రాజకీయ లక్ష్యాలతో వండి వార్చే అభూత కథనాలు, అక్షరాలతో దాడులు ఈనాడు పాత్రికేయానికి ఆది నుంచీ ఉన్న అవలక్షణమే… ఆ దరిద్రాన్ని పక్కన పెడితే తెలుగు మీడియాలో ఈనాడే నంబర్ వన్… మిగతా మీడియా ఈనాడును చూసి వాతలు పెట్టుకోవడమే తప్ప సొంత దారుల్లేవు, సొంత క్రియేటివ్ ఐడియాల్లేవు… గతంలో ఈనాడు వార్తారచన, ప్రజెంటేషన్‌కు సంబంధించి కొన్ని ప్రమాణాలు పాటించేది…
వర్తమానంలో ఈనాడు ఏం పబ్లిష్ చేస్తున్నది..? ఇది ఎవరికీ అంతుపట్టని ప్రశ్న… చివరకు రామోజీరావుకు కూడా అంతుపట్టని ప్రశ్న… గతంలో తను చూసుకునేవాడు… తప్పొప్పుల సమీక్ష జరిగేది… వయోభారంతో బాధ్యతల్ని వేరేవాళ్లకు అప్పగించాడు… ఇంకేం, గాడితప్పింది… ప్రమాణాల పతనం వేగంగా ఈనాడును కబళిస్తోంది…
అన్ని పత్రికల్లోనూ ఇదే దరిద్రం అంటారా..? వేరే పత్రికలకూ ఈనాడుకూ తేడా ఉంది… నాణ్యమైన పాత్రికేయం అనేది ఈనాడు బాధ్యత… ఇన్నేళ్లూ సొసైటీ కొన్ని వేల కోట్లను ఇచ్చింది ఈనాడుకు… దానికి ప్రతిగా ఈనాడు నాసిరకం సరుకు, అనగా వార్తల్ని ఇస్తే ఎలా..? కృష్ణా జిల్లా పేజీలో ఓ వార్త చూడగానే అనిపించింది ఇదే…
Ads
రెండు చిన్న చిన్న ఫోటోలు… (చిన్న ఫోటోలకు బదులు పెద్ద ఫోటోలు వేయడం నాణ్యమైన పద్ధతి, అదీ అర్థం కాదు ఈనాడుకు… అఫ్‌కోర్స్, సాక్షి మరీ దారుణం…) మూడు కాలాల స్టోరీ ఇది… విషయం ఏమిటంటే..? ఒకరి ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు పిల్లి మరణించింది… దాన్ని ఇరుగుపొరుగు ఏదో చేసి చంపి ఉంటారని సదరు కుటుంబసభ్యుల సందేహం… దానికి కారణం ఏమిటో తెలుసా..? ఈ పిల్లిని పెంచుకునే ఇంటికి వెనుక వైపు ఉన్న మరో ఇంటిలో చెట్లు ఉన్నాయట…
ఈ పిల్లి చల్లదనం కోసం అప్పుడప్పుడూ ఆ వెనకింటి ఆవరణలోని చెట్ల కిందకు వెళ్లేదట… ఈవిషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగేవట… ఇంకేముంది.? తమ పిల్లిని స్వచ్ఛందమరణమో, ప్రమాదమరణమో, హత్యో తేల్చాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కేసు పెట్టారట… మన పోలీసులకు వేరే పనేముంది..? అత్యంత దయార్ద్ర హృదయులు కదా… కదిలిపోయారు… కన్నీళ్లు పెట్టుకున్నారు… కేసు పెట్టేశారు… దర్యాప్తు చేసి, నిందితులను కఠినంగా శిక్షిస్తారట…
సేమ్, ఈ వార్త, శైలి స్థాయిలోనే ఉంది పోలీసుల అతి ధోరణి కూడా… ప్రస్తుతం ఆ పిల్లి ఏడు వారాల గర్భవతి అట… అది కూడా చూడకుండా, తాము ఓ మనమరాలిగా చూసుకుంటున్న పిల్లిని బలిగొన్నారని ఫిర్యాదుదారుల ఆరోపణట… పోలీసులు అత్యంత శ్రద్ధ తీసుకుని, పిల్లి కళేబరాన్ని భద్రపరిచారట… (పెంపుడు జంతువుల మృతదేహాలను భద్రపరిచే మార్చురీలు ఎక్కడున్నాయబ్బా…) పోస్ట్ మార్టం చేస్తారట… హత్య అని తేలితే అరెస్టులు, రిమాండ్ తప్పవుట… ఈ వార్తకు వాడుకున్న రెండు ఫోటోలు ఆశ్చర్యాన్ని కలిగించాయి… సదరు పిల్లి ఫోటో… ప్లస్ రోదిస్తున్న కుటుంబసభ్యులు అట…
పోలీసులు పెట్టిన ఐపీసీ 429 సెక్షన్ 11 ప్రకారం… జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే కూడా నేరమే… శిక్షార్హమే… ఇక హత్య చేస్తే మరీ పెద్ద నేరం… (50 రూపాయలకన్నా విలువైన జంతువుల పట్ల క్రూరత్వాన్ని చూపొద్దు అని చట్టం… పెంపుడు జంతువుల విలువను ఎలా లెక్కించాలి..?) సో, ఈ వార్తను రాసిన, దిద్దిన, పేజీల్లో పెట్టిన బృందానికి, సదరు పోలీసు బృందానికి ఫుల్లు పని… ఈ మిస్టరీని తేల్చి, ఆ తల్లడిల్లిపోతున్న కుటుంబాన్ని ఓదార్చే బాద్యత ఈ బృందాలదే…!!
Share this Article