Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దాసి..! దోపిడీ కేంద్రాలు దొరల గడీలు… లైంగిక దోపిడీలకు కూడా…!

November 13, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… వందేళ్ళ కింద మన సమాజంలో పాతేసుకుపోయిన దుర్వ్యవస్థలలో ఒకటి దాసీ వ్యవస్థ . 1925 తెలంగాణ నల్లగొండ జిల్లా నారాయణపురం అని ఈ దాసి సినిమా ప్రారంభం అవుతుంది .

నైజాం నవాబు పాలనలో ఆయనకు కప్పం కడుతూ గ్రామాలలో దొరలు తమ గడీలలో చేసిన మానవ దోపిడీ అంతా ఇంతా కాదు . ఒసేయ్ రాములమ్మా , రాజన్న లాంటి సినిమాలు దొరల అఘాయిత్యాలను చూపితే రజాకార్ లాంటి సినిమాలు రజ్వీ స్వంత సైన్యం ఎలాంటి దౌర్జన్యాలు చేసాయో కళ్ళకు కట్టినట్లు చూపాయి .

Ads

ఆ కోవ లోనిదే 1988 జూన్లో వచ్చిన గొప్ప ఆర్ట్ ఫిలిం , ట్రాజిక్ క్లాసిక్ ఈ దాసీ సినిమా . దొరల కుటుంబంలోనే పుట్టి గడీలలోనే పెరిగిన బి నరసింగరావు ఈ సినిమాకు తెర వెనుక కర్త , కర్మ , క్రియ అయితే తెర మీద అంతా తానై నిశ్శబ్ద విజృంభణ చేసింది అర్చన .

చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అర్చన . ఈ సినిమాలో ముఖ్యంగా చివరి గర్భ విఛ్ఛిన్నం సీనులో అత్యద్భుతంగా నటించింది . ఈ సినిమాలో నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారాన్ని పొందింది . బి నరసింగరావుకు ఉత్తమ చిత్రం పురస్కారం లభించింది .

ఆడపిల్లలను కన్యాశుల్కానికి లోభించి అమ్మిన మగానుభావులు ఉన్న మన సమాజంలో ఇరవై రూపాయలు కొరకు ఓ దొరకు అమ్మివేయ బడుతుంది కామాక్షి పాత్రలో అర్చన . దొర కూతురు పెళ్ళయాక దొరసానితో పాటు ఆమె మృగ భర్త గడీకి చేరుతుంది అర్చన . అక్కడ అన్ని పనులతో పాటు దొరకు , దొర బావమరిదికి , వచ్చీపోయే అతిధులకు మరదలు పిల్ల అయిపోతుంది ఆ దాసి .

ఓ మర మనిషిగా ఒంటిని అప్పచెపుతూ ఉంటుంది . గర్భం వస్తే బిడ్డను కనాలని కోరుకుంటుంది . కానీ , దొరసాని గర్భ విఛ్ఛిన్నం చేయించి ఆమె కలని భగ్నం చేయడంతో సినిమా విషాదాంతంగా ముగుస్తుంది . ఇదీ టూకీగా కధ .

సినిమా గొప్పతనం ఏమిటంటే వందేళ్ళ కింద గ్రామీణ తెలంగాణ ఎలా ఉండేది , అనాటి కట్టు బొట్టు , కట్టుబాట్లు , వగైరా అద్భుతంగా చూపారు . మంత్రగాళ్ళ మాయా తీర్ధం వంటి మూడ నమ్మకాలు , వీధి నాటకాలు , కర్రసాము , భట్రాజుల పొగడ్తలు వగైరా ఆనాటి కళలు , ఆచారాలు చక్కగా చూపబడ్డాయి . గడీలలో ఉపయోగించబడే సామాన్లు , వస్తువులు , దుస్తులు , వగైరా బాగా చూపించబడ్డాయి . కాస్ట్యూమ్స్ డిజైనర్ సుదర్శనుకు కూడా జాతీయ అవార్డు వచ్చింది .

18 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అర్చనతో పాటు ఆనాటి రంగ స్థల , సినిమా నటుడు , యన్టీఆర్ కన్నా ముందు కృష్ణుడిగా ప్రేక్షకుల మన్నలను పొందిన ఈలపాట రఘురామయ్య కుమార్తె రూప దొరసానిగా చాలా బాగా నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో భూపాల్ రెడ్డి , కె యన్ టి శాస్త్రి , ఆనంద చక్రపాణి , శిల్ప , బి నరసింగరావులు , జూనియర్ ఆర్టిస్టులు చాలామంది నటించారు .

ఆనాడు బ్రిటిష్ ఇండియాలో , ముఖ్యంగా అభివృద్ధికి నోచుకోని కొన్ని సంస్థానాలలో , దాసీతనం , వెట్టి చాకిరీ సాధారణమే . ఇప్పటి తరానికి అవి తెలియక పోవచ్చు . భారత రాజ్యాంగం ప్రసాదించిన ఎన్నో హక్కులను నోరు లేని అనామకులు కూడా ఈరోజు అనుభవిస్తున్నారు .

daasi
ఉత్తమ సినిమాటోగ్రఫీ , ఉత్తమ కళా దర్శకత్వంతో సహా మొత్తం అయిదు జాతీయ అవార్డులను పొందిన మొదటి సినిమా ఇదేనేమో . మాస్కోలో డిప్లొమా ఆఫ్ మెరిట్ సర్టిఫికేట్టుని పొందింది . 12వ IFFI లో ప్రదర్శించబడింది . రాజన్న , ఒసేయ్ రాములమ్మా వంటి సినిమాల్లాగా స్పీడుగా ఉండదు . డ్రైగా , పాసెంజర్ బండిలాగా నడుస్తుంది . అయినా అర్చన నల్లందం , లేడి కళ్ళు , ఆనాటి తెలంగాణా గ్రామీణ వాతావరణం ఆసక్తికరంగానే ఉంటాయి .

బి నరసింగరావు అందించిన బేక్ గ్రౌండ్ మ్యుజిక్ గొప్పగా ఉంటుంది . ఈనాటి ఢాంఢాం గార్లు తప్పక చూసి నేర్చుకోవాలి . ఇంత డ్రై సినిమాకు అంత ఆహ్లాదకరమైన నేపధ్య సంగీతాన్ని ఎలా అందించవచ్చో నేర్చుకోవాలి .

మనకు సాహిత్యాలలో అభ్యుదయ , విప్లవ , దిగంబర సాహిత్యాలు ఉన్నట్లు సినిమాలలో కూడా ఇవన్నీ ఉంటాయి . కె విశ్వనాధ్ బలాత్కార ఆక్రమణల లాగా ఉండవు బి నరసింగరావు గారి బలాత్కార ఆక్రమణలు అనబడే రేపులు . ఓ రకంగా చెప్పాలంటే దిగంబర సాహిత్యం వంటి సినిమా అని చెప్పవచ్చు .

ఈతరం వారు తప్పక చూడాలి . మళయాళ సినిమాలతో సమానంగా తెలుగులో కూడా ఇలాంటి ఆర్ట్ ఫిలింస్ చాలా ఉన్నాయని తెలుస్తుంది . 94 నిమిషాలు మాత్రమే . నేను పరిచయం చేస్తున్న 1165 వ పాత సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జ్యోతిష నామ ధూర్తత్వం సమాజానికి కీడు చేస్తోంది… జాగ్రత్త సుమీ…
  • నేపాలీ సెన్సేషన్… ఓ ఆయుర్వేద డాక్టర్ కొడుకు, ఓ ర్యాపర్… ఎవరితను..?!
  • తర్జుమాలే ఉద్యమంగా! … Tribute to Mukthavaram Pardhasaaradhi ….
  • అసలెవరు ఈ ఆండీ పైక్రాఫ్ట్..? పాకిస్థాన్ పుండు మీద కారం..!!
  • అమెరికా, ఇజ్రాయిల్‌లతో యుద్ధం చేస్తున్నది చైనా- రష్యాలే…!!
  • “పట్టు పురుగుకు పూరీ ప్రాణభిక్ష… పట్టు అవసరమే లేని తిరుమల!”
  • …. చివరకు తన రక్తపు వేలిముద్రతో సాక్షి సంతకం చేస్తుంది…
  • ‘‘చూడు కమల్.., నీ చేతినీ, నా చేతినీ పోల్చి చూడు… ఎంత తేడా ఉందో…’’
  • శివాజీ ఆ గరుడ పురాణ ప్రవచనాలు మళ్లీ మొదలెట్టాడురా బాబోయ్..!!
  • నక్సల్స్ ఘాతుకం..! నిజాన్ని, తప్పును ఆలస్యంగా అంగీకరించిన వైనం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions