నో డౌట్… ఏ కోణం నుంచి చూసినా ఆదిపురుష్ సినిమా అట్టర్ ఫ్లాప్… 200 కోట్ల దాకా నష్టం, వెకిలి డైలాగులపై సుప్రీం దాకా వెళ్లిన కేసు, అలహాబాద్ హైకోర్టు తిట్లు గట్రా వార్తల నడుమ బాగా చిరాకుపుట్టించినవి దర్శకుడు, రచయితల తలతిక్క వివరణలు, సమాధానాలు, పెడసరం మాటలు… వీటన్నింటి నడుమ ఓ వార్త ఆకర్షించింది… ఆదిపురుష్ సినిమాను జాతి ఛీత్కరించిన వేళ దూరదర్శన్ తన పాత రామాయణం సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేయడానికి నిర్ణయం తీసుకుందట…
దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం సీరియల్ గురించి ఎవరికీ వేరే పరిచయం అక్కర్లేదు… అప్పట్లో సూపర్ హిట్ సీరియల్… తరువాత మూడు దశాబ్దాలకు కరోనా లాక్‌డౌన్ల పిరియడ్‌లో దూరదర్శన్ పునఃప్రసారం చేసింది… జనానికి వేరే వినోదం లేదు, ఇంటి నుంచి కదిలేది లేదు, పైగా అందరిలోనూ కరోనా భయం, దేవుడంటే భక్తి పెరిగింది, ఆ నేపథ్యంలో రామాయణం కోసం జనం దూరదర్శన్ చూశారు… తొలిసారి 55 దేశాల్లో ప్రసారమైన ఈ సీరియల్ 65 కోట్ల వ్యూయర్‌షిప్ సాధించింది… 2020లో కొన్ని వారాలపాటు టీవీ రేటింగుల్లో టాప్ వన్ సీరియల్… అన్ని రికార్డులను బ్రేక్ చేసింది…
ఐతే ఆ నేపథ్యం వేరు… అప్పుడు జనం మూడ్ వేరు… నిజానికి స్టార్ ప్లస్, సోనీ కూడా దీన్ని ప్రసారం చేసినా సరే, అవి ప్రైవేట్ ఎంటర్‌టెయిన్‌మెంట్, కమర్షియల్ టీవీలే అయినా… దేశంలో విపరీతమైన రీచ్ ఉండి కూడా పెద్దగా రేటింగ్స్ సాధించలేదు… మళ్లీ ఇన్నాళ్లకు ఎందుకు ప్రసారం చేస్తున్నట్టు అనేది ప్రశ్న కదా… ఎస్, ఆదిపురుష్ సినిమా మీద విమర్శల మాటెలా ఉన్నా… దేశం మొత్తం దృష్టి మళ్లీ రామాయణం మీద పడింది… బహుళ చర్చల్లోకి వచ్చింది…
Ads
రామాయణంలో నటించిన దాదాపు ప్రతి ప్రముఖ నటుడు, నటి ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాను తిట్టిపోశారు… అసలు రామాయణం అంటే ఇదిరా అని మొత్తం ఇండస్ట్రీకి, దేశానికి చూపించడానికి రామాయణం టీవీ సీరియల్ మళ్లీ ప్రసారం చేస్తారట… పునఃప్రసారం తప్పులేదు… కానీ ఏదో ఓ దరిద్రగొట్టు సినిమాను జనం ఛీత్కరిస్తున్నవేళ… మాదే అసలు రామాయణం అన్నట్టుగా ప్రసారం చేయాలనుకోవడం ఏమిటో డీడీ అధికారులే చెప్పాలి… అసలు ఆ సినిమాతో పోలిక ఏమిటి..? ఎందుకు…?
ఇదేమో మూడు గంటల సినిమా… అందులోనూ కేవలం యుద్ధకాండ… టీవీ సీరియల్ 78 ఎపిసోడ్లు… దానికీ దీనికీ పోలికే లేదు… ఒక్క కథ తప్ప… ఆ కథనూ ఆదిపురుష్ దర్శకుడు, రచయిత ఇష్టారాజ్యంగా భ్రష్టుపట్టించారు… పైగా ప్రసారమైన ప్రతిసారీ ఆ పాత వ్యూయర్‌షిప్ వస్తుందని అనుకోవడం కూడా తప్పే… ఇంకానయం, ఈ సీరియల్ పునఃప్రసారం నిర్ణయం కూడా బీజేపీ ఎజెండా వ్యాప్తి కోసమేననే విమర్శలు మొదలుకాలేదు…!! మొదలైతే డీడీ అధికారులకు హేపీ… ‘పెద్దల’ మెప్పు లభించును కదా…!!
Share this Article