డీగా మారడోనా… అర్జెంటినా ఫుట్‌బాల్ ప్లేయర్… అంతేనా..? కాదు..! ఆ ఆటను ప్రేమించేవాళ్లకు మారడోనా ఓ అద్భుతం… అలాంటి ఆటగాడు మళ్లీ పుట్టడు… అంతే… ఆ కాళ్లలో ఏదో మహత్తు ఉంది… తను ఓ బంతి మంత్రగాడు… అందుకే ఆ పాదాలు పరుగులు తీస్తూనే బంతిని ఆదేశిస్తాయి… బంతి కదలికల్ని నిర్దేశిస్తాయి… ఇలా చెప్పుకుంటారు ఫుట్‌బాల్ ప్రేమికులు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ శతాబ్దపు అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు మారడోనా… ప్రత్యేకించి 1986 ప్రపంచకప్పులో ఇంగ్లండ్ మీద ఆడుతున్నప్పుడు చేసిన ఓ గోల్… ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ గోల్ అని చెబుతారు… ఆ వీడియోను ఈ కథనం దిగువ చూడొచ్చు…
ఆ మారడోనా కన్నుమూశాడు… ఫుట్‌బాల్ ప్రేక్షకలోకం కన్నీటిపర్యంతమైంది… ప్రపంచమంతా సంతాపాల వెల్లువ… అదేసమయంలో తన డార్క్ షేడ్స్‌ను కూడా కొన్ని పత్రికలు, సైట్లు ప్రచురించాయి… ఒక లెజెండ్ మరణించినప్పుడు తనలోని నెగెటివ్ లక్షణాల్ని ఎత్తిచూపడం బ్యాడ్ టేస్ట్ అనిపించవచ్చుగాక… కానీ అవసరమేనేమో… ఎందుకంటే ఎవరెస్టు స్థాయికి ఎదిగిన మనిషి ఆ స్థానాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో తెలియాలి… దాన్ని నిలుపుకోలేక పతనం కావడం ఎంత అప్రతిష్టో, మిగతావారికి అది ఎలా పాఠమో కూడా తెలియాలి…
Ads
తనకు అద్భుతమైన ఖ్యాతిని తీసుకొచ్చిన బెస్ట్ గోల్ ఆఫ్ సెంచరీకి నాలుగు నిమిషాల ముందు, అదే గేమ్‌లో అత్యంత వివాదాస్పద గోల్ చేసిన రికార్డు కూడా తనదే… తను రెగ్యులర్‌గా డ్రగ్స్ తీసుకునేవాడు… 1991లో డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చి 15 నెలలపాటు నిషేధాన్ని కూడా ఎదుర్కున్నాడు తను… 1994 ప్రపంచ కప్పు సమయంలో డ్రగ్ టెస్టులో ఫెయిలై వాపస్ పంపించేయబడ్డాడు… జర్నలిస్టులపై ఎయిర్ రైఫిల్‌తో షూట్ చేసి 34 నెలల జైలుశిక్ష విధించబడ్డాడు…
డ్రగ్స్, ఆల్కహాల్ తనను ఆరోగ్యపరంగానూ దెబ్బతీశాయి… బరువుపై అదుపు కోల్పోయాడు… ఒక దశలో 128 కిలోల బరువుకు చేరుకున్నాడు… 2004లో గుండెపోటు కూడా వచ్చింది… తరువాత బేరియాటిక్ సర్జరీ చేయించుకుని 30 కిలోల వరకూ బరువు తగ్గించుకున్నాడు… 2007 నుంచి తరచూ తన అనారోగ్యం వార్తలు, హాస్పిటళ్లలో చికిత్సలు… కొన్నిసార్లు అయితే ఏకంగా తను మరణించాడనే అబద్దపు వార్తలు కూడా వినిపించేవి…
1984లో పెళ్లి చేసుకున్న మారడోనాకు ఇద్దరు బిడ్డలు… 2004లో ఆమెకు విడాకులు ఇచ్చాడు… విడాకుల ప్రక్రియ సాగుతున్నప్పుడు తను డీగో సినగ్రా అనే అబ్బాయికి తండ్రిని అని అంగీకరించాడు… (సినగ్రా ఇప్పుడు ఇటాలియన్ ఫుట్ బాల్ ప్లేయర్)… ఒక దశలో తన పితృత్వం బయటపడకుండా, డీఎన్ఏ టెస్టులు చేయించుకోవడానికి కూడా మొరాయించాడు… ఒక గొప్ప ఆటగాడు, ఒక గొప్ప వ్యక్తి కాకపోవచ్చు… వ్యక్తిత్వ లేమితో తన చరిత్రను తనే మరకలమయం చేసుకోవచ్చు… నాణేనికి రెండు వేర్వేరు పార్శ్వాలు… మారడోనా జీవితం కూడా అంతే…
Share this Article