ఇచ్చట సైబర్ నేరాలు నేర్పబడును!
———————-
కొత్త కొత్త రంగాలు పుట్టుకొచ్చే కొద్దీ ఆయా రంగాలకు అవసరమయిన వృత్తి నిపుణులు అవరమవుతారు. అందుకు తగినట్లు ప్రత్యేక విద్యలు, శిక్షణలు కూడా అవసరమవుతాయి. ఈగ ఇల్లలుకుతూ తనపేరు తానే మరచిపోయింది. ప్రపంచం 1990 ప్రాంతాలనుండి ఐ టీ నామస్మరణలో అన్నిటినీ మరిచిపోయింది. ఇప్పుడు సాఫ్ట్ వేర్ కొలువులే కొలువులు. మిగతావన్నీ చాలా హార్డ్. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల స్వరూప స్వభావాలు, లక్షణాలు, రాత్రి పగలు పనిగంటలు, వీకెండ్ జల్సాలు… దానికదిగా మరో ప్రపంచం.
Ads
దేశంలో మనం బతికి ఉన్నట్లు నిరూపించుకోవడానికి అవసరమయిన ఆధార్ కార్డు నుండి- అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే ఉపగ్రహం దాకా ఇప్పుడంతా కంప్యూటరే చేయాలి. అంతా ఆన్ లైన్లోనే జరగాలి. బ్యాంకుల నగదు లావాదేవీలు తగ్గి డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ పెరిగాయి. యాప్ ల ద్వారా చెల్లింపులు వీధుల్లో కూరలమ్మేవాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు అత్యంత సహజం. వేగంలో మంచి- చెడు రెండూ ఉంటాయి. అలాగే ఆన్ లైన్ సేవల్లో కూడా మంచి- చెడు రెండూ ఉన్నాయి.
దేశమంతా చిన్నా పెద్ద పట్టణాల్లో ఆన్ లైన్ మోసాలు ఎలా చేయాలో ప్రొఫెషనల్ గా, ఒక సాంకేతిక విద్యగా నేర్చుకునే యువత పెరిగిందట. సాధారణంగా ఒక దుకాణంలో గల్లా పెట్టె దొంగతనం చేయడానికే పాత చోరవిద్యలు పనికి వచ్చేవి. ఆన్ లైన్ అకౌంట్లలో డబ్బులు దొంగతనం చేయాలంటే ముందు ఆఫ్ లైన్లో ఆన్ లైన్ చోరవిద్య మెళకువలు నేర్చుకోవాలి. దేశమంతా పెరుగుతున్న సైబర్ నేరాలతో పోలీసులకు దిక్కు తోచడం లేదు.
వినడానికి ఇబ్బందిగా ఉన్నా- సైబర్ నేరాల ప్రత్యేక కోర్సులు, శిక్షణ, బోధన, అప్రెంటీషిప్, ట్రెయినింగ్ పీరియడ్, ఫుల్ టైమ్ సైబర్ క్రైమ్స్ ఉద్యోగాలల్లో ఎన్నో యువ బృందాలు బిజీగా ఉన్నాయి. సైబర్ నేరాలతో డబ్బు సంపాదించి కొందరు యువకులు ఎస్ యు వి వాహనాలు కొని సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లా అపార్ట్ మెంట్లు, విల్లాలు కూడా కొంటున్నారట. గళ్ల లుంగీ మోకాలిదాకా కట్టి, కట్ బనియన్, మెడలో కర్చీఫ్ కట్టుకుని, బుగ్గన నల్ల చుక్క పెట్టుకుని, నుదుట కత్తిగాటుతో, మీసాలు మెలిపెడితేనే మనం దొంగలను గుర్తించగలుగుతాం. ఇలా ఏ సీ ఆఫీసు గదుల్లో ల్యాప్ టాపు ముందు కూర్చుని కీ బోర్డు ముందు మీటలు నొక్కే సైబర్ నేరగాళ్లను గుర్తించే పరిజ్ఞానం మనకు లేదు. ఉన్నా అది చాలదు.
సాఫ్ట్ వేర్ అన్న మాట గౌరవప్రదమయినప్పుడు- సాఫ్ట్ థెఫ్ట్ అన్నమాట కూడా గౌరవప్రదమయినదే కావాలన్నది ఈ సైబర్ నేరగాళ్ల డిమాండు! నిజమే- ఆన్ లైన్ దొంగతనానికి ఎంత ఐ టీ పరిజ్ఞానం కావాలి? ఎంత సాంకేతిక అభినివేశం ఉండాలి? టెక్నాలజీలో ఎంత అప్ డేట్ గా ఉండాలి? ఎన్ని లేటెస్ట్ గాడ్జెట్స్ కొనాలి?
కాలంతో పాటు అన్నీ మారుతుంటాయి- అందరూ మారుతుంటారు. దొంగలు కూడా!
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article