.
రోజంతా కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని, ఖాళీ దొరికితే మొబైల్ వైపు చూస్తూ గడిపే ఆధునిక జీవనశైలి మనుషులకు రకరకాల రోగాలను అలవాటు చేస్తోంది. అందులో ప్రధానమైనవి—మెడ నొప్పి, నిద్రలేమి! వీటితో ఇబ్బంది పడిన ఓ భారతీయ మహిళ, పరిష్కారం కోసం ఏకంగా జపాన్ వెళ్ళి రూ.40 వేలు పెట్టి ఓ దిండు (తెలంగాణలో మెత్త అంటారు దిండును) కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.
చదవడానికి కాస్త వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం! కథనం వివరాల్లోకి వెళ్తే…
విపన్‌దీప్ కౌర్ అనే భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సుదీర్ఘకాలంగా ల్యాప్‌టాప్, మొబైల్ వాడకం వల్ల వచ్చే తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతోంది. రోజంతా పడే శ్రమకు తగ్గట్టుగా రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్ర కరువవడంతో ఆమె విసిగిపోయింది. చివరికి నిద్ర నాణ్యతను పెంచుకునేందుకు, మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.
Ads
భారతదేశం నుండి జపాన్‌కు వన్-వే టికెట్‌పై వెళ్లిన ఆమె, టోక్యోలోని నిహోన్‌బాషి ప్రాంతంలో ఉన్న 400 ఏళ్ల నాటి ప్రముఖ జపనీస్ బెడ్డింగ్ బ్రాండ్ ‘నిషికావా’ (Nishikawa) దుకాణాన్ని సందర్శించింది. అక్కడ తన శరీర తత్వానికి తగ్గట్టుగా ఒక కస్టమైజ్డ్ (ప్రత్యేకంగా తయారు చేసిన) దిండు తయారు చేయించుకుంది.

రూ.40 వేల దిండులో అంత ప్రత్యేకత ఏముంది?
ఈ షాపింగ్ అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా వైరల్ అయింది. అక్కడి నిద్ర నిపుణులు (Sleep Experts) కొనుగోలుదారుడి నిద్ర అలవాట్లు, శరీర భంగిమలను ఎలా అంచనా వేస్తారో ఆమె వివరించింది…
కొలతలు & పరీక్షలు..: మొదట కస్టమర్ యొక్క మెడ వంపు, భుజాల వెడల్పు, వెన్నెముక అమరికను ప్రత్యేక పరికరాలతో కొలుస్తారు…
ఎత్తు నిర్ధారణ..: కస్టమర్లను వివిధ ఎత్తులు, మెత్తదనం కలిగిన దిండ్లపై పడుకోబెట్టి, వారి శరీరానికి ఏది సరిగ్గా సెట్ అవుతుందో పరిశీలిస్తారు…
బించోటాన్ చార్కోల్ బీడ్స్..: ఈ దిండులో ‘బించోటాన్ చార్కోల్ పైప్ బీడ్స్’ (Binchotan charcoal pipe beads) నింపుతారు. ఇవి మెడకు సరైన సపోర్ట్‌ను ఇవ్వడమే కాకుండా, గాలి ప్రసరణకు ఉపకరించి నిద్ర నాణ్యతను పెంచుతాయట.
ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక తయారైన ఆ దిండు ధర సుమారు 70,000 జపనీస్ యెన్లు… అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు ₹40,000!
ఇది పెట్టుబడా? పిచ్చి ఖర్చా?
ఈ కొనుగోలుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “నా ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకు నేను చేసుకున్న మంచి పెట్టుబడి ఇది” అని ఆమె సమర్థించుకోగా… “రూ.40,000 పెట్టి దిండు కొనేబదులు, రాత్రి వేళల్లో ఫోన్ పక్కన పెట్టి స్క్రీన్ టైమ్ తగ్గిస్తే ఉచితంగానే మంచి నిద్ర వస్తుంది కదా!” అని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం… కస్టమైజ్డ్ దిండ్లు నిద్రించేటప్పుడు మెడకు మంచి సపోర్ట్‌ను ఇస్తాయనేది నిజమే అయినప్పటికీ, కేవలం దిండు మార్చినంత మాత్రాన దీర్ఘకాలిక ‘టెక్ నెక్’ (Tech Neck) లేదా వెన్నునొప్పులు మాయమైపోవు. అంటే ఇది ఓ రిలాక్స్, అంతేతప్ప చికిత్స కాదు.
కంప్యూటర్ ముందు కూర్చునే భంగిమను మార్చుకోవడం, మధ్యమధ్యలో బ్రేకులు తీసుకోవడం, క్రమం తప్పకుండా మెడ వ్యాయామాలు చేయడం, రాత్రిపూట డిజిటల్ స్క్రీన్లకు దూరంగా ఉండటమే నిజమైన నివారణోపాయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏది ఏమైనా... రూ.40 వేల దిండు మెడ నొప్పిని తగ్గిస్తుందో లేదో చూడాలి కానీ, ఆ దిండు బిల్లు చూశాక చాలామందికి మాత్రం నిద్ర పట్టడం లేదన్నది సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్!
Share this Article