Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దటీజ్ దాసరి… పల్లవి వేటూరి రాస్తే… మిగతాదంతా ఆత్రేయ పని…

June 10, 2024 by M S R

నవమినాటి వెన్నెల నీవు…. దాసరి నారాయణరావు ఓ టైమ్ లో తను తీసిన సినిమాలకు కథ స్క్రీన్ ప్లే మాటలు మాత్రమే రాసుకునేవారు. దాసరి కేవలం స్క్రీన్ ప్లే దర్శకత్వం అని వేసుకున్న సినిమా నాకు తెలిసి చిల్లరకొట్టు చిట్టెమ్మ అనుకోండి …

ఆ తర్వాత ఆ లిస్టులోకి పాటలు కూడా వచ్చి చేరాయి. తను గీత రచయితగా మారడానికి కారణమైన వేటూరి సుందరరామ్మూర్తితో అనేక అర్ధవంతమైన గీతాలు రాయించుకున్నారు దాసరి. అందులో ఒకటి ప్రేమమందిరం సినిమాలో ఎనిమిది దిక్కుల నడుమ సంసారం …ఎనభై నాలుగు లక్షల సంతానం … అంటూ పల్లవిలో వచ్చే … టైటిల్ సాంగు.

ప్రేమమందిరం … నిరు పేదలు తలదాచుకునే నింగి కుటీరం … కలవారలు కలలు కనే పసిడిపంజరం అంటూ సాగుతుంది సాహిత్యం. వేటూరి కన్నుమూయడానికి కొద్ది రోజుల ముందు ఆయనకో సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి దాసరి ముఖ్య అతిధిగా వచ్చారు. దాసరిని చూస్తూనే కన్నీళ్ల పర్యంతం అయ్యారు వేటూరి.

Ads

సినీ కవిగా తాను సాగించిన ప్రయాణంలో మరపురాని మజిలీల్లాంటి పాటలు రాయడానికి అవకాశం ఇచ్చారంటూ కౌగలించుకున్నారు. వారిద్దరి రాగబంధం అంతటిది. అనేక అందమైన హిట్ సాంగ్స్ ఆ కంబినేషన్ లో వచ్చాయి. వాటిలో మచ్చుకి ఒకటి నిన్నటి దాకా శిలనైనా అంటూ మేఘసందేశం సినిమాలో రాసిన పాట.

నిజానికి మేఘసందేశం కథ అనుకుని సినిమా తీయాలనుకున్న తర్వాత తను పాటలు రాయకూడదని నియంత్రించుకోవడమే దాసరి గొప్పతనం. దాసరి తొలి రోజుల్లో తీసిన సినిమాల్లో అత్యధికం సి.నారాయణరెడ్డే రాసేవారు. ఆ తర్వాత నెమ్మదిగా వేటూరి దిశగా మళ్లారు.

ఆ జనరేషన్ అందరి దర్శకుల్లా కాకుండా గుర్తుండిపోయే ప్రత్యేక గీతాల కోసమే వేటూరి తలుపు తట్టేవారు దాసరి . అక్కినేనితో దాసరి తొలి చిత్రం దేవదాసు మళ్లీ పుట్టాడులో దిక్కులు కలిసే సమయం అంటూ రాయించుకున్న పాటలో సూర్యుడు చూడని ఉదయం లాంటి వేటూరి మార్కు పదబంధాలు కనిపిస్తాయి.

దాసరి తన సినిమాలకు తనే పాటలు రాసుకోడానికి ఒక రకంగా వేటూరే కారణం. శ్రీవారి ముచ్చట్లు చిత్రానికి వేటూరి అనుకున్న సమయానికి పాటలు ఇవ్వలేకపోయారు. పని ఆగకూడదనే ఉద్దేశ్యంతోనే పాటలు కూడా తనే రాసేసుకున్నారు దాసరి. అంతకు ముందు దాసరి స్వీయ నిర్మాణంలో వచ్చిన శివరంజని లో వేటూరి మార్క్ గీతం ఒకటి రాయించుకున్నారు.

అదే నవమి నాటి వెన్నెల నీవు .. దశమినాటి జాబిలి నీవు … దాసరి వేటూరి కాంబినేషన్ లో వచ్చిన అర్ధవంతమైన గీతాల్లో ఏడంతస్తుల మేడ టైటిల్ సాంగ్ ఒకటి.

పాయసాన గరిటై తిరిగే పాడు బతుకు
ఎందుకు మనకు
పాలలోన నీరై కరిగే
బంధమొకటి చాలును తుదకు….
అంటూ రాస్తారు వేటూరి.

అలాంటి పాటలు రాయగలగడం వేటూరి గొప్పతనం అయితే…అలాంటి సన్నివేశాన్ని కల్పించడం దాసరి ప్రత్యేకత. అదీ వారిద్దరి అనుబంధం. తను తీసిన మాస్ చిత్రాల్లో కూడా వేటూరితో చక్కని పాటలు రాయించుకున్నారు దాసరి నారాయణరావు.

కృష్ణంరాజు హీరోగా వచ్చిన కటకటాల రుద్రయ్య లో కూడా అలాంటి గీతం ఒకటుంది. జె.వి.రాఘవులు అద్భుతంగా స్వరపరిచిన ఈ గీతం వీణ నాది తీగె నీది…తెలుగు సినిమాల్లో వచ్చిన అందమైన యుగళగీతాల్లో ఇది ఒకటి. జి.కె.వెంకటేశ్ తెలుగువాడైనా…కన్నడంలోనూ మళయాళంలోనూ ఎక్కువ చిత్రాలు చేసిన సంగీత దర్శకుడు. ఇళయరాజాకు గురువు.

దాసరి తీసిన రావణుడే రాముడైతే చిత్రం కోసం హృదయాలను తాకే మెలోడీ ట్యూన్ చేశారు వెంకటేశ్. నిజానికి అప్పటికే ఆ ట్యూన్ ఆయన ఓ కన్నడ చిత్రంలో వాడారు. అయితే అదే ట్యూన్ లో అందమైన భావాలను తెలుగులో పొదిగారు వేటూరి. అందుకే తెలుగువారు ఎప్పటికీ మరచిపోలేని పాటగా నిల్చిపోయింది.

రవి వర్మకే అందని అందానివో … కన్నడంలో పి.బిఎస్ పాడితే తెలుగులో ఎస్పీబీ పాడారు. డెబ్బై దశకంలో ఎన్టీఆర్ స్టెప్పులతో జనాన్ని ఊర్రూతలూగించారు. ఆ వేవ్ నడుస్తుండగానే ఎన్టీఆర్ తో దాసరి సినిమాలు తీశారు. సాధ్యమైనంత వరకు నడుస్తున్న ట్రెండుకు భిన్నంగా వెళ్లడం దాసరి స్పెషాల్టీ.

ఆ ఆలోచనే ఎన్టీఆర్ తో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి లాంటి సినిమాలు తీయించింది. ఎన్టీఆర్ కు ఓలమ్మీ తిక్కరేగిందా లాంటి స్టెప్పుల పాటలు రాసిన వేటూరితో ఓ హృద్యమైన యుగళ గీతం రాయించుకున్నారు దాసరి. సూరీడు చుక్కెట్టుకుంది జాబిల్లి పువ్వెట్టుకుంది… కడలీ చీరా కట్టి గోదారి పైటేసి నడచి వస్తున్నాది భూదేవి పాట కాస్త స్పెషల్ గానే ఉంటుంది.

అక్కినేని రెండు వందల చిత్రంగా వచ్చిన మేఘసందేశంలో ఆకాశదేశాన కావచ్చు … బాలమురళి గానం చేసిన పాడనా వాణి కళ్యాణిగా కావచ్చు … మరచిపోవడం సాధ్యమా? దాసరి డైరక్ట్ చేసిన ఓ సినిమా కోసం వేటూరి కేవలం పల్లవే రాశారు. మిగిలిన పాట ఆత్రేయ కంప్లీట్ చేశారు.

మురారి వ్యవహార శైలితో విబేధించిన వేటూరి తప్పుకున్న ఆ గీతం కొమ్మకొమ్మకో సన్నాయి. గోరింటాకు చిత్రంలో కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి వరకు వేటూరి రాస్తే మిగిలిన భాగాలు ఆత్రేయ కంప్లీట్ చేశారు. విచిత్రంగా తన సినిమా పాటల విశేషాలు రాస్తూ…కొమ్మకొమ్మకో సన్నాయి అనే టైటిల్ పెట్టుకున్నారు వేటూరి.

ఇలాంటి సందర్భమే మరోటి … ఓ సినిమా కోసం వేటూరి రాసిన సాహిత్యం క్యాచీగా లేదన్నారట దర్శక నిర్మాతలు. ఆ గీతాన్ని చూసి తన సినిమాలో వాడుకున్నారు దాసరి.

తొలి సంధ్యకు తూరుపు ఎరుపు …
మలి సంధ్యకు పడమర ఎరుపు …
తెలియవు నాకు పడమర తూరుపు …

ఇలా సాగే ఈ గీతాన్ని బాలుతో స్వరపరచి కన్యా కుమారి సినిమాలో వాడుకున్నారు. నిజానికి ఆ సాహిత్యాన్ని దాసరికి చూపించింది బాలునే అనుకోండి. సంగీత దర్శకుడుగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను పరిచయం చేసింది దాసరి నారాయణరావే.

శ్రీవిద్య, జయమాలిని నటించిన కన్యాకుమారి చిత్రంలో బాలు స్వరపరచిన మొదటి పాట వేటూరిదే. ఇది తొలి పాట…ఒక చెలి పాటా…అంటూ సాగే ఈ గీతం కూడా దర్శక రత్న అభిరుచికి అద్దం పడుతుంది. దాసరి రాసిన పాటలు చూస్తే నాకు అనిపించేదేమంటే ఆయన ఆత్రేయను చూసి వాత పెట్టుకున్నాడని. అక్కడే దెబ్బతిన్నారనుకోండి పాపం …

కానీ ఎవరితో ఏ పని చేయించుకోవాలో తెలిసిన వాడు దాసరినారాయణరావు. ఆ విషయంలో మాత్రం చాలా గొప్పోడు. తను మనసు పెట్టి తీసిన సినిమాలకు సాధ్యమైనంత వరకు రమేష్ నాయుడును గానీ సత్యంను గానీ సంగీతానికి పెట్టుకునేవారాయన. అంతకంటే ఏం చెప్పాలి ఆయన టేస్టు గురించి….. (రంగావఝల భరద్వాజ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జాతిని… ఆ వెగటు కూతల నిర్మాత పిచ్చి కూతలు మళ్లీ… కవరింగు…!
  • అరాచకం..! షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు..!!
  • వావ్… వాట్ ఏ క్రికెట్ మ్యాచ్… మూడు సూపర్ ఓవర్లతో ఫలితం…
  • దిల్ రాజు గారూ… మరి మీకూ బాధ్యత ఉండాలి కదా, మరిచారా..?!
  • మోడీ సైప్రస్ ఫోటో వెనుక… శత్రు తుర్కియేకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్..!!
  • జాగ్రత్త, ప్రభుత్వ సంస్థల పేరిట సైబర్ ఫ్రాడ్… పదిమందికీ షేర్ చేయండి…
  • లతా, ఎందుకు చేశావీ పని..? గాంధీ మునిమనమరాలు- ఓ ఫ్రాడ్ కేసు..!!
  • ‘సూపర్ సిక్స్’ ప్యాక్ రేవంత్ రెడ్డి… నిజంగానే ఇది చేస్తే మరింత మేలు..!!
  • పార్టీ జర్నలిస్టు వేరు- పార్టీ కార్యకర్త వేరు… తేడాను చెరిపేశారు…
  • వినోద రూపంలో సందేశం ఓ మంచి కళ… ఈ ఇద్దరు దొంగలు వాళ్లే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions