మన పత్రికల్లో, మన టీవీల్లో కనిపించే చాలా వాణిజ్య ప్రకటనలు నవ్వు పుట్టిస్తయ్, చిరాకు కలిగిస్తయ్, ఆగ్రహాన్ని రేపుతయ్… అసహ్యాన్ని రేకెత్తిస్తయ్… వాటి ఒరిజినల్ ఇంగ్లిష్ లేదా హిందీల్లో బాగానే ఉంటాయి… ఎటొచ్చీ ప్రాంతీయ భాషల్లోకి అనువాదమే ఛండాలంగా ఉంటుంది… నాసిరకం తమిళ సినిమాల్లో డైలాగులను తెలుగులోకి అనువదించే తీరు చూస్తాం కదా… ఈనాడులో క్షుద్ర అనువాదాలు చదువుతాం కదా… అవునవును, కేంద్రం జారీ చేసే ప్రకటనలు కూడా అంతే… పరమ దరిద్రంగా ఉంటయ్… ఎంత అంటే… మోడీ వేక్సినేషన్ పాలసీల్లాగే… మధ్యలో మోడీ ఎందుకొచ్చాడు..? వేక్సినేషన్ పాలసీ ఎందుకొచ్చింది అంటారా..? చెప్పుకోబోయేది ఆ సబ్జెక్టే కాబట్టి…
వేక్సిన్ వేసుకున్నాక మన వివరాలు ఎంట్రీ చేస్తారు కదా… దాంతో ఓ సర్టిఫికెట్ తయారవుతుంది డిజిటల్‌గా… దాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు… అవసరమున్న దగ్గర వాడుకోవచ్చు… అయితే విషయం ఏదైనా సరే, మోడీ సాబ్ బొమ్మ ఉండాల్సిందే, ప్రచారం రావల్సిందే కదా… దాని మీద కూడా బొమ్మ పెట్టడం, దాని మీద విమర్శలు కూడా వదిలేద్దాం… ఎవరికి అవకాశం ఉంటే వాళ్లు ప్రచారకాంతను కౌగిలించుకోవడమే… ఏపీలో పత్రికల్లో అత్యంత విరివిగా ప్రభుత్వ కార్యక్రమాల మీద ఫస్ట్ పేజీ జాకెట్ యాడ్స్ వస్తూనే ఉన్నయ్… ఉంటయ్… అంతెందుకు ఆనందయ్య మందు సీసాలపై కూడా వైఎస్, జగన్ బొమ్మ ఉన్నయ్… అది చెవిరెడ్డి ఇష్టం… అలాగే ప్రధాని మోడీ ఇష్టం… అయితే చిరాకు పుట్టేది ఎక్కడా అంటే..? అనువాద పైత్యం..! పైన ఓ బొమ్మ చూశారు కదా… వేక్సిన్ డోస్ వేసుకున్నట్టుగా తెలుగులో జనరేటయిన సర్టిఫికెట్టు… ‘‘టీకాతోపాటు పత్యం కూడా చెయ్యాలి’’ అని ఉంది… ఇదేమిటి..? ఈ వేక్సిన్ ఆయుర్వేద మందా..? లేక సిద్ధవైద్యమా..? ఈ పత్యం ఏమిటబ్బా..? మరి వేక్సిన్లు వేసే నర్సులు ఫలానా పత్యం చేయాలి అని ఏమీ చెప్పడం లేదు… ఏమిటబ్బా అని తరచిచూస్తే మరో ‘‘ప్రతికూల సంఘటన’’ కనిపించింది…
Ads
ఆలోచించగా, లోచించగా, చించగా, చగా… సమజైంది ఏమిటంటే…? అసలు వాక్యాలు హిందీలో లేదా ఇంగ్లిషులో వేరే ఉంటయ్… ఇదంతా అనువాద పైత్యమే తప్ప పత్యం ఏమీ లేదు అని..!! టీకా కుచ్చాక జ్వరమో, ఒళ్లునొప్పులో వస్తే ఓ డోలో వేసుకొండి అనేదే పత్యం… అది కూడా ఎవరూ చెప్పరు, పరుల నుంచి ఆ ఆత్మజ్ఞానం మనమే సాధించి తెలుసుకోవాలి… పైన బొమ్మ చూడండి… అందులో ఏముంది..? ‘‘दवाई भी और कड़ाई भी’’ అనగా ఇంగ్లిషులో Yes to medicine and also yes to caution… తెలుగులో ఏమిటంటే… టీకాయే కాదు, జాగ్రత్త కూడా… ఇంకా విశదీకరణ ఏమిటంటే… ‘‘మందు మాత్రమే కాదు, ముందు జాగ్రత్తలు కూడా…’’ నిజానికి మంచి సూత్రం… చెప్పదగిన విషయమే… కానీ చివరకు ఇలా తగలెట్టేశారు సదరు మంత్రిత్వ శాఖ ఉద్యోగులు… అంతేలెండి… వేల కోట్ల వేక్సిన్లు, లక్షలాది ప్రాణాలపైనే ఓ పద్దతీపాడు లేదు, ఈ పదాలకేమొచ్చింది..? మరి ఈ ప్రతికూల సంఘటనలు ఏమిటీ అనేదే కదా మీ ప్రశ్న… If any adverse Events అనే ఇంగ్లిషు పదాలకు వచ్చిన తిప్పలు ఇవి… టీకా వేసుకున్నాక అనుకోని ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే… ఇలా రాస్తే సరిపోయేది… భలేవారే… అంత తెలివే ఉంటే వాళ్లు మంత్రిత్వ శాఖల్లో ఎందుకుంటారు..? ఏ దిక్కుమాలిన పత్రికలోనో సబ్‌ఎడిటర్‌గా కునారిల్లిపోయేవాడు…!! కరోనా సోకి కార్పొరేట్ వాడికి చిక్కిన రోగుల్లా..!!
Share this Article