ఏమంటివి ఏమంటివి . జాతి నెపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా ?! ఎంత మాట ఎంత మాట !? తెలుగునాట దద్దరిల్లిన డైలాగ్ . ఈరోజుకీ దద్దరిల్లుతున్న డైలాగ్ . ఈ డైలాగ్ గుర్తుకొస్తే వెంటనే గుర్తొచ్చే పేరు కొండవీటి వెంకటకవి . గుంటూరు జిల్లా వారు . సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో , మాచెర్ల ప్రభుత్వ హైస్కూల్లో , ఆ తర్వాత పొన్నూరు సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాలుగా చేసినవారు . ప్రిన్సిపాలుగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన్ని యన్టీఆర్ పిలిపించుకుని ఈ డైలాగులను వ్రాసే బాధ్యతను అప్పచెప్పారు .
వెంకటకవి తాను పనిచేస్తున్న సంస్కృత కళాశాలలోనే లెక్చరరుగా పనిచేస్తున్న కత్తి పద్మారావు సహాయం కూడా తీసుకొనటం జరిగింది . మొత్తం మీద ఈ సినిమాలో డైలాగులు దద్దరిల్లటానికి గుంటూరు జిల్లా హేతువాదులే కారణం .
ఇంక ఈ సినిమా కధ . కర్ణుడి గొప్పతనాన్ని , కర్ణుడికి జరిగిన అన్యాయాన్ని జనానికి చెప్పే ఉద్దేశంతో యన్టీఆర్ ఈ సినిమాను తలపెట్టి ఉంటారు . ఈమధ్య వచ్చిన కల్కి సినిమా తర్వాత కర్ణుడు vs అర్జునుడు మీద డిజిటల్ యుధ్ధమే జరిగింది . సాంప్రదాయవాదులకు , హేతువాదులకు ఈ యుధ్ధాలు మామూలే . మళ్ళా మన సినిమాలోకి వద్దాం .
Ads
పౌరాణిక సినిమాలలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది 1977 లో వచ్చిన ఈ దాన వీర శూర కర్ణ సినిమా . కృష్ణ కురుక్షేత్రం మొదలుపెట్టి ఉండకపోతే యన్టీఆర్ ఈ సినిమాను అంత ఆగమేఘాల మీద తీసి ఉండేవారు కాదేమో ! సినిమా రంగ చరిత్రలోనే ఓ రికార్డు . నాలుగు గంటల సినిమాను 43 రోజుల్లో తీయటం ఆ పని రాక్షసుడికే సరిపోయింది . హేట్సాఫ్ .ఇదో రికార్డు .
తెలుగు సినిమా రంగంలో యన్టీఆర్ తర్వాత ఓ సినిమాలో నాలుగు పాత్రలను వేసిన ఏకైక నటవీరుడు చలపతిరావు . ఈ సినిమాలో ఇంద్రుడు , అథిరధుడు , దుష్టద్యుమ్నుడు , జరాసంధుడు పాత్రల్ని యన్టీఆర్ భక్తుడు చలపతిరావు ధరించారు . ఇవన్నీ ఎవరు చూసారు ! నాలుగు గంటల పాటు తమ అభిమాన హీరోని మూడు పాత్రల్లో తనివితీరా చూసుకోవటమే సరిపోయింది ప్రేక్షకులకు .
ద్రౌపదీ వస్త్రాపహరణం సీనులో చీరెలు వచ్చేటప్పుడు దారం చక్కగా కనిపిస్తుంది . ఇలాంటి సాంకేతిక లోపాలు కూడా కొట్టుకుపోయాయి . కనకవర్షాన్ని కురిపించారు . 1994 లో సెకండ్ రిలీజయితే మళ్ళా డబ్బుల వర్షాన్ని కురిపించారు . మొదటి రిలీజప్పుడు 9 కేంద్రాల్లో వంద రోజులు ఆడగా , హైదరాబాదులో 250 రోజులు ఆడింది .
ఈ సినిమాలో నాకు భలే భలే నచ్చిన సీను ఒకటి ఉంది . భానుమతీ దేవి స్వయంవరంలో దుర్యోధనుడు ఆమెను ఎత్తుకొని తెచ్చేసుకోవటం . ప్రభ అదృష్టవంతురాలు . ఆమె కూడా యన్టీఆర్ భక్తురాలే అంటారు . అలాగే వాళ్ళిద్దరి మీద డ్యూయెట్ . చిత్రం భళారే విచిత్రం . ధుర్యోధనుడే పాడాడా అన్నట్లు పాడాడు బాలసుబ్రహ్మణ్యం .
చాలామంది వింతగా చెప్పుకుంటారు . వింత ఎందుకు అయిందంటే విలన్ ధుర్యోధనుడికి డ్యూయెట్ ఏంటి అని ? యన్టీఆర్ ఆ పాత్ర వేసాక ఇంకా విలన్ ఏంటి ? అది హీరో పాత్రే . అది ధుర్యోధనుడు అయినా , కీచకుడు అయినా , రావణుడు అయినా , మరొకటి అయినా .
ఈ సినిమాలో మరో విశేషం ముగ్గురు యన్టీఆర్లకు తమ తమ భార్యలతో కంబైన్డ్ డ్యూయెట్ . చాలామందికి గుర్తు ఉండి ఉండదు . కర్ణుడు-వైశాలి , ధుర్యోధనుడు-భానుమతీదేవి , శ్రీకృష్ణుడు-అష్టభార్యలు . తెలిసెనులే ప్రియ రసికా పాట అది . చాలా బాగా చిత్రీకరించారు .
పెండ్యాల గారి సంగీత దర్శకత్వంలో 10 పాటలు , 35 పద్యాలు , తెలుగులో సెమి గద్యరూపంలో భగవద్గీత . జయీభవ విజయీభవ పాట , ఆ పాట చిత్రీకరణ కోసమే నేను ఈ సినిమాను ఓ అయిదారు సార్లు చూసి ఉంటా . అక్కడక్కడే తిరుగుతుంటారు . మనకు అర్థం అయిపోతూనే ఉంటుంది . అయినా చూడాలని అనిపిస్తూ ఉంటుంది . అంత నిండైన రూపంలో ఉంటాడు యన్టీఆర్ .
ఏ తల్లి నిను కన్నదో నీ తల్లినయినాను పాటకు సుశీలమ్మకు నంది అవార్డు కూడా వచ్చింది . శల్యుడిని బుట్టలో వేసుకునేందుకు పాట ఇదిగో దొరా మధిరా పాట హలం మీద బాగుంటుంది . ఇలా వ్రాసుకుంటూ పోతే పేజీలు పేజీలే .
బాలకృష్ణ , హరికృష్ణ , ధూళిపాళ , సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , యస్ వరలక్ష్మి , ప్రభ , దీప , రాజనాల , మిక్కిలినేని , జగ్గారావు , గుమ్మడి , జయమాలిని , కాంచన , బి సరోజాదేవి , శారద , మరెంతో మంది పెద్ద చిన్న నటులు నటించారు . పౌరాణికం , అందులో కురుక్షేత్ర యుధ్ధం , వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు . ఇంత భారీ సినిమాను , ఇంత మందితో 43 రోజుల్లో తీయటం అసాధారణ అద్భుతం .
10 లక్షల ఖర్చుతో కోట్ల రూపాయల కలెక్షన్స్ తెప్పించటం యన్టీఆరుకే చెల్లు . ఇవ్వాళ ఇంత టెక్నాలజీ పెరిగాక , సదుపాయాలు వచ్చాక రాజమౌళి లాంటి బాహుబలులు సంవత్సరాలు సంవత్సరాలు లాగిస్తున్నారు . 47 ఏళ్ల కిందట ఇలాంటి అద్భుతం యన్టీఆరుకి ఎలా సాధ్యమయిందో అధ్యయనం చేయవలసిందే .
ఈతరం వాళ్ళు కూడా రెండు మూడు సార్లు చూసి ఉంటారు . చూడనివారు చూడటానికి ఈ సినిమా యూట్యూబులో లేదు మరెందుకనో . పాటల , మాటల వీడియోలు మాత్రమే ఉన్నాయి . ఆసక్తి కలవారు చూడవచ్చు . ఇంతటి అద్భుతం ఆవిష్కరించబడటానికి కొరణమైన సూపర్ స్టార్ కృష్ణని కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిందే .
ఈ సినిమాతో పోటీపడిన ఆయన కురుక్షేత్రం సినిమా కూడా చక్కగా , అందంగా ఉంటుంది . పోటీ పడితే పడ్డారు . ప్రేక్షకులకు రెండు మంచి సినిమాలను చూపారు . వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులకు , టెక్నికల్ సిబ్బందికి ఓ రెండు మూడు నెలలు పని కల్పించారు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article