.
సూటిగా ఒక మాట… మతాన్ని అస్సలు పట్టించుకోకుండా… వీలైన ప్రతిచోటా తొక్కిపడేసే ధోరణి చైనాది… కానీ అదే ఇప్పుడు తదుపరి లామాను మేమే డిసైడ్ చేస్తాం అంటోంది… మతమే అక్కర్లేని దానికి ఈ లామా ఎంపిక దేనికి..?
కుళ్లు… తమ నుంచి తప్పించుకుని ఇండియాకు వెళ్లి ఆశ్రయం పొంది, ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన దలై లామా మీద కోపం… టిబెట్‌ను ఆక్రమించుకుని, లక్షలాది జనాన్ని అక్కడికి పంపించి… టిబెటన్లు వాళ్లంతటవాళ్లే ఇండియాకు పారిపోయేలా చేస్తున్నా సరే ఇంకా ఆ కోపం చల్లారడం లేదు…
Ads
వాడంతే… అటు అమెరికా, ఇటు చైనా… దొందూ దొందే… వీసమెత్తు నిజాయితీ ఉండదు.,. సరే, దలై లామాకు ఇప్పుడు 90 ఏళ్లు… మరో 40 ఏళ్లు బతుకుతానురోయ్ అని చైనాకు చెబుతున్నాడు… గుడ్, బతకనీ… మంచిదే… కానీ తదుపరి లామా ఎవరు..? అదీ మేమే డిసైడ్ చేస్తాం అంటున్నాడు…
ఈరోజుకూ, ఈ వయస్సులోనూ టెంపర్‌మెంట్ కోల్పోలేదు… కానీ ఓసారి ఆ పాత రోజుల్లోకి వెళ్తే… తనను చైనా ఖతం చేసేది… దాని తీరే అది కదా… తప్పనిసరై ఓ గార్డ్ రూపం ధరించి, కాలినడకన ఇండియా వైపు పయనం మొదలుపెట్టాడు… తన బతుకు కోసం, టిబెట్ కోసం… తనను నమ్మిన టిబెటన్ల స్వయంపాలన కోసం…
కానీ అది చైనా కదా... టిబెట్ నాదే అంటుంది... అరుణాచల్ ప్రదేశ్ నాదే అంటుంది... తైవాన్ నాదే అంటుంది... దానికి సరిహద్దు దేశాలతో మొత్తం కీచులాటలే... అది అమెరికాను మించిన సామ్రాజ్యవాది... చెప్పేవి నీతులు... 1950 నుంచీ టిబెట్ మీద కన్నేసి, దుష్ట వ్యూహాలు అమలు చేస్తూ వచ్చింది... పాపం, చిన్న దేశం...
దలై లామాకు తన వెంట అంగరక్షకులెవ్వరూ లేకుండా లాసాలోని సైనిక ప్రధాన కార్యాలయంలో జరిగే ఓ నృత్యప్రదర్శనకు రావాలని చైనీస్ జనరల్ జాంగ్ చెన్యూ నుంచి ఒక ఆహ్వానమందింది. ఆయనకు అర్థమైంది…
- 1959, మార్చి 10… సుమారు పది వేలకుపైగా టిబెటన్లు తమ ఆధ్యాత్మిక గురువైన దలై లామాను చైనా కుటిల ఎత్తుగడల నుంచి కాపాడుకోవడానికి నార్బులింగా ప్యాలెస్ వద్దకు చేరుకున్నారు… ప్యాలెస్ చుట్టుముట్టి ఒక మానవహారాన్ని నిర్మించారు… ముందే ఊహించినట్టుగా దలై లామాను ఏం చేయాలనుకుందో గానీ చైనా సైన్యం ఒక్కసారిగా ఆ ప్యాలెస్ వైపు దూసుకొచ్చింది. గుండ్ల వర్షం కురిపించింది… చైనా వాడు ఏదైనా చేయగలడు…
అదిగో ఆ అలజడి మధ్య అప్పటివరకూ ఎప్పుడూ బౌద్ధభిక్షువుల వస్త్రాల్లో మాత్రమే కనిపించిన దలై లామా.. ఇక ఓ గార్డ్ రూపం ధరించాల్సి వచ్చింది… అలా పొగమంచు కమ్ముకున్న ఆ చిక్కటి రాత్రి అంతటి ఆధ్యాత్మిక గురువుకు కూడా కాళరాత్రైంది. తల్లి, సోదరులు, కొందరు ఆధ్యాత్మిక ప్రవచనకారులు, మరికొందరు గార్డ్స్, ఇంకొందరు టిబెటన్ అధికారులు ఇలా ఒక సమూహమంతా కలిసి నార్బులింగా ప్యాలెస్ రాజభవనం వెనుక మార్గం నుంచి బయటపడి ఇండియాకు ఆ దట్టమైన మంచుకొండల్లోంచి గడ్డ కట్టే వాతావరణంలో బయల్దేరారు…
ఓవైపు దలై లామా కోసం వెతుకుతున్న చైనా దళాలు, చెక్ పోస్టులు.. అలాంటి వాతావరణాన్ని తప్పించుకుంటూ మధ్యాహ్నాలు రహస్యంగా ఎక్కడో తల దాచుకుంటూ, రాత్రిళ్లు బహుదూరపు బాటసారులై దలై లామా బృందం ప్రయాణం సాగించింది. దలై లామా తప్పించుకున్నాడనే వార్త తెలిసిన చైనా దళాలు తమ చాపర్స్ తో ఆ మంచుకొండల్లో వెతుకుతూనే ఉన్నాయి… కానీ, అక్కడి మబ్బులతో కూడిన వాతావరణం, పొగ మంచే దలై లామా బృందాన్ని కాపాడింది. అలా చుషుల్, కైచు వంటి లోయలను దాటి హిమాలయాలను దాటి.. అరుణాచల్ ప్రదేశ్ కు చేరుకుంది దలైలామా బృందం…
- మార్చ్ 26వ తేదీకి లుంట్సే జోంగ్ కు చేరుకుంది… అప్పుడే నాటి భారత ప్రధాని నెహ్రూకు దలై లామా ఒక లేఖ రాశారు… రాజకీయ ఆశ్రయం కోరాడు… నిజానికి నెహ్రూకు చైనా అంటే ప్రేమ… చైనా కోసం ఏమైనా చేయాలనే పోకడతో పలుసార్లు భంగపడ్డాడు… దలై లామా లేఖతో ఇరకాటంలో పడ్డాడు… చైనాకు కోపం తెప్పించే పని కదా, వెనుకాడాడు… దాంతో గోక్కోవడానికి జంకు…
అప్పటికే రక్షణమంత్రి వీ.కే. కృష్ణమీనన్, ఇతరులు కూడా అదే విషయాన్ని బల్లగుద్ది చెబుతున్నారు… 20 రోజులకు పైగా కాలిబాటన చాలా క్లిష్టతరమైన ప్రయాణాన్ని చేసి ఓ పక్క దేశపు ఆధ్యాత్మిక గురువు మన దేశానికి వస్తానంటే… ఆపద సమయంలో కాదనడం సరికాదన్న విషయాన్ని తనకు ఎవరు బలంగా చెప్పారో గానీ, కన్విన్సయ్యాడు…
- దాంతో… మార్చ్ 31న దలై లామా బృందం భారత్ లో అడుగుపెట్టారు. అప్పటి అస్సాం రైఫిల్స్ కు చెందిన హవిల్దార్ నరేన్ చంద్రదాస్ అలిసి సొలిసిన దలైలామా బృందానికి నమస్కారం చేసి.. దలై లామా బృందాన్ని అస్సాం రైఫిల్స్ పోస్ట్ నుంచి తవాంగ్ కు తీసుకెళ్లారు… ఆ తర్వాత దలై లామా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు పయనమయ్యాడు… ఇక అదే అప్పట్నుంచి టిబెటన్ల ప్రవాస ప్రభుత్వ కేంద్రంగా మారిపోయింది…
తను పునర్జన్మ తీసుకుంటానని… తన తర్వాత 15వ లామాను చైనా ప్రభుత్వం గాకుండా, ట్రస్ట్ ద్వారా ప్రకటిస్తామని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు మళ్లీ చైనా వర్సెస్ దలై లామాగా పరిస్థితిని తెరపైకి తెచ్చింది…
భారత్ లోని చైనా రాయబారి శు ఫెయ్ హోంగ్ ఇది దలై లామా చెప్పినట్టు జరిగేది కాదని.. 7 శతాబ్దాల పరంపర అని.. తదుపరి లామాను ప్రకటించేది చైనానేనంటూ ఆ ప్రకటనను ఖండించాడు… ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే..? తన నిబద్ధత, ఈ వయస్సులోనూ తన ధర్మం పట్ల, తన కర్తవ్యం పట్ల, తన జనం పట్ల తను చూపే కమిట్మెంట్ చెప్పుకోవడం..!! ( రమణ కొంటికర్ల ఇన్‌పుట్స్ ఆధారంగా...
)
Share this Article