాడ్స్ వస్తున్నాయంటే చాలు, వేరే చానెల్ ట్యూన్ చేస్తుంటాం, లేదా ఆ కొద్దిసేపు మ్యూట్ చేసేస్తాం… సెల్ ఫోన్ చూడటంలో మునిగిపోతాం ఆ యాడ్స్ అయిపోయేవరకు… సినిమాల్లో సిగరెట్ పాటల్లాగా… కానీ ఇది అలాంటి సోది యాడ్ కాదు, మరోసారి చూడాలనిపించేది… జీ మానే జీనియస్… జీ మీన్స్ పార్లే జీ…
Share this Article