.
సీన్ వన్… చిత్తూరు జిల్లా… ఒక మహిళా మండల వ్యవసాయాధికారిని విపరీతంగా వేధిస్తున్న ఇద్దరు విశాలాంధ్ర విలేకరులపై కలెక్టర్ సుమిత్ కుమార్ కేసు పెట్టాలని ఆదేశించాడు… ఒకరి అక్రెడిటేషన్ రద్దు చేశాడు… విలేఖరికి ఫోన్ చేసి, ప్రభుత్వ సిబ్బంది జోలికి వస్తే నీ సంగతి చూస్తానని హెచ్చరించాడు…
తన ఫోన్ బెదిరింపులు ఓ కలెక్టర్ స్థాయికి తగినట్టు లేవని అడిగితే… క్రిమినల్స్‌తో క్రిమినల్ భాషే మాట్లాడాలి అని సమర్థించుకున్నాడు… సరే, సదరు రిపోర్టర్లదే తప్పు కనిపిస్తున్నా ఆ పత్రిక యజమాని సీపీఐ కదా, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ వాళ్లను వెనకేసుకురావడం విభ్రాంతికరం… ఫాఫం సీపీఐ…
Ads
చీఫ్ సెక్రెటరీ విజయానంద్‌ను కలిసి కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరాడు… కలెక్టర్ దురుసు ధోరణిని ఖండిద్దాం సరే గానీ, మరి నీ విలేకరులపై నువ్వు తీసుకున్న యాక్షన్ ఏమిటి కామ్రేడ్..? ఓ మహిళా ఆఫీసర్ పట్ల వాళ్ల ప్రవర్తన మాటేమిటి..?

- ఒక కమ్యూనిస్టు పార్టీకి నువ్వు జాతీయ కార్యదర్శివి, మరిచిపోకు కామ్రేడ్…! పార్టీకి కూడా ఓ ఇమేజ్ ఉంటుంది… కాపాడటం నాయకుడి బాధ్యత..!!
సీన్ టు… అదే చిత్తూరు జిల్లా… ఓ వడ్డీ వ్యాపారికి మద్దతుగా ఇద్దరు రిపోర్టర్లు ఓ వ్యక్తిని బెదిరిస్తే, ఒత్తిళ్లు తెస్తే… ఆయన కాస్తా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు… తరువాత కోలుకుని ఫిర్యాదు చేస్తే, పోలీసులు సదరు వడ్డీవ్యాపారితోపాటు ఆ ఇద్దరు విలేకరులపై కేసు నమోదు చేశారు… ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు అట, అవి ఏ చానెళ్లో తెలియదు… ఇదీ వార్త…

సీన్ త్రీ… సేమ్, చిత్తూరు జిల్లా… పాలసముద్రం మండలం… మండల ఆంధ్రప్రభ రిపోర్టర్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ (మహిళ) ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు… అర్ధరాత్రుల్లో వాట్స్అప్ వీడియో కాల్ చేయడం, ఆమె వ్యతిరేకించడంతో వరుసగా వ్యతిరేక వార్తలు రాయడం, ఆమె అద్దెకు ఉన్న ఇంటి యజమానితో మాట్లాడి ఖాళీ చేయించడం… చేసేది ఏమీ లేక లాస్ట్ స్టేజ్ లో కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్‌కు విలేఖరితో పాటు మరో ఇద్దరిపై కూడా ఆమె ఫిర్యాదు చేసింది…”

ఎంక్వయిరీ చేసి కేసు పెట్టాలని కలెక్టర్ అప్పటికప్పుడు ఆదేశించాడు… కేసు నమోదు చేశారు… ఇక్కడ కలెక్టర్ సుమిత్ కుమార్ చేస్తున్నది కరెక్టే… తప్పుపట్టడానికి ఏమీ లేదు… కాకపోతే భాష నాటు, దురుసు, పెళుసు… కానీ గ్రామీణ పాత్రికేయం చేస్తున్నది ఏమిటి..? పైన చెప్పినవి జస్ట్, సరళ ఉదాహరణలు… బోలెడు మంది నొటోరియస్ గ్యాంగ్‌స్టర్లు ఉన్నారు..!!
ప్రింట్, టీవీ మాత్రమే కాదు… యూట్యూబ్ చానెళ్ల పేరిట ఒరిజినల్స్, ఫేక్ కంట్రిబ్యూటర్లు… ఫక్తు బ్లాక్ మెయిలింగ్ మాత్రమేనా..? పైన చెప్పుకున్న ఉదాహరణలు, మహిళా అధికార్లకు వేధింపులు… అర్బన్ కంట్రిబ్యూటర్లు తక్కువేమీ కాదు, ఇంకాస్త ఎక్కువే… జర్నలిజం సొసైటీకి ప్రస్తుతం ఏమాత్రం ఉపయోగకరం కాదు… హానికరం…
ఈ మాట అన్నందుకు బాధే, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టు..! కానీ నిజం నిష్ఠురమే… ఓ కాలనీలో ఇల్లు కట్టుకుంటున్న ఓ చిన్న బిల్డర్ దగ్గరకు వచ్చారు విలేకర్స్… వారిలో ఎవరు ఫేకో, ఎవరు ఒరిజినలో తెలియదు… వేల రూపాయలు చెల్లించాల్సిందేనట… ఎలాగోలా ఏదో చెల్లించేసి ఓ మాటన్నాడు…
‘‘హిజ్రాలు నయం, ఒకసారి ఇస్తే, మళ్లీ ఎవరూ రారు… వాళ్ల దందాలో నీతి ఉంది… మీవాళ్లు మరీ హీనం… రెండుమూడు గ్రూపులు వస్తాయి, బెదిరిస్తాయి…’’ విలేకరులకు ప్రత్యేక హక్కులు, అధికారులు ఏమీ ఉండవు… చిత్తూరు కలెక్టర్‌లాగే ప్రతి అధికారీ కేసులు పెట్టి, బుక్ చేస్తుంటే గానీ, అసలు తత్వం బోధపడదు… ఇక్కడిదాకా తెచ్చుకోవడం కేవలం స్వయంకృతం…!! ఇంకా ఎంత తవ్వితే అంత దుర్గంధం… అందుకే ఆపేస్తున్నా..!!
మొన్న ఓ కంట్రిబ్యూటర్ అన్నాడు… ‘‘మాకెేమైనా జీతాలు ఇస్తారా..? యాడ్స్ తేవాలి, కాపీలు బుక్ చేయాలి, వార్త మిస్సయితే తిట్లు, పైవాళ్లకు కూడా సంపాదించి పెట్టాలి… మరేం చేయాలి..?’’ నిజమే… మరెవడు ఈ పని చేయమని నిర్బంధిస్తున్నారు నిన్ను..?! గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ…!!!
- చివరగా… డిజిటల్, వెబ్, యూట్యూబ్, కంటెంట్ రైటర్లు, రిపోర్టర్లను కూడా జర్నలిస్టుల జాబితాలో చేర్చిందట కేంద్ర సర్కారు, తక్షణం అందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని ఏదో జర్నలిస్టుల సంఘం డిమాండ్ చేసింది… చచ్చింది గొర్రె… అనగా సొసైటీ..!! అసలు ప్రభుత్వం అక్రెడిటేషన్లు ఎందుకివ్వాలి ఎవరికైనా..!?
Share this Article