.
“ఓం నమో భగవతే వరుణాయ, జలాధిపతయే మకరవాహనాయ, పాశహస్తాయ, మేఘవస్త్రాచ్చాదితనానాలంకార, విద్యుత్ ప్రకాశదీపజ్వాల వ్యోమ్నిగర్జిత జీమూతఘోషాలంకృత, సర్వ నదీ నద వాపీ కూప తటాకాన్ సంపూరయ సంపూరయ, సర్వాన్ మేఘాన్ ఆకర్షయ ఆకర్షయ, గచ్చా గచ్చ వసోర్ధారయ, పునరావాతం జనయ జనయ, పశ్చాద్వాతం శమయ శమయ, ఏహి వరుణ ఏహి ఇంద్ర…”
“ఓ వరుణ దేవుడా!
నీకు దండాలు. నీళ్లకు నీవే దిక్కు. మొసలి వాహనుడా!
చేతిలో పాశం పట్టుకుని, ఒళ్లంతా తెలుపు, నీలం, నలుపు మేఘాలను వస్త్రాలుగా ధరించిన దేవుడా!
మెరుపు తీగలు అలంకారంగా కలిగినవాడా!
ఉరుముల శబ్దాలతో బయలుదేరేవాడా!
భూమి మీద ఉన్న నదీ నదాలు చెరువులు కుంటలు జలాశయాలు…అన్నిటినీ నీ నీటితో నింపు.
గాలికి తేలిపోయే మేఘాలనన్నిటిని ఒడిసిపట్టుకో.
నీ కడుపులో దాచుకున్న నీటిని వర్షించు.
ఆవిరిగా ఆ నీటిని నువ్వే మళ్లీ మళ్లీ తాగు.
తాగిన నీటిని మళ్లీ మళ్లీ వర్షించు.
నువ్వు, నీ అధిపతి ఇంద్రుడు చల్లగా ఉందురుగాక!”
Ads
వరుణదేవుడి స్తోత్రానికి దాదాపుగా అర్థం ఇది. మేఘం- నీరు- ఆవిరి- మేఘం స్వరూప స్వభావాలు- మేఘాలు ఏర్పడే ప్రక్రియ- అన్నిటినీ ఈ వరుణ మంత్రం ఒక వీడియోలా చూపుతోంది.
ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అంటరానిదిగా చూసే కాలాలు మొదలైనప్పటినుండి మనం పోగొట్టుకున్న మనదైన భావన, భాష, దృష్టి కోణం, తాత్వికత సముద్రంకంటే పెద్దది. ఈ వరుణ మంత్రం జపించడంవల్ల ఎన్ని చోట్ల వర్షాలు పడ్డాయో మనదగ్గర లెక్కలు లేకపోవచ్చుకానీ…వేల ఏళ్ళక్రితం వర్షానికి ఒక దేవుడు…ఆ దేవుడికి అలంకారాలు…ఆ దేవుడు చేసే పనులు…ఆ పనుల్లో శాస్త్రీయత…ఆ ప్రకృతిలో తాత్వికత…ఆ పొగడ్తలో వర్షంకోసం పిలుపు…ఆ పిలుపులో కృతజ్ఞత…ఇలా ఎన్నెన్నో ముడిపడి ఉన్నాయి.
కాచే ఎండకు, కురిసే వానకు పొంగిపోవడంకంటే, కృతజ్ఞతగా నమస్కారం పెట్టడంకంటే గొప్ప సంస్కారం ఏముంటుంది? ఇది ప్రకృతి ఆరాధన. మన తెలివి బాగా తెల్లవారి తెల్లవారుజామున సూర్యుడొచ్చినా, చిరు చీకట్లు కమ్మి నల్లని మేఘం కిందికి దిగి కడుపులో దాచుకున్న నీటిని వర్షించినా పట్టించుకోము.
“ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడబానలమెంతో?”
అని దాశరథి ఏడెనిమిది దశాబ్దాల క్రితం ప్రశ్నించాడు. ఆయన కవిత్వ సంకేతానికి వాడినా నిజంగా సముద్రగర్భంలో వేడి, సముద్రంపై వేడి చాలా వాటికి కారణమని శాస్త్రీయంగా రుజువయ్యింది.
తుఫాన్ ప్రకృతి మాట్లాడే భాష, సంకేతం
# సముద్రం నిశ్శబ్దంగా కనిపించినా, దాని కడుపులో ఒక ప్రళయం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ప్రళయపు వేడిలోనుండే తుఫాను పుడుతుంది.
# తుఫాను ప్రకృతిలోని శ్వాస ప్రక్రియ లాంటిది. మన భూమి, సముద్రం, గాలి ఇవన్నీ ఒకే వ్యవస్థలో కలిసి పనిచేస్తాయి.
# సముద్రపు నీరు వేడెక్కి ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్తే,
అది పైభాగంలో చల్లబడుతూ మళ్లీ నీటి(మేఘం)గా మారుతుంది.
ఈ ప్రక్రియలో విడుదలయ్యే ఉష్ణశక్తి (Latent Heat) వాతావరణాన్ని వేడెక్కిస్తుంది.
# దీంతో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడుతుంది. చుట్టుపక్కనున్న గాలి ఆ లోపలికి దూసుకుపోతుంది. ఇలా వలయంలా తిరిగే గాలులు క్రమంగా డిప్రెషన్ → డీప్ డిప్రెషన్ → సైక్లోన్ దశలుగా మారతాయి.
ఇదే తుఫాన్ పుట్టుక.
# తుఫాన్ కేవలం గాలి కాదు. అది సముద్రపు వేడి నుండి ఆకాశం వరకు జరిగే శక్తి మార్పిడి ప్రక్రియ.
# ఇది సముద్రంలోని అదనపు ఉష్ణాన్ని బయటకు పంపుతూ భూమి ఉష్ణసమతౌల్యాన్ని కాపాడుతుంది. అంటే తుఫాన్ భయంకరమైనదే అయినా, అది కూడా ప్రకృతిలో ఒక సమతుల్య క్రమం. కానీ వాతావరణ మార్పుల (Climate Change) కారణంగా సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ తుఫాన్లు ఇంకా శక్తివంతంగా, ఎక్కువసార్లు వస్తున్నాయి. ఇది భవిష్యత్తుకు ఒక శాస్త్రీయమైన హెచ్చరిక.
రాబోయే తుఫానులు ఏ దిశగా, ఎంత వేగంతో వస్తాయో చెప్పగలం. ఎక్కడ తీరం దాటుతుందో చెప్పగలం. ఎప్పుడు, ఎక్కడ బలహీనపడుతుందో చెప్పగలం. అంతటి సముద్రగర్భం ఇప్పటికే దాచుకుంటున్న వేడికితోడు భూగోళంలో ఉన్న మానవులంతా తమ సుఖంకోసం రాజేసిన అదనపు వేడికి బడబానలమే ఎంతగా భయపడుతోందో మాత్రం చెప్పలేము.
మనిషి ఎన్ని వికృతులతో నాట్యమాడినా… ప్రకృతిముందు అవి కుప్పిగంతులే. ప్రకృతి తనను తాను నియంత్రించుకుంటూ యుగయుగాలుగా సాగిపోతూ ఉంటుంది.
ఎన్ని తుఫానులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మనమే కారణమో శాస్త్రీయంగా తెలుసుకుంటే మన గుండెల్లోనే తుఫానులు చెలరేగుతాయి. మన మనో ఉపరితల ఆవర్తనం మీద కేంద్రీకృతమైన వాయుగుండాలకు మనమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
…అయినా మనుషుల భాష వినడానికే తీరిక, ఓపిక లేని భూగోళం. తుఫానుల భాష వింటుందా?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article