ఫలానాచోట ఇడ్లీ బాగుంటుంది… మెత్తగా, తెల్లగా దూదిపూలలా ఉంటయ్… తోడుగా ఇచ్చే సాంబారు బాగుంటుంది… రెండు చట్నీలు… ఆంబియెన్స్ నీట్‌నెస్ చక్కగా ఉంటయ్… అందరూ అక్కడికి వెళ్లి తినడానికి ఇష్టపడతారు… నో, నో, మేమూ అలాగే చేస్తాం, పైగా మాది ఇడ్లీ కనిపెట్టిన చరిత్ర… మా పూర్వీకులే ఇడ్లీని కనిపెట్టారు తెలుసా అని ఎదుటి హోటల్ వాడు క్లెయిమ్ చేసుకుంటే మీరేమంటారు..? ఫోఫోవోయ్, ఎవడు కనిపెడితే మాకేంటి..? ఇప్పుడు ఎవడు రుచిగా, శుచిగా చేస్తున్నాడనేదే మాకు ముఖ్యం అంటారా లేదా..? ప్రజెంట్ ప్రజెంటేషనే ముఖ్యమని తేల్చస్తారా లేదా..?
నిజమే… కానీ ఢిల్లీలోని రెండు హోటళ్లు మాత్రం రెండు మూడు డిష్‌లపై కొట్లాడుకుంటూ బజారుకెక్కాయి… కోర్టుకూ ఎక్కాయి… ఆ డిష్‌లు మా పూర్వీకులు కనిపెట్టారు అంటే, కాదు, మావాళ్లే అని మరొకరు… అక్కడికి వాటిపై ఏవో పేటెంట్స్ హక్కులున్నట్టు… రాయల్టీ గొడవలేవో ఉన్నట్టు..! కనీసం geographical indication (GI) కూడా లేనట్టుంది వాటికి… సరే, ఎవడో ఒకడు కనిపెట్టాడు గానీ మీరయితే చక్కగా వండి పెట్టండిర భయ్ అని నెటిజనం, ఆ హోటళ్ల కస్టమర్లు మాత్రం విసుక్కుంటున్నారుట…
ఆ డిషెస్ రెండూ నార్త్ ఇండియన్ డిషెసే… ఒకటి దాల్ మఖానీ… మరొకటి బటర్ చికెన్… సౌత్ ఇండియాలోనూ చేస్తారు గానీ నార్త్‌లోనే బాగా పాపులర్… మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దాల్ మఖానీ తాతను వడ్డించినా సరే, మన మామిడికాయ పప్పుకు సాటిరాదు… సరే, అది వేరే సంగతి… ఆ రెండు హోటళ్ల పేర్లు మోతీ మహల్, దరియాగంజ్… ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో ఉంది…
Ads
మొదట దరియాగంజ్ హోటల్ ఆ వంటకాలు తమ పూర్వీకుల సృష్టే అని క్లెయిమ్ చేసుకున్నట్టుంది ఏదో విదేశీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ఆయ్ఁ, వాటీజ్ దిస్ నాన్సెన్స్, మళ్లీ ఆ మాట అనకుండా అదుపు చేయండి యువరానర్ అని మోతీ మహల్ కోర్టుకెక్కింది… అదీ కేసు… మోతీమహల్ వాళ్ల వాదన ఏమిటంటే..?
‘మా పూర్వీకులు, అనగా కుందన్ లాల్ గుజ్రాల్ కనిపెట్టాడు దీన్ని, ఈ రెండు డిషెస్ మాత్రమే కాదు, తందూరీ చికెన్ కూడా ఫస్ట్ వండింది ఆయనే తెలుసా… అప్పట్లో సంయుక్త భారతదేశంలోని పెషావర్‌లో ఉండేవాళ్లు మావాళ్లు… దేశవిభజన తరువాత ఢిల్లీకి వచ్చేశారు… అదుగో అలా మాతోపాటు ఢిల్లీకి వచ్చినవే బటర్ చికెన్, దాల్ మఖానీ, తందూరీ చికెన్… సో, దేశంలో ఇంకెవ్వరూ వాటిని మా సృష్టి అని క్లెయిమ్ చేసుకుంటే మర్యాద దక్కదు’
రాత్రి మిగిలిపోయిన చికెన్‌ను ఏం చేయాలనే మథనం నుంచి పుట్టుకొచ్చిందట ఈ బటర్ చికెన్… దాన్ని బట్టీలో కాలిస్తే ఇంకా సూపర్ ఉంటుంది కదానే ఆలోచన కూడా దానికి తోడుగా ఉద్భవించిందేనట… టమాల, బటర్, క్రీమ్, మసాలాలు పప్పకు కలిపి దాల్ మఖానీ చేశారట… ఇది మోతీ మహల్ వాదన… ఎహెపో, ఇదంతా తప్పువాదన… బేస్ లెస్, నాన్సెన్స్ అని కొట్టిపారేస్తోంది దరియాగంజ్ లీగల్ టీం… అసలు మోతీమహల్ మొదట స్టార్ట్ చేసిందే జాయింటుగా… గుజ్రాల్, జగ్గీలు కలిసే పెషావర్‌లో మోతీమహల్ పెట్టారు… సో, ఒక్క మోతీమహల్‌కే ఈ వంటకాలు మావి అని చెప్పుకునే రైట్ లేదు, అది రైట్ (కరెక్ట్) కాదూ అంటున్నారు…
జడ్జి రెండు పార్టీలకూ నోటీసులు జారీ చేశాడు… మే 29న మళ్లీ విచారిద్దాం అని వాయిదా వేసేశాడు… సౌత్ ఇండియన్ హోటళ్ల వాళ్లూ ఎవరైనా ఈ కేసు స్పూర్తితో ఉప్మా దోశ మాది, బటన్ ఇడ్లీ మాది, బొంగులో చికెన్ మాది, ఇంకేదో మాది అని నానా వంటకాలపై కేసులు వేసినా పెద్దగా ఆశ్చర్యపడకండి… ఇదీ ఓ మార్కెటింగ్ స్ట్రాటజీయే..! ఆమధ్య ఏదో వంటకంపై ఇలాంటి పంచాయితీయే ఏదో నడిచినట్టు గుర్తు… వివరాలు యాదికి లేవు..!!
Share this Article