సోషల్ మీడియా ట్రోలర్స్ ఓ పిశాచజాతి… దానికి ఉచ్చంనీచం, మంచీచెడూ, నీతి-రీతి వంటివేమీ ఉండవు… నిలువెల్లా ఉన్మాదం నింపుకుని, ఫేక్ ఐడీలతో రకరకాల బూతులతో, హీనమైన బెదిరింపులతో దాడి చేసే ఓ రాక్షసగణం అది… సెలబ్రిటీలే కాదు, ఈ ప్రేత గణం ఎవరినీ వదిలిపెట్టదు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కరోనాలో డెల్టా వేరియంట్..!! రీసెంటుగా మీడియాలో పెద్దగా చర్చకు రాని విషయం ఒకటుంది… అది అభిషేక్ బచ్చన్ ఆక్రోశం… ఎందుకంటే..? ఈమధ్య అభిషేక్, ఐశ్వర్యల జంట తమ బిడ్డ ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లి తిరిగొస్తున్నారు, ఆ వీడియోలో ఆరాధ్య కాస్త వంకరగా నడుస్తూ కనిపించిందట… ఇంకేముంది..? ఆ చిన్నారి మీద కూడా దారుణమైన ట్రోల్ సాగింది… మొన్న ఏదో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు అభిషేక్ ఇదే ప్రస్తావిస్తూ… ‘‘ఒరేయ్ ఇడియెట్స్, మేం పబ్లిక్ ఫిగర్స్, మమ్మల్ని ఏమైనా అనండి, కానీ నా బిడ్డ మీద ఈ దాడి ఏమిట్రా ఫూల్స్..?’’ అని ఎమోషన్‌కు గురయ్యాడు… తన బాధలో అర్థముంది…
అభిషేక్ బిడ్డ ఆరాధ్య దాకా దేనికి..? బిగ్‌బాస్ నుంచి బయటికి పంపించేయబడిన యాంకర్ రవి ఆక్రోశం కూడా ఇదే… తనను ఓ ట్రోలింగ్ బ్యాచ్ టార్గెట్ చేసింది, అది ఎవరి కోసం చేస్తున్నదో వదిలేస్తే, ఆ బ్యాచ్ చివరకు రవి భార్య నిత్యను, బిడ్డ వియాను కూడా వదల్లేదు… ‘‘ఒరేయ్, నన్ను ఏమైనా అనండి, నా బిడ్డను ట్రోల్ చేయడం ఏమిట్రా’’ అని రవి కన్నీళ్లపర్యంతమయ్యాడు… తన ఆవేదనలోనూ అర్థముంది… ఆమధ్య హౌజులో ఆ చిన్నారి మాటలు ఎంత ముద్దొచ్చాయి, ఆమె వయస్సెంతని..? రవి మీద కోపాన్ని ఆ చిన్నారి మీద చూపించడం ఏమిటి అసలు..? దీన్ని పైశాచికం అనాలా..? నిజంగా పిశాచాలు కూడా ఇంత నీచంగా బిహేవ్ చేస్తాయా..? వాటికీ కాస్త నీతి, రీతి ఉంటాయేమో… ఈ ట్రోలర్స్ వాటిని మించిన జాతి…
Ads
ఇదే కాదు… ఒక ఆటలో ఓడిపోతే కెప్టెన్ బిడ్డను ట్రోల్ చేయాలా..? ఆమధ్య ఒకడయితే, హైదరాబాదీయే, పైగా ఐఐటీయన్ ఏకంగా కోహ్లి, అనుష్కల బిడ్డ వామికాను వదిలిపెట్టను అంటూ పోస్టులు పెట్టాడు… ఎంత చిన్న పిల్ల… చివరకు వాళ్లనూ వదలడం లేదు… పోలీసులు వచ్చారు, వాడిని అరెస్టు చేశారు, వాడికి బెయిల్ వచ్చింది, ఇంకేం.. అందరూ మరిచిపోయారు… కొన్నాళ్లకు మరొకడు, ఇంకొకడు, వేరే బ్యాచ్… ముక్కుపచ్చలారని పిల్లలు చేసిన నేరం ఏమిటి..? ఈ ట్రోలింగ్‌కు గురైతే రాబోయే రోజుల్లో వాళ్ల మీద దీర్ఘకాలం కొనసాగే ప్రభావం మాటేమిటి..? వాడెవడో వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై హత్యాచారం… హైదరాబాద్, సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం… ఈ రేపిస్టులకన్నా ట్రోలర్స్ ఏం తక్కువ..?! అదే మానసిక వైకల్యం… అదే పైత్యం… అదే ఉన్మాదం… మరి ఈ సైబర్ రేపిస్టులకు అడ్డుకట్ట ఎలా..? ఇప్పుడున్న ఐటీ చట్టాలు సరిపోవు..!! తుచ్ఛమైన, శుష్క వివాదాల్లో పడి, ఆ బురదలోనే కొట్టుకునే మన పార్టీలకు, మన లీడర్లకు నిజంగా మన సొసైటీకి ఏం కావాలో, ఏ డైరెక్షన్ కావాలో తెలుసా అసలు..?!
Share this Article