డేవిడ్ జాన్సన్ @ 157.8 కేఎంపీహెచ్…. షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, జెఫ్రీ థాంప్సన్, మిచెల్ స్టార్క్, మిచెల్ జాన్సన్, మహ్మద్ షమి, షేన్ బాండ్ వంటి బౌలర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో గంటకు 155 కిలోమీటర్ల పైగా వేగంతో బంతులు విసిరిన రికార్డు ఉంది. ఇప్పుడు వస్తున్న యువ క్రికెటర్లలో కొంత మంది అప్పుడప్పుడు 150 కిలోమీటర్లు దాటుతున్నారు. కానీ వీళ్ల కంటే ముందే ఒక భారత బౌలర్ 157 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. కాకపోతే అది రికార్డులకు ఎక్కలేదు. అతనే డేవిడ్ జాన్సన్.
కర్ణాటకలోని హసన్ జిల్లాలోని అర్సికెరెలో 1971 అక్టోబర్ 16న డేవిడ్ జాన్సన్ జన్మించాడు. కర్ణాటక తరపున రంజీ మ్యాచ్‌లు ఆడిన జాన్సన్..ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 39 మ్యాచ్‌లు ఆడి 128 వికెట్లు తీశాడు. రంజీల్లో 152 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. లో ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే జాన్సన్.. ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో సెంచరీ కూడా నమోదు చేశాడు. ఇక 33 లిస్ట్ ఏ గేమ్స్‌లో 41 వికెట్లు తీశాడు.
1996లో భారత బౌలర్ జవగళ్ శ్రీనాథ్ గాయపడటంతో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో డేవిడ్ జాన్సన్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా టూర్‌కు కూడా జాన్సన్ ఎంపికయ్యాడు. కానీ నియంత్రణ కలిగిన బౌలింగ్ చేయడంలో విఫలం కావడంతో కేవలం 2 టెస్టులతో అతడి కెరీర్ ముగిసింది.
Ads
చివరిగా 2015లో కర్ణాటక ప్రీమియర్ లీగ్‌కు ఆడాడు. ఆ తర్వాత క్రికెట్ నుంచి దూరంగా జరిగాడు. అయితే కొంత కాలంగా అనారోగ్య సమస్యలు, డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న జాన్సన్.. రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. మరి ఏం జరిగిందో ఏమో కానీ.. గురువారం బెంగళూరులోని ఎస్ఎల్వీ పారడైజ్ అపార్ట్‌మెంట్‌లోని 4వ ఫ్లోర్‌లోని తన ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు.
డేవిడ్ జాన్సన్ మృతికి నివాళులు అర్పిస్తూ.. గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు… By…. John Kora
Share this Article