ఇదుగో మా ఎన్డీయే తరఫున మాకు సరిపడా ఎంపీల బలం ఉంది అంటూ ఓ జాబితా ఇవ్వడానికి రాష్ట్రపతి ముర్ము దగ్గరకు వెళ్లారు కదా మోడీ తదితరులు… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమె ఆహ్వానిస్తూనే మోడీకి ఓ స్వీట్ తినిపించింది… మీడియాలో ఆ ఫోటో ప్రముఖంగా దర్శనమిచ్చింది కూడా… ఆ తినిపించిన స్వీట్ ఏమిటి..?
దహి-చీని… దైచీని… ఇదేం స్వీటబ్బా అనుకుని సర్ఫింగ్ చేస్తే అది ప్రత్యేకంగా వండబడిన స్వీటేమీ కాదని తెలిసింది… పెరుగులో కాస్త చక్కెర వేసి తినిపిస్తారు, దాని పేరే దహి-చీని… దహి చెక్కర్ అని కూడా పిలుస్తారు… కొందరు బెల్లం కలుపుతారు… అదే ఎందుకు..?
ఎందుకంటే..? అది సంప్రదాయమట… మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు, తెలియదు… కానీ నార్తరన్ స్టేట్స్‌లో ఇదొక సంప్రదాయమట… మన సంస్కృతిలో భాగమట… మనకేం తెలుసు..? ఎవరైనా ఏదైనా శుభవార్త చెబితే అప్పటికప్పుడు వంటింట్లో నుంచి కాస్త చక్కెరో, బెల్లం ముక్కో తీసుకొచ్చి నోరు తీపి చేస్తాం… ఇంట్లో రెడీగా ఏమైనా స్వీట్లు ఉంటే నోట్లో కుక్కేస్తాం… కానీ దహి-చీని మరింత శుభమట…
Ads
కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడో, ఇంటర్వూకు వెళ్తున్నప్పుడో, కాలేజీకి ఫస్ట్ డే వెళ్తున్నప్పుడో, ఉద్యోగానికి తొలిసారి వెళ్తున్నప్పుడో, ఏదైనా కొత్త వెంచర్లకు శ్రీకారం చుడుతున్నప్పుడో… అంతా శుభం జరగాలని కోరుతూ ఇంట్లో వాళ్లు ఇలా దహి-చీని తినిపిస్తారు… రాష్ట్రపతిభవన్‌లో అంతకుముందు ఈ అలవాటుందో లేదో తెలియదు, ఇలాంటి ఫోటో ఎప్పుడూ చూడలేదు… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ సంప్రదాయాన్ని చక్కగా పాటించింది… నచ్చింది…
దహి-చీని వెనుక ఓ ఆరోగ్య రహస్యం కూడా ఉంది… శుభకార్యం ఏ ఆటంకం లేకుండా పూర్తవుతుందనే నమ్మకం వెనుక ఆ నేపథ్యం ఏమిటంటే..? సరే, ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా… మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు రెడీ అవుతున్న మోడీకి ఒకవైపు ఆహ్వానం పలుకుతూనే, మరోవైపు అభినందనగా, శుభం కలగాలని కోరుతూ ఈ దహి-చీని తినిపించడం ఓ సోదరి ప్రేమను కూడా చూపించింది…
ఏదైనా శుభకార్యం కోసం బయటికి వెళ్తున్నప్పుడు… యాంగ్జయిటీ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది… ప్రయాస, అలసట కూడా వస్తాయి… ఈ స్థితిలో తగిన శారీరిక, మానసిక బలం అవసరం… పెరుగు, చక్కెర కలయిక తక్షణ శక్తిని అందించేవి… చల్లదనాన్ని కలిగించేది కూడా… టెన్షన్ తగ్గిస్తుంది పెరుగు… పోషక సమృద్ధం కూడా కదా… రిబోఫ్లేవిన్, కాల్షియం, విటమిన్లు బీ6, బీ12 ఎట్సెట్రా… డీహైడ్రేషన్ సందర్భాల్లో కూడా పెరుగు మైండ్‌ను, బాడీని చల్లబరిచే గుణం పెరుగుకు ఉందని ఆయుర్వేదం కూడా చెబుతుంది…
అందుకే కదా మనవాళ్లు బయట ఎటెటో తిరిగి రాగానే ఇంట్లో మజ్జిగ ఇచ్చేది… కొందరు అందులో లైట్‌గా కొత్తిమీర, ఉప్పు వేస్తారు… కొందరు చక్కెరతో తాగుతారు… సరే, ఇప్పుడు బీపీలు, సుగర్స్ పెరిగాయి కాబట్టి ప్లెయిన్ మజ్జిగ తాగేస్తున్నారు… ఇదండీ ద్రౌపది ముర్ము మోడీకి తినిపించిన ఆ దహి-చీని వెనుక కథ… ప్రతిసారీ బడ్జెట్ తయారీకి ముందు అధికారికంగానే ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా హల్వా వండుతారు… దాని వెనుకా ఇలాంటిదే ఏదో నేపథ్యం ఉండే ఉంటుంది…!
Share this Article