.
ఈనాడు ఏపీ ఎడిషన్‌లో ఓ వార్త… మీరు గనుక భాషాప్రేమికులు అయితే ముందుగా గుండె చిక్కబట్టుకుని చదవండి…
‘‘స్వల్పంగా జారిన ఎగువ కాఫర్ డ్యాం’’ ఇదీ హెడ్డింగ్.,. యుద్ధప్రాతిపదికన పటిష్టపరిచే చర్యలు పూర్తి… ఇది డెక్… ఇక వార్త ఏమిటంటే..? పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాం ఎడమవైపు కొద్దిగా జారింది… 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతున జారింది…
Ads
శుక్రవారం ఉదయం దీన్ని గమనించిన అధికారులు వెంటనే స్పందించారు… యుద్ధప్రాతిపదికన పటిష్టపరిచారు… ఎగువనే జారడం తప్ప దిగువన ఏ సమస్యా లేదని అధికారులు చెప్పారు… దిగువన ఇప్పటికే బట్రస్ డ్యాం కట్టేసినందున కాఫర్ డ్యామ్‌కు ఇబ్బంది ఏమీ లేదన్నారు…
ఈఇన్‌సీ, ఎస్‌ఈ జారినంత మేర పటిష్టపరిచే పనులు చేయించారు… కొద్దిగా ఎత్తు పెంచిన ప్రాంతంలోనే ఇలా కొద్దిగా జారిందని వారు వివరించారు… ఫోటో రైటప్ కూడా చదవండి… కాఫర్ డ్యామ్ వద్ద కొద్దిగా జారిన ప్రాంతం…
ఇలా వార్తలో హెడింగ్ సహా, కంటెంట్, డెక్, ఫోటో రైటప్పుల్లో కూడా చాలాసార్లు జారింది భాష… చాలా జాగ్రత్తగా జారింది అది కూడా… ఎందుకంటే… పోలవరం నాణ్యత మీద ఈగ కూడా వాలకూడదు కదా… బదనాం అవుతాం కదా ఫాఫం…
సరే, ఇంతకీ జారడం ఏమిటి..? డ్యాములు అలా అటూఇటూ, కిందకూ మీదకూ జారుతుంటాయా..? ఏమోలెండి, జారుతాయేమో… కాఫర్ డ్యాములు కదా… నదీప్రవాహానికి అనుగుణంగా అటూఇటూ జారుతూ ఉంటాయేమో… ఈనాడుకన్నా ఎక్కువ తెలుసా మనకు..?
మనలాంటి అజ్ఞాన పాత్రికేయులు, ఛాందస, చాదస్త పాత్రికేయులు మాత్రమే కొంతమేరకు కూలింది, కొట్టుకుపోయింది, కుంగిపోయింది అని రాస్తుంటాం… 8 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో కుంగినా సరే… దాన్ని జారడం అని రాయాలని మనకు తెలియదు కదా…
మనది ఆఫ్టరాల్ కాజ్‌వేలు, చెక్‌డ్యాముల స్థాయి… కానీ ఇది పోలవరం కదా… అప్పర్ స్టాండర్డ్స్ అవసరం… అధికారులు కూడా అలా జస్ట్, జారిన భాగాన్ని పైకి లేపి, యథాస్థానంలో పెట్టి, పటిష్టపరుస్తారు… మన భాషా ప్రమాణంలాగే… అంతే…

Cross section of a buttress dam.
అవునూ, కాఫర్ డ్యామ్ సరే, మరి ఈ బట్రస్ డ్యామ్ ఏమిటి..? బట్రస్ డ్యామ్ అనేది ఒక రకమైన కాంక్రీట్ ఆనకట్ట… ఇది నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి పలుచని గోడను, దానికి మద్దతుగా ట్రయాంగిల్ ఆకారంలో ఉండే పిల్లర్లను ఉపయోగిస్తుంది…
ఈ పిల్లర్లు, లేదా “బట్రెస్లు,” ఆనకట్ట వెనుక ఉన్న నీటి బరువును భూమికి బదిలీ చేస్తాయి… ఇది ఒక సాలిడ్ వాల్ కాకుండా, బట్రెస్లు అనే పిల్లర్ల వరుసతో నిర్మితమవుతుంది… ఈ పిల్లర్ల మధ్య ఖాళీ ఉంటుంది… అర్థం కాలేదా..? చదివేకొద్దీ ఏదో జారిపోతున్నట్టు అనిపిస్తోందా..? అంతే, సహజమే…!!
Share this Article