.
. ( రమణ కొంటికర్ల ) .. … అండర్ వరల్డ్ డాన్ గా దావూద్ ఇబ్రహీం నెట్ వర్క్… ప్రపంచదేశాల అండర్ వరల్డ్ మాఫియాతో తన సంబంధాలు.. ఈలోకానికి ఎంతో కొంత తెలిసిందే. బాలీవుడ్ ను శాసించిన మాఫియా డాన్ గా దావూద్ పేరు తెలియనివారూ అరుదే!
అలాంటి దావూద్ ను అంతం చేస్తానని హెచ్చరించిన ఓ లేడీ డాన్ గురించి మీరు విన్నారా..?
Ads
ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించి, గృహిణిగా ఉండే ఓ మహిళ.. తన భర్త హత్య తర్వాత దావూద్ ఇబ్రహీంను మట్టుబెడతానని శపథం పూనింది. ముంబై అండర్ వరల్డ్ డాన్ గా దావూద్ ఇబ్రహీం పేరుకెక్కితే… ఆ దావూద్ ఇబ్రహీంకే వ్యతిరేకంగా ముఠాలను జట్టు కట్టి దావూద్ కార్యకలాపాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ దావూద్ అండ్ కంపెనీకి నిద్ర లేని రాత్రులు మిగిల్చింది.
ఇంతకీ ఎవరామె..?
1993 బాంబు పేలుళ్లకు సూత్రధారిగా, ప్రపంచ ఉగ్రవాదులతో సంబంధాల నేపథ్యంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కేరాఫ్ గా మారిన దావూద్ ఇబ్రహీం కోసం ముంబై పోలీస్, భారత నిఘా సంస్థలు శోధించని చోటు లేదు. 2003లో ఏకంగా 25 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అతడి తలకు వెలకట్టి ప్రకటించిన ప్రపంచ ఉగ్రవాది దావూద్.
ముంబై డాన్ గా వెలుగులొకొచ్చిన ఆ చీకటి సామ్రాజ్యపు అధినేత దావూద్ ఇబ్రహీం చేతుల్లో మొహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఎందరో గ్యాంగ్ స్టర్ దావూద్ రౌడీగ్యాంగ్స్ చేతుల్లో హతమైనా… మెహమూద్ ఖాన్ హత్య మాత్రం దావూద్ ను వెంటాడింది.
ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ నిఘా సంస్థల కళ్లుగప్పి మేనేజ్ చేయగల్గిన అంతటి గ్యాంగ్ స్టర్.. ఒక మహిళ ఆది పరాశక్తిగా మారి శపథం పూని వెంటాడితే తన నేర జీవితమెంత సవాళ్లనెదుర్కోవాల్సి వస్తుందో రుచిచూశాడు.
ఈ విషయాన్ని ముంబైకి చెందిన జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్తకంలో పేర్కొన్నాడు. తన పుస్తకంలో ఆమెను ఫెమ్మా ఫాటెల్ అంటే పగ తీర్చుకునేందుకు సిద్ధమైన ఓ దేవదూతగా అభివర్ణించాడు.
హుస్సేన్ మాఫియా కథలపై రాసిన డోంగ్రీ టూ దుబాయ్, సిక్స్ డికేడ్స్ ఆఫ్ ముంబై మాఫియా, మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై, బ్లాక్ ఫ్రైడే, మైనేమ్ ఈజ్ అబూసలేమ్, బైకుల్లా టూ బ్యాంకాక్ వంటివెన్నో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఇక కొన్ని రచనలాధారంగా ఏకంగా బాలీవుడ్ సినిమాలు కూడా నిర్మించారు. నిన్నమొన్నటి సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన సినిమా గంగూభాయి కటియావాడీకి కూడా జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై రచనే మూలం.
ముంబైలోని ఓ సంప్రదాయ కుటుంబంలో జన్మించిన సప్నకు.. తన భర్త మెహమూద్ కు ముంబై అండర్ వరల్డ్ తో ఉన్న లింక్స్ గురించి తెలియదు. దావూద్ చెప్పినవాటిని పెడచెవిన పెట్టినందుకు మొహమూద్ ను దావూద్ మనుషులు ముంబై విమానాశ్రయంలో అతి కిరాతకంగా హత్య చేశారు.
కలచివేసిన తన భర్త మరణంతో అప్పటివరకూ ఓ సాధారణ గృహిణిగా ఉన్న సప్న… దావూద్ ఇబ్రహీంను మట్టుబెడతానని ప్రతినబూనింది. వినడానికి సినిమాటిక్, డ్రమటిక్ గా అనిపించినా… ఆమెలో రగిలిన పగ ఆమెను మరో మాఫియా క్వీన్ గా మార్చేసింది.
దావూద్ ను మర్డర్ చేసేందుకు ఓ ప్రణాళిక రచించే క్రమంలో ముందుగా ఆయుధాలనెలా వాడాలో నేర్చుకుంది అష్రాఫ్ ఉరఫ్ సప్నాదిదీ. దావూద్ ప్రత్యర్థి గ్యాంగులతో జట్టు కట్టడంతో పాటు.. ఓ కీలక గ్యాంగ్ స్టర్ గా ముంబై అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో పేరు మోసిన హుస్సేన్ ఉస్తారాను కలిసింది.
తన నుంచే ఆయుధాలనెలా వాడాలో తెలుసుకుంది. అలా మెల్లిమెల్లిగా దావూద్ అంటే పడని గ్యాంగ్స్ తో చేతులు కలిపిన సప్న.. కాస్త పుంజుకుంటూ తన ఆధిపత్యాన్ని మొదలుపెట్టింది. దావూద్ కు పోర్టుల ద్వారా వచ్చే స్మగుల్డ్ గూడ్స్, ఆయుధాలను ఎక్కడిక్కడ అడ్డుకోవడంతో చాలాకాలం దావూద్ గ్రూప్ ఇరిటేటైంది.
వారి కార్యకలాపాలకూ తీవ్ర అంతరాయమేర్పడింది. కానీ, సప్నను మాత్రం వారు పట్టుకోలేకపోయారు. ఎక్కడుందో కనుక్కోలేకపోయారు. మెహమూద్ ను మర్డర్ ను చేసినదానికి ఇంతవరకూ వస్తుందనుకోలేదనే పశ్చాత్తాపమూ తప్పలేదు.
సప్న అప్పటికే ముంబై అండర్ వరల్డ్ గురించి అణువణువూ తెలుసుకుంటోంది. ఆమె ఎంతగా విస్తరిస్తుంటే అంతగా దావూద్ అండ్ కంపెనీ అనుచరుల్లో తెలియని ఆందోళన, భయం రోజురోజుకూ పెరుగుతోంది.
అప్పటికే ముంబై నగరంలోని పలు పేకాట క్లబ్బులు, డ్యాన్స్ బార్స్ పైనా సప్నాదీది పెత్తనం మొదలైంది. దావూద్ గ్యాంగులను ఆయా చీకటి వ్యాపారసామ్రాజ్యం పట్టించుకోవడం మానేస్తోంది. ఇవన్నీ దావూద్ కూ, ఆయన గ్యాంగ్ కు ఏమాత్రం మింగుడుపడని పరిస్థితులను సృష్టించాయి.
దావూద్ మర్డర్ కు సప్న వేసిన ప్లానేంటి..?
అది 1990వ సంవత్సరం. భారత్ – పాక్ క్రికెట్ మ్యాచంటే నరాలు తెగే ఉత్కంఠ ఉన్న రోజులవి. ఏకంగా బాలీవుడ్ నే కాదు.. క్రికెటర్స్ తోనూ సంబంధాలతో దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని అండర్ వరల్డ్ మాఫియా తామాడిందాట అన్నట్టుగా సాగుతున్న కాలమది.
అదిగో అప్పుడు ఇండియా- పాక్ మ్యాచ్ జరుగుతున్న షార్జాలో దావూద్ ఇబ్రహీంను లేపెయ్యాలని చూసింది సప్న. అందుకోసం తన రౌడీమూకనంతా అందుకు తగ్గట్టుగా తయారుచేసి షార్జాకు పంపింది.
ఆమెకు తెలుసు షార్జాలో దావూద్ ను చంపడమంటే అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని. కానీ, అప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ కాదనేది డిసైడైంది. అప్పటికే నిరీక్షణకు ఓపిక నశించింది. వీఐపీ గ్యాలరీలో కూర్చుని చూసే దావూద్ పైన దాడి చేసేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసింది.
ప్రేక్షకులుగా తన రౌడీమూకను పెద్దఎత్తున ఛత్రీలు, సీసాలతో స్టేడియంకు పంపి వాటిని విసిరి ఒక రభస సృష్టించి.. ఆ గొడవలోనే దావూద్ ను మర్డర్ చేయాలనే ప్లాన్ గీసింది. గ్యాంగులో కొందరు దావూద్ అనుచరులపై ఫోకస్ చేస్తే.. మరికొందరు కేవలం దావూదే టార్గెట్ గా దాడి చేయాలనేది ప్లాన్.
కానీ, బెడిసికొట్టిన హత్యాపథకం!
ఇండియా-పాక్ మ్యాచ్ అంటేనే లొల్లి. అలాంటిచోట ఒకవేళ గనుక షార్జాలో సప్న వేసిన ఎత్తుగడే ఫలించి ఉంటే.. గెల్చిన జట్టు వేడుక చేసుకోవాల్సిన వేదిక కాస్తా అల్లకల్లోలంగా మారి ఉండేదేమో! కానీ, ఎవరు లీక్ ఇచ్చారో తెలీదు. సప్నాదీది ప్లాన్ మొత్తం బట్టబయలైంది. దాంతో విషయాన్ని ముందే పసిగట్టిన దావూద్ అండ్ గ్యాంగ్ తప్పించుకుంది. ఇక సప్నా దీదిని మట్టుబెట్టడమే లక్ష్యంగా దావూద్ డీ కంపెనీ పనిచేసింది.
షార్జా కప్ జరిగిన నాల్గేళ్ల తర్వాత అంటే 1994లో ఒకరోజు దావూద్ గూండాలు ముంబైలో సప్నను వెంటాడారు. వేటాడి కత్తులతో 22 సార్లు పొడిచి అతి కిరాతకంగా నరికి చంపేశారు. ఆమె సాయం కోసం ఏడుస్తూ ఇరుగుపొరుగువారిని అడుక్కున్నా లాభం లేకపోయింది.
అప్పటివరకూ సినిమాల్లో మాత్రమే కనిపించే ఆ సీన్ ముంబైలో ఒక భీతావహ దృశ్యాన్ని జనం కళ్లముందుంచింది. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సప్నాదీది కన్నుమూసింది.
భారతదేశాన్నే వణికించి హాట్ టాపిక్ గా మారిన ఓ అండర్ వరల్డ్ డాన్ ను.. ఓ మహిళ గడగడలాడించిన ఈ చరిత్రను విశాల్ భరద్వాజ్ దీపికా పడుకోన్ తో సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ, ఎందుకో ఆ సినిమా వాయిదాలు పడుతూ వచ్చిందేగానీ, పూర్తి కాలేదు…
Share this Article