ఈగలు పగబడతాయా..? ఓ ప్రశ్న… ఎందుకు పగబట్టవు..? రాజమౌళి తీసిన ఈగ అనే ఫిక్షన్ చూడలేదా..? ఈగలకూ పునర్జన్మలుంటయ్, పగలుంటయ్, ప్రేమలుంటయ్, హీరోయిక్ చేష్టలుంటయ్…… హహహ… ఎహె, అది సినిమా, ఓ కల్పన, ఆఫ్టరాల్ ఈగలేమిటి, అంత సీన్ ఏమిటి అని నవ్వొస్తోందా..? మనిషి కూడా జంతువే కదా, మరి మనిషికి ఉన్నట్టే జంతువులకు ఉద్వేగాలుంటయ్ కదా… పునర్జన్మలు నాన్సెన్స్ అని కొట్టిపారేసినా కోపం, భయం, ఆకలి, సంతానం మీద ప్రేమ, రక్షణకు ప్రయత్నం ఇవన్నీ ప్రతీ జీవిలోనూ చూస్తుంటాం కదా… ఉద్వేగం అనేది జీవలక్షణం అనే ప్రతివాదన కూడా ఉంటుంది…
పోనీ, పాములు పగబడతాయి అనే అంశం మీద టన్నుల కొద్దీ సాహిత్యం, బోలెడు సినిమాలు, పాటలు కూడా చేసేశాం, చదివేశాం, అసలు సర్పశాస్త్రంకన్నా సర్పాలపై సృష్టించబడిన ఫిక్షన్ కొన్ని వందల రెట్లు… ఏనుగులకు కూడా పగలు, ప్రతీకారాలు తెలుసట… ఇవన్నీ వోకే, కాకులు పగబడతాయా..? పర్టిక్యులర్ వ్యక్తులను గుర్తుపెట్టుకుని, వెంటబడి కోపంతో విరుచుకుపడతాయా..? నో, నో, వాటికంత సీన్ ఎక్కడిది అని నవ్వు, కోపం కలగలిపిన మొహం పెట్టేయకండి… ఆ ఊరివాళ్లు మాత్రం ‘అబ్బో, కాకులూ పాముల్లాగే పగబడతయ్ తెలుసా’ అంటున్నారు… ఈ వార్త చదవండి…
‘‘కాకులు పగబడతాయా..? పగబట్టి ఎక్కడున్నా ప్రతీకారం తీర్చుకుంటాయా..? అవుననే అంటున్నారు కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామస్థులు… తమ గ్రామంలో కొందరిపై కాకి పగబట్టి దాడి చేస్తోందని వాపోతున్నారు… దానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…
గ్రామంలో కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఓ కాకి గ్రామస్థుల్లో కొందరిని మాత్రమే టార్గెట్ చేసుకుంది. వారు గుంపులో ఉన్నా సరే ఎగిరొచ్చి, వారిపైనే దాడిచేస్తోంది. గోళ్లతో రక్కుతూ, ముక్కుతో పొడుస్తోందని, మొత్తంగా గ్రామంలోని ఏడుగురిపై అది పగబట్టి దాడిచేస్తోందని గ్రామస్థులు తెలిపారు. గ్రామం నుంచి కాకిని తరిమేందుకు ప్రయత్నిస్తున్నా వెళ్లడం లేదని గ్రామస్థులు తెలిపారు…’’
ఫోఫోవయ్యా, అంతా ట్రాష్… సోషల్ మీడియాలో ఈ ఫేక్ కథలు, కాకరకాయలూ బొచ్చెడు చదివాం అని కొట్టేసేవాళ్లు ఉంటారు… కానీ గుంపులో తోటి కాకి చనిపోతే కాకులన్నీ గుమికూడతయ్, గమనించారా..? కాకులు పగబడతాయో లేదో తెలియదు గానీ, చాలా జీవాలకన్నా కాకుల ఉద్వేగస్థాయి ఖచ్చితంగా ఎక్కువే… అంతెందుకు కాకులు గుమిగూడినా, అరిచినా ఏదో సంకేతం అని హిందువులు విశ్వసిస్తారు… ఆత్మలకు కాకులు సులభ వాహకాలు అంటారు… అందుకే పిండాలు తినడానికి కాకులు రావాలని ఎదురుచూస్తారు… ఇదంతా ఓ కథ…
Ads
2019… మధ్యప్రదేశ్, శివపురి సుమేలా అనే ఊరు… శివ కేవత్ అనే వ్యక్తి ఓ కాకిపిల్లను రక్షించబోతే అది కాస్తా మరణించింది… దాంతో ఇక తనకు నరకం మొదలైంది… బయటికి వస్తే చాలు, కాకుల దళం ఒకటి మీదపడేది, రక్కేది… తప్పనిసరైతే కట్టె పట్టుకుని బయటికి వచ్చేవాడు, కానీ కాకుల్ని కొట్టడానికి భయం, ఇంకా పగబడతాయేమోనని… భోపాల్, బర్కతుల్లా యూనివర్శిటీలో జువాలజీ ప్రొఫెసర్ అశోక్ కుమార్ ముంజల్ ఏమంటాడంటే..? ‘‘మనుషుల మొహాల్ని గుర్తించడం, గుర్తుపెట్టుకోవడం, గుంపులుగా సంఘటితమై ప్రతీకారానికి ప్రయత్నించడం నిజమే… పక్షిజాతిలో అత్యంత తెలివైంది కాకే..’’
నిజంగానే కాకుల గురించి రాస్తూ పోతే… అదో పెద్ద వాయసశాస్త్రం అవుతుంది… 2011 నాటి వార్త ఒకటి గుర్తుచేస్తాను… వాషింగ్టన్ యూనివర్శిటీ నిర్వహించిన ఓ అయిదేళ్ల స్టడీ ఏం చెప్పిందంటే… ‘‘కాకులు మనుషుల మొహాల్ని గుర్తుపెట్టుకుంటయ్… అయిదేళ్లపాటు గుర్తుంచుకోగలవు… కాకులకు ప్రమాదకారులైన వారి గురించి తోటి కాకుల్ని హెచ్చరించగలవు… ష్… అమెరికా మిలిటరీ ఓ దశలో బిన్ లాడెన్ ఆచూకీ పట్టుకోలేక డెస్పరేషన్‌లో ఉన్నప్పుడు, ఈ కాకిస్టడీ, సారీ కాకుల మీద స్టడీ టీంలో ఉన్న John Marzluff ను సంప్రదించింది… మంచి మేలుజాతి కాకుల్ని పట్టుకొస్తాం, శిక్షణనివ్వగలరా..? లాడెన్‌ను పట్టేస్తాయి, మీకు మస్త్ రివార్డులు గ్యారంటీ అని ఆఫర్ కూడా ఇచ్చాయి… ప్రస్తుతానికి వాయసాధ్యాయం మొదటి భాగం సమాప్తం…!!
Share this Article