.
నిజం… ఏ సినిమా పాటలూ సాటిరావు అనిపిస్తుంది కొన్నిసార్లు… ఐదారేళ్లుగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ దుమ్మురేపుతున్న సంగతి చెప్పుకున్నాం కదా పలుసార్లు…
సినిమాల్లో కూడా అవే పెట్టుకుంటున్నారు… వాటి మాటెలా ఉన్నా, ప్రైవేటు సాంగ్స్ మాత్రం విపరీతంగా జనంలోకి వెళ్తున్నాయి… నమ్ముతారా..? కోట్లల్లో వ్యూస్…
Ads
ప్రత్యేకంగా సాంగ్ రాయించి, కాస్త ఖర్చు పెట్టి, సినిమాల్లో పాటలకన్నా బాగా చిత్రీకరిస్తున్నారు… అనేకమంది జానపద కళాకారులు రాణిస్తున్నారు… ఆ డీజే సౌండ్, బీట్ ధాటికి పాటలు సరిగ్గా వినిపించకపోయినా సరే ఆదరణ తగ్గడం లేదు…
ఒక సాంగ్ హిట్టయితే చాలు, ఇక చాలామంది రీల్స్, షార్ట్స్‌తో ఇరగదీస్తున్నారు… ఈమధ్య బాగా పాపులరైన పాట రానూ బొంబైకి రాను అనేది, చాలా రీల్స్ కనిపిస్తుంటాయి… ఇప్పుడు చెప్పుకునే పాట దారిపొంటత్తుండు … రాసింది మామిడి మౌనిక…
చాలారోజులవుతోంది, చాలామంది వీడియోలు చేసినట్టు కనిపిస్తూనే ఉంది… కాకపోతే తెలంగాణ ఫోక్ సూపర్ స్టార్ నాగదుర్గ పాట కోసం వేచి చూశారు చాలామంది… ఆమె అటెంప్ట్ చేస్తే అది వేరే లెవల్… తెలుసు కదా, కాపోళ్ల ఇంటికాడ, తిన్నాతిరం, అల్లల్లో నేరల్లో, ఎర్రాఎర్ర రుమాల్, గుర్తుకొస్తున్నవే బావా వంటి పాటలతో (44 వీడియోస్) చాలా ఫేమస్ ఆమె… కాపోళ్ల ఇంటికాడ ఎంత పాపులర్ అంటే, మూడునాలుగు పార్టులుగా ఎక్స్‌టెండ్ చేశారు, అన్నీ హిట్టే… ఐదవది కూడా వస్తోంది…
కోటి, కోటిన్నర, రెండు కోట్ల వ్యూస్ అంటే… తెలంగాణ ఫోక్‌కు ప్రస్తుతం శ్రోతలు, ప్రేక్షకులు ఎంత పట్టం గడుతున్నారో అర్థం చేసుకోవచ్చు… అసలు ఇదే పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు… రానూ బొంబైకి రాను పాటకు ఎన్ని కోట్ల వ్యూసో లెక్కే తెలియదు… అంతగా బ్లాక్ బస్టర్… ఫంక్షన్లలో, పార్టీల్లో ఇవే పాటలు, డాన్సులు… సరే, తాజా పాట దారిపొంటత్తుండు కు వద్దాం… అంటే, దారి వెంబడి వస్తున్నాడు అని…
మామూలుగా నాగదుర్గ గ్రూప్ డాన్సులు, సాంగ్స్ చేస్తుంది తప్ప పక్కన హీరో ఎవడూ ఉండడు, ఉండనివ్వదు, అది ఆమె స్టయిల్, పద్ధతి, అంతే… లంగా వోణీ, అచ్చమైన తెలంగాణ పిల్లలా వేషధారణ ఉంటుంది… కానీ ఇప్పటి పాటకు ఫుల్లు మోడరన్ డ్రెస్సులు వేసుకుని, మేకప్ దట్టించి, కొత్త కొత్తగా కనిపిస్తోంది… ఈమె మనకు తెలిసిన నాగదుర్గ కాదు… స్టెప్పుల్లో స్పీడ్ పెరిగింది… బాగున్నయ్ కూడా…
జస్ట్, 12 రోజుల్లో దాదాపు కోటి వ్యూస్… అదీ ఆల్రెడీ పాపులరైన లిరిక్స్‌తో చేసిన పాట… అతిశయోక్తి కాదు గానీ చిన్న చిన్న సినిమా స్టార్లు, టీవీ తారలు కుళ్లుకునే రేంజులో ఉంది ఆమె స్పీడ్… అన్నీ తెలంగాణ ఫోక్ సాంగ్సే… అయితే ఈ పాటలో చిన్న ఇబ్బంది ఉంది… రాసిన మౌనికే పాడినట్టుంది, కానీ ఫుల్ స్పీడ్… దాంతో ఆ పదాలు, వాక్యాల ఉచ్ఛరణ స్పష్టంగా లేదు ఆ బీటు మోతలో పడి…
నిజానికి పాట సాహిత్యం బాగుంది, ఎటొచ్చీ ఆ ట్యూన్‌తోనే చిక్కు… ప్యూర్ తెలంగాణ స్లాంగ్… కొన్నిచోట్ల అసలు తెలంగాణవాళ్లకే సరిగ్గా సమజ్ కాని పదాలు పడ్డయ్… ఓసారి ఫుల్ లిరిక్స్ ఇస్తాను, మీరెంతవరకూ ఫాలో కాగలరో చూసుకొండి ఓసారి…
దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు
దారిద్దునా పోనిద్దునా
జోరు మీద అత్తుండు కారు మీద అత్తండు
తోలేద్దునా పోనీ ఉకుంద్దునా
దారిపొంటత్తుండు రానిద్దునా
తొవ్వ పొంటత్తుండు పోనిద్దునా
నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక
నా ఎనక పడుత్తుండు నా ముందుంటుండు
సంధిద్దునా వద్ద వందిద్దునా
ఇనుకుంటా పోతాండు అనుకుంటా వతాండు
బందైదునా బంధమై చూపనా
గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా..
గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా ఇన్నీ గోలిద్దునా
రమ్మందునా విన్నీ పొమ్మందునా
గాలి గాలిజేత్తుండు గరమైదునా
సోయి లేకంటుండు సంధుద్దునా
గాలిగాలి గాలిగాలి గాలిగాలి గాలిగాలి
గాలిగాలి చేత్తుండు గడుసుదాన్ని అంటుండు
తల తింటాడే తరమైతలే
సోయి లేకంటుండు సోపతైతాంటాండు
సోయి ఉన్నదో వీనికి సోకున్నదో
తిప్పిచుకుంటుండు తప్పిచుకుంటుండు
ఒప్పిద్దునా వీన్ని తప్పిద్దునా
ఈడైతానంటుండు జోడైతానంటుండు
ఇరిసేద్దునా విన్నీ మరిసుందునా
తిప్పిచుకుంటుండు తింగరోడే
తప్పించుకుంటుండు తిక్కలోడే
వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి
వర్రిచ్చికుంటుండు జర్రాగే అంటుండు
రానియ్యడే ముందుపోనియ్యడే
ఆగమైతంటుండు అంగడైతంటుండు
ఎగైతాడో వీడేమైతాడో
ఎట్లైతే గట్లాయే ఎంబడే ఉండోయి
వెనక రావోయి నా వెంట రావోయ్
నీ మీద మనసయింది వరసైతే కలిసింది
ఇడిసుండకొయ్ పిల్లగా మరిసుండకొయ్
నాగు పాము కోపమొడే జెర్రు పోతు పిరికోడే
అగ్గగో కొమరెల్లి మల్లన్న కొలిసి మొక్కుతున్న
కంటసూడే మమ్ము జంట చెయ్యే
ఐలేని మల్లన్న ఆశతో మొక్కుతున్న
అన్ని కలిసే తొవ్వ చూపరాదే
పర్వతాల మల్లన్న పబ్బతి పడుతున్న
మరవబాకే మమ్ము కలుపరాదే
ఎములాడ రాజన్న కోడెనే కడుతాను
ఎంబాటుండేటోన్ని పిలవరాదే
(మనసైన పిల్ల వెంబడి పడే పిల్లగాడిని చూసి… వీణ్నేం చేయాలబ్బా, ఇలా నా వెనుక పడుతున్నాడు అంటూ… చివరకు వాడినే నావాడిని చేయాలంటూ దేవుళ్లకు మొక్కుతుంది…)
Share this Article