.
మూడో రోజు కొనసాగుతున్న సినీ కార్మికుల పంచాయితీ… కొలిక్కిరాని నిర్మాతలు, కార్మికుల పంచాయితీ… కొనసాగుతున్న సినీ కార్మికుల బంద్… వేతనాలు పెంచేవరకూ తగ్గేది లేదంటున్న కార్మికులు…
కాసేపట్లో నిర్మాతల కీలక సమావేశం… వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ… నిర్మాతల నిర్ణయాలపై నెలకొన్న ఉత్కంఠ… ఫెడరేషన్ తీరు నిరసిస్తూ ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం…
Ads
అసలు ఫెడరేషన్ సభ్యత్వంలో పనేమీ లేదు, ఎవరికైనా చాన్సులు ఇస్తాం అంటోంది నిర్మాతల మండలి… తాడు లాగుతున్నారు ఇరువైపులా… సరే, ఏ సమ్మె అయినా మొదట్లో ఇలాగే ఉంటుంది…
హీరోల పాదాల మీద పడి… వందల కోట్లు అర్పించుకునే నిర్మాతలు… రోజువారీ కూలీ మీద బతికే వర్కర్లకు జీతాలు పెంచితే ఏమైందట అనేది స్థూలంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం… కానీ ఫెడరేషన్ నేతల పోకడలపై కూడా వ్యతిరేకత ఉంది…
కానీ సగటు కార్మికుడికి నాలుగు పైసలు పెంచితే తప్పేముంది..? టికెట్ల రేట్లు పెంచుకుని, బెనిఫిట్ షోలతో, అదనపు షోలతో ఎలాగూ జనం నుంచి దండుకుంటున్నారు కదా… కార్మికులకు జీతాలు పెంచండి, ఎలాగూ జనాన్ని దోపిడీ చేసే డబ్బులే కదానేది సగటు ప్రేక్షకుడి కడుపుమంట, కోరిక…
సరే, ఈ వార్తలకన్నా ప్రధానంగా ఆసక్తికరంగా కనిపించింది… చిరంజీవి పెద్దరికం… నిజమే, ఇప్పుడు సినిమా పరిశ్రమకు ఓ దాసరి కావాలి… అది చిరంజీవి అయినా సరే, పర్లేదు… పెద్ద వయస్సు… గతంలో చిరంజీవి దాసరిలాగా పెద్దన్న పాత్రకు సిద్ధమై… ఇప్పుడున్న స్థితిలో అదయ్యే పని కాదని గ్రహించి తప్పుకున్నాడు…
చెప్పుకున్నాం కదా, ఇది దాసరి కాలం కాదు… ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను, తప్ప పెద్దరికం నాకు వద్దు అని తేల్చిపడేశాడు చిరంజీవి అప్పట్లో… నిజానికి మాటతీరు, మర్యాద, మన్ననతో ఇష్యూస్ సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నాలకు చిరంజీవే కరెక్టు… తనకు అందరితోనూ సత్సంబంధాలే ఉన్నాయి…
ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చాడు… ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం… కార్మికుల బాధలను చిరంజీవికి వివరించనున్న ఫెడరేషన్… ఇప్పటికే చిరంజీవిని కలిసిన గిల్డ్ నిర్మాతలు… చిరు- ఫిల్మ్ ఫెడరేషన్ మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి… ఇలాంటి వార్తలు కనిపిస్తున్నాయి… గుడ్, తప్పులేదు…
దిల్ రాజు తెలంగాణ ఫిలిమ్ కార్పొరేషన్ పెబ్బ… కానీ తనపై ఎగ్జిబిటర్లు, నిర్మాతల సిండికేట్ అనే విమర్శలు… అల్లు అరవింద్ ఉన్నా తనమీద అవే విమర్శలు… సురేష్ బాబు కూడా… సో, అందరికీ ఆమోదయోగ్యుడైన ఓ పెద్ద మనిషి కావాలి…
నిన్న రేవంత్ రెడ్డిని కలిశాడు… వెంటనే కోడలికి రేవంత్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ ప్రమోషన్ బాపతు ఏదో అధ్యక్ష పదవి ఇచ్చాడు రేవంత్ రెడ్డి… అటు ఏపీలో తనదే ప్రభుత్వం… తన తమ్ముడే కదా డిప్యూటీ సీఎం… ఐతే ఇలాంటి సమ్మె వంటి పరిస్థితుల్లో దాసరిలాగా పెదరాయుడు న్యాయం చెప్పగలడా అనేది కాస్త డౌటే… చూడాలి… జై దాసరి చిరంజీవి…
ఈలోపు నమస్తే తెలంగాణ పత్రిక చాలాదూరం వెళ్లింది… అదంతే… చిరంజీవికి జుబ్లీహిల్స్ టికెట్ ఇస్తారని ఓ ఊహాగానం… ఎవరూ నమ్మరు, నమ్మని రాయడమే కదా ప్రజెంట్ జర్నలిజం… ఈరోజు తనే క్లారిటీ ఇచ్చాడు… ఇక నేను రాజకీయాల్లోకి రాను… అది గత అధ్యాయం అని…
సరే, ఇండస్ట్రీకి ఓ పెద్ద దిక్కుగా ఉండు, పర్లేదు… కానీ ఇక్కడ మరో ప్రశ్న… అది రిజిష్టర్డ్ కార్మికుల ఫెడరేషన్ కదా… మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఎంటర్ కాకూడదు..? తెలంగాణలో కార్మిక శాఖ ఉంది… దానికి ఓ మంత్రి కూడా ఉన్నట్టు గుర్తు… ఫెడరేషన్ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చి ఉంటే బాగుండేది… (హైదరాబాద్ బేస్డ్ సంఘాలు కాబట్టి)… దానికీ సరైన నాయకత్వం దిక్కున్నట్టు లేదు…!!
ఏ ఒప్పందాలు జరిగినా అధికారికంగా, ప్రభుత్వపరంగా జరిగితే వాటికి చట్టబద్ధత, విలువ ఎక్కువ..!! అది దాసరి చిరంజీవి సమక్షంలో జరిగినా సరే..!!
- యాభై రోజుల సమ్మె జరిగిన తరువాత అందరూ ఒప్పుకున్న నియమావళి 2011 లో… అన్ని ట్రేడ్ బాడీస్ కి పంపిన తరువాత చిరంజీవి సంబంధిత ప్రభుత్వ శాఖల సహకారంతో చర్చిస్తే ఫలితం ఉంటుందని ఇండస్ట్రీలో పలువురు పెద్దల నమ్మకం…
మిస్టర్ మెగాస్టార్… ఈ వయస్సులో ఆ పిచ్చి స్టెప్పులు, సూపర్ హీరోయిక్ కథలు కార్ణానాలు దేనికిలే గానీ… వయస్సుకు, పెద్దరికానికీ, హోదాకు తగినట్టు ఈ ‘దాసరి చిరంజీవి’ పాత్రలో ఫిక్సయిపో… మర్యాద, మన్నన, గౌరవం అన్నీ ఉంటాయి… మస్తు సంపద ఉండనే ఉంది…!! రెండు పెన్షన్లు కూడా వస్తున్నాయి ఎలాగూ…!!
Share this Article