.
సినిమా రంగం అన్నది ఒక విచిత్రమైన మాయామోహ జలతారు వంటిది. దాని ఆకర్షణ నుండి తప్పించుకోవడం సామాన్యులకు చాలా కష్టం.
అందుకే, వేలాది మంది విద్యావంతులు, బీటెక్, యంటెక్, మెడిసిన్, పిహెచ్.డి లు ఇంకా, అనేక రంగాల్లో నిపుణలయిన వారు, తమ తమ కెరీర్లలో, ఉచ్ఛ స్థితిలో ఉన్న వారు, ఈ సినిమా అనే ఆకర్షణలో పడి, ఏళ్ళ తరబడి అవకాశాల కోసం కృష్ణానగర్ వీధుల్లో, కళ్ళల్లో ఆశలు నింపుకుని, ఏ నాటికైనా తామొక ప్రభంజనం సృష్టించగలమనే అపారమైన నమ్మకంతో తిరుగుతుంటారు.
Ads
నిజానికి వాళ్ళల్లో ఇప్పుడు రాజ్యమేలుతున్న రచయితలు, దర్శకులు, గేయ రచయితల కన్నా ఎంతో ఎక్కువ విద్వత్తు ఉన్నవారు కూడా ఉన్నారు. అయినా, ఎందుకు వారికి అవకాశాలు రావడం లేదు? ఎందుకు వారు ఘోస్ట్ రైటర్స్ గా, క్లాప్ బోర్డు పట్టుకునే అసిస్టెంట్ డైరెక్టర్లుగానే మిగిలిపోతున్నారు?
ఎందుకంటే, ఈ సినిమా రంగం ఒక దుర్భేద్యమైన కోట వంటిది. ఇందులోకి అంత సులభంగా ప్రవేశం దొరకదు. అనునిత్యం, ఈ కోటను కాపాడుకుంటూ ఉండే శక్తులు ఉన్నాయి. నిన్ను కోట బయటనే నిలబెట్టి, నీతో సేవలు చేయించుకుంటారు తప్ప నీకు ప్రవేశం లభించదు.
ఈ కోటలో కుళ్ళు, కుతంత్రం, స్వార్థం, కీర్తి కండూతి, ముఖ్యంగా కులం, బంధుప్రీతి, నెపొటిజమ్ రాజ్యమేలుతుంటాయి. ఇందులో ఇంకో విచిత్రం ఉంది. లోపల ఉన్న వాళ్ళకు కూడా అనేక నిబంధనలు ఉంటాయి. లోపల ఉన్న వాళ్ళకు కూడా బయటవాళ్ళ సహాయం కావాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ఒక పాటల రచయితను లోపలికి అనుమతించారనుకోండి. ఆయనకున్న చిన్నపాటి స్వాతంత్య్రం ఆయన పాటల గది వరకే. అది దాటి, కోటను ఏలుదామని ప్రయత్నిస్తే, కర్కశ పదఘట్టనలో నలిగిపోతారు.
ఇది ఒక పాటల రచయిత కులశేఖర్ సంగతే కాదు, తెలుగు సినిమా రంగాన్ని ఒకప్పుడు ఏలిన సావిత్రి, జమున, కాంతారావు, ఈవెన్ అక్కినేని నాగేశ్వరరావు వంటి మహామహులు, రాజబాబు, పద్మనాభం, పీజే శర్మ వంటి కమెడియన్లు తమ పరిధి దాటి సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించగానే, వారిని కర్కశంగా తొక్కి పడేసి, ప్రేక్షకుల ఆరాధ్యదైవాలైన వారిని, అధఃపాతాళానికి తొక్కి పారేసారు. అక్కినేని వంటి వారు తెలివిగా తప్పుకోని, నటనకు మాత్రమే పరిమితమయి, బయటపడగలిగారు.
నిజానికి వీరంతా సున్నిత హృదయులు. నటనలో అగ్రస్థానానికి చేరినా, వారికి సినిమా నిర్మాణం గురించి ఓనమాలు తెలియవు. తెలుసని వారనుకుంటారు గానీ, అందులోని వ్యవహారాల గురించి అవగాహన ఉండదు.
ఒక సినిమాను నిర్మించాలంటే, 24 క్రాఫ్టుల మీద కొంతైనా అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, దొంగ లెక్కలు రాసే నైపుణ్యం ఉండాలి. తిమ్మిని బమ్మిని చేసి, కాల్ షీట్లు సంపాదించాలి. నిర్మాణ సమయంలో జరిగే అనేక, తమ తోటి వారే చేసే అనేక ఆర్థిక దోపిడీలను పసిగట్టి, నిరోధించగలిగే, 360 డిగ్రీల కుశాగ్రబుద్ధి ఉండాలి.
అవేమీ సినిమా హీరోహీరోయిన్లకు ఉంటాయని అనుకోను. వారికి నటనలోని మెళకువలు తెలుసు గానీ, నిర్మాణంలోని లొసుగులు తెలియవు. అందుకే, అక్కడ ఫెయిలయి, తిరిగి కోలుకోలేక, జీవితాలను నాశనం చేసుకున్నారు.
ఈ కోటలోని చక్రవర్తులు, అరే మన సావిత్రే కదా అని జాలి చూపలేదు. ఆమె పతనావస్థకు చేరుకుంటుంటే సలహా ఇవ్వ లేదు, ఆపలేదు. ఒక్కడూ ఆదుకోలేదు… ఇండస్ట్రీ చాలా క్రూర స్వభావం కలది…
ఇప్పుడంటే సినిమా నిర్మాణం కొంత సులభం అయింది. సినిమాలు తీయడం వరకు ఓకే గానీ, విడుదలకు నానా కష్టాలు పడుతున్నారు.
ఇదంతా ఎందుకంటే, ఈ మధ్యే మరణించిన కులశేఖర్ వృత్తాంతం, ఈ కోటలోని రాజకీయాలకు సజీవ ఉదాహరణ. ఒక మంచి పాట రాయాలంటే ఎంత మేధస్సును రంగరించాలి. సున్నిత భావాలను పలికించే కవి, నిజంగా కూడా సున్నితహృదయులే అయి ఉండాలి. అటువంటి సున్నితహృదయుడైన కవి, సినిమా నిర్మాణ రంగంలోకి వెళ్ళి ఆ మోసాలన్నీ చేసే వారిని కట్టడి చేసి, వారిని నియంత్రించగల కఠినత్వం, కర్కశత్వం లేక ఫెయిలయ్యాడు.
దుర్మార్గుడైన ఒక్క మేనేజరు చాలు మనను నిండా ముంచడానికి. మనకు అదృష్టం ఉంటేనే మంచి మేనేజర్ దొరుకుతాడు. మేనేజర్లు పది రూపాయలు పెట్టాల్సిన చోట పదివేలు వెచ్చింపచేస్తారు. ప్రతీ పనిలో కమీషన్లు దండుకుంటారు. అదంతా చాలా సహజమేనన్నట్టుగా ఇండస్ట్రీ వాళ్ళు, ఆ భాగోతానికి ఆమోద వేస్తారు.
కమీషన్ విలువ పది రూపాయలైనా సరే పది లక్షలు ఐనా సరే, వాటిని దుర్మార్గుడైన మేనేజర్ వదిలిపెట్టడు. ఒక లేని సమస్యను సృష్టించి, ఆ సమస్య అంచుల వరకు తీసుకెళ్ళి అప్పుడు మనను ఆదుకున్నట్టుగా, పరిష్కారం చూపించి, అందులో తన ప్రయోజనం ఉండేటట్టుగా చూసుకుంటాడు. నువ్వు ఎంత మేధావివి అయినా, పదో తరగతి పాస్ కాని వాళ్ళ ముందు చేతులు జోడించి, పరిష్కారం చూపించమని వేడుకోవాల్సిందే!
ఇటువంటి మేనేజర్లు కొత్తగా వచ్చిన నిర్మాతలనే టార్గెట్ చేస్తారు. పెద్ద నిర్మాతల దగ్గర, నిలదొక్కుకున్న వారి దగ్గర వీరి పప్పులు ఉడకవు. అందరూ ఇలా ఉంటారని కాదు. కానీ, చాలా మంది ఇటువంటి వారే. నా మొదటి సినిమా పూర్తి కాగానే, నాకు పని చేసిన మేనేజరు స్వంత ఊరికి వెళ్ళి రెండెకరాల పొలం కొనుక్కున్నాడు.
హైదరాబాదు నగరంలో వాణిజ్య పన్నుల అధికారిగా ఎన్నో సంవత్సరాలు పని చేసిన నాకే టోకరా పెట్టాడు. పది రూపాయలకు బేగం బజారులో దొరికే ప్లాస్టిక్ కత్తికి, రోజుకు ఐదు వందల అద్దె అని చెప్పాడు. నేను ఆ రోజు సాయంత్రం నాకు తెలిసిన ఒక ఉద్యోగితో వంద రూపాయలకి పది కత్తులు తెప్పించాను. లేకపోతే, ఐదు వేలు ఖర్చయ్యేవి.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఇవన్నింటి మీద అవగాహన రావాలంటే, సినిమా నిర్మాణంలో ఎంతో అనుభవం గడించాలి. నేను మంచి పాటలు రాసాను, అవి హిట్ అయ్యాయి కాబట్టి నేను సినిమా నిర్మిస్తానంటే కుదరదు. నిన్ను వాళ్ళు వారించరు. నిర్మాణం చేసి, నువ్వు నాశనమయ్యేంత వరకు చూస్తారే గానీ ఎవ్వరూ సలహాలివ్వరు.
కులశేఖర్ గారు కూడా అటువంటి సంఘర్షణకు, తీవ్రమైన నిరాశకు గురయి, మనో స్థిమితం కోల్పోయి, తర్వాత ఇంకా దిగజారి, చరిత్ర హీనుడై, మరణించాడు. విజేతలను పొగిడే ఈ సమాజం ఓడిన వారిని అక్కున చేర్చుకోదు. నేనున్నానని భుజం, అందించే తోడు కూడా దూరమవుతుంది.
కులశేఖర్ మరణం, సినిమారంగపు కుటిలనీతికి ఒక తార్కాణం. పిచ్చి ప్రయోగాలు చేసే వారికి ఒక హెచ్చరిక.
మనకు మన కుటుంబం ముఖ్యం. వారి క్షేమం ముఖ్యం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రయోగాలైనా చేయండి………… ప్రభాకర్ జైనీ
Share this Article