Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యండమూరి, రాఘవేంద్రరావు కఠినాత్ములు సుమీ… ఆమెను చంపేశారు…

November 6, 2025 by Rishi

.

రాఘవేంద్రుడు ఇంత కఠినాత్ముడని నేనెప్పుడూ అనుకోలేదు ఈ సినిమా వచ్చిందాకా . అతిలోకసుందరి శ్రీదేవి పాత్రను చంపేయటమా ! పాపం శమించుగాక . యండమూరి వీరేంద్రనాధ్ నవలలో షీరో శ్రీదేవి నటించిన పాత్ర ప్రవల్లికే . నాగార్జున కోసం నవలకు చాలా మార్పులు , చేర్పులు , కూర్పులు చేసిన రాఘవేంద్రుడు ప్రవల్లిక పాత్రను బతికించి ఉంటే బాగుండేది . బహుశా శ్రీదేవి నటించిన పాత్ర చనిపోవటం ఈ ఒక్క సినిమాలోనే ఏమో ! ఆమె పాత్ర చనిపోయినా సినిమా సూపర్ హిట్టయింది . బతికి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది .

1988 లోకి వచ్చేశాం.,. చాలా ఇంటర్వ్యూలలో నాగార్జున చెప్పారు . ఈమధ్య జగపతిబాబు ఇంటర్వ్యూలో కూడా ఈ ఆఖరి పోరాటం సినిమా విజయం అంతా శ్రీదేవి , రాఘవేంద్రరావులదే అని చెప్పారు . He was too humble . దీనికి ముందు సినిమాలతో కంపేర్ చేస్తే నాగార్జున ఈ సినిమాలో బాగా నటించారు . ఏక్షన్ సీన్లలో కానివ్వండి , పాటల్లో కానివ్వండి బాగా చేసారు . He deserves to be appreciated and acknowledged .

Ads

ఈ సినిమాకు ఇంకా ప్రత్యేకతలు ఉన్నాయి . ప్రముఖ హిందీ గాయని లతా మంగేష్కర్ 33 ఏళ్ళ తర్వాత తెలుగులో ఒక పాట పాడారు . తెల్ల చీరెకు తకధిమ తపనలు పాటను బాలసుబ్రమణ్యంతో కలిసి పాడారు . ఎప్పుడో 1955 లో నాగేశ్వరరావు నటించిన సంతానం సినిమాలో నిదుర పోరా తమ్ముడా పాట పాడారు . యాదృచ్చికంగా రెండు సినిమాలు తండ్రీకొడుకులవి అయ్యాయి .

ప్రముఖ హిందీ నటుడు అమ్రీష్ పురి నటించిన తొలి తెలుగు సినిమా ఇదేనేమో ! అలాగే నాగార్జున , శ్రీదేవి కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! బహుశా సౌందర్య లహరి ప్రోగ్రాంలోనే అనుకుంటా . నాగార్జున చెప్పారు . శ్రీదేవి పక్కన తటపటాయిస్తూనే ఒప్పుకున్నానని . మరో విశేషం శ్రీదేవి తండ్రీకొడుకుల పక్కన హీరోయినుగా నటించటం . తల్లీకూతుళ్ళతో హీరోలు నటించటం చూసాం . హీరోయిన్ నటించటం కాస్త తక్కువే .

ఇంక కధకు వస్తే బాగా నలిగిందే . దేశ విద్రోహ శక్తులు దేశాన్ని అస్థిరపరచటానికి , తానే దేశాధినేత అవటానికి స్వామీజీ వేషంలో ఒక మహానుభావుడి ప్రయత్నాన్ని CBI డిప్యూటీ చీఫ్ ఎదుర్కోవటం కధావస్తువు . ఆమెకు అండగా , తోడుగా నిలుస్తాడు విహారి పాత్రలో నాగార్జున . హీరో పేరు విహారి . అలాగే మరో హీరోయిన్ సుహాసిని పేరు సునాదమాల . భలే ఉన్నాయి పేర్లు . యండమూరి హీరోహీరోయిన్ల పేర్లను భలే పట్టుకొస్తారు .

సినిమాలో ఇద్దరు హీరోయిన్లు భిన్న వ్యక్తిత్వాలు కలవారు . CBI ఆఫీసర్ పాత్రలో శ్రీదేవి సాహసవంతురాలు , చురుకయినది . ముఖ్యంగా వెన్నెల్లో ఆడపిల్లలాగా హీరోకి పజిల్ కావటం సరదాగా ఉంటుంది . చాలామంది మగపిల్లలు ఆడపిల్లల్ని టీజ్ చేస్తుంటారు అని అనుకుంటారు . మేము కాలేజీలో చదువుకునే రోజుల్లోనే మగపిల్లల్ని టీజ్ చేసే ఆడపిల్లలు నాకు తెలుసు .

మరో హీరోయిన్ సుహాసిని భయస్తురాలు , ఛాదస్తురాలు . మగ వారు తాకితేనే నీటి ఎద్దడిలో కూడా స్నానాలు చేస్తూ ఉంటుంది . ఇద్దరు హీరోయిన్లతో crisscross love సరదాగా ఉంటుంది .

సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అభినందించాలి . పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . మెచ్చుకోవలసింది తార నృత్య దర్శకత్వాన్నే . శ్రీదేవి , నాగార్జునల డాన్సులు అదరకొట్టాయి . తెల్ల చీరె తకధిమి తపనలు పాట చిత్రీకరణ రాఘవేంద్రుడి స్టయిల్లోనే ఉంటుంది .

స్వాతి చినుకు సందె వేళలో వాన పాట ఇద్దరూ అదరగొట్టేసారు .‌ అబ్బ దీని సోకు సంపంగి రేకు , ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లో , గుండెలో తకిట పాటలు అన్నీ హుషారుగా ఉంటాయి .

ఇతర ప్రధాన పాత్రల్లో పేకేటి , జయంతి , చంద్రమోహన్ , నిర్మలమ్మ , సత్యనారాయణ , నూతన్ ప్రసాద్ , జగ్గయ్య , కల్పనారాయ్ , ప్రదీప్ శక్తి , పి జె శర్మ , ప్రభృతులు నటించారు . పాటల్ని వేటూరి , జొన్నవిత్తుల వ్రాయగా , డైలాగులను జంధ్యాల వ్రాసారు . క్లైమాక్సులో విధ్వంసాన్ని బాగా చిత్రీకరించారు . ముఖ్యంగా నాగార్జున , శ్రీదేవి రకలకాల గన్సుతో దడదడలాడించేస్తారు .

డైరెక్టుగా కానివ్వండి , షిఫ్టులతో కానివ్వండి 40 సెంటర్లలో వంద రోజుల బొమ్మ పడింది . వైజయంతి మూవీస్ బేనర్లో అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 12వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది . It’s a romantic action entertainer . నాగార్జున , శ్రీదేవి అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడవచ్చు . చూసి ఉన్నా శ్రీదేవి అభిమానులు మరలా మరలా చూడొచ్చు . ఆమె కూడా ఇలాంటి ఏక్షన్ పాత్ర ధరించటం ఇదేనేమో ! సినిమా యూట్యూబులో ఉంది .

తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రంకెన్ డ్రైవ్‌తోపాటు… డ్రంకెన్ స్పీచ్ టెస్టులూ అవసరం ఇప్పుడు..!!
  • Work from hill… కొండాకోనల్లో నుంచి కొలువు… ఆరోగ్యం, ఆహ్లాదం…
  • యండమూరి, రాఘవేంద్రరావు కఠినాత్ములు సుమీ… ఆమెను చంపేశారు…
  • బీహార్‌లో ఎవరిది గెలుపు..? సట్టా బజార్ ఏమంటున్నదో తెలుసా..?
  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions