.
బంజారాహిల్స్ హాస్పిటల్ నుండి నేను ఉండే మధురానగర్ దూరమేం కాదు. కానీ, కొన్ని యోజనాల దూరం ప్రయాణం చేసినంత అలసటగా ఉంది. నేను నా కారు స్టార్ట్ చేసాను కానీ, ఎక్కువ దూరం నడప లేక, కారు రోడ్డు పక్కకు ఆపి రెండు చేతులతో కణతలు నొక్కుకున్నాను. తల పగిలిపోతుందేమోనన్నంతగా పోటు వస్తుంది. దానికి తోడు గుండెల్లో ఉప్పొంగుతున్న దుఃఖం కళ్ళ గుండా బయటకు దుముకుతుంది.
ఆ వార్త విన్నప్పటి నుండి నా ఒంట్లో నుండి పొగలు చెలరేగుతున్నాయి.
‘నిజంగా ఇట్లా జరుగుతుందా? మనుషులు ఇంత మెకానికల్ గా, అయిన వారి పట్ల ఇంత నిర్లిప్తంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించగలుగుతారా?’ మనసు ఆలోచనలతో రగిలిపోసాగింది.
Ads
+++
ఒక ప్రొడ్యూసర్ కెమెరాల కోసం వస్తానంటే ఎదురు చూస్తూ ఆఫీసులో కూర్చున్నాను. సినిమా షూటింగులకు కెమెరాలు అద్దెకు ఇవ్వడం మా బిజినెస్.
‘షూటింగ్ జరపడానికి సినిమా నిర్మాతల దగ్గర కెమెరాలు ఉండవు. వాళ్ళు బయట – నాలాంటి వారి – దగ్గర రోజువారీ అద్దెకు తీసుకుని షూటింగు జరుపుకుంటారు. కానీ, ఈ విషయం సామాన్య ప్రజలకు తెలియదు.
సినిమా నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. సినిమా నిర్మాణంలోని 24 క్రాఫ్టులలో ప్రతీ క్రాఫ్టూ రోజురోజుకీ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కెమెరా ఫీల్డులో నెలకో కొత్త కెమెరా సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల అవుతుంది. అందుకే, అంతకు ముందు మనం కలలో కూడా ఊహించలేని అద్భుత సుందర దృశ్యాలు ఇప్పుడు వెండి తెర మీద ఆవిష్కృతమవుతున్నాయి.
ఈ కెమెరాలను జర్మనీ, అమెరికా, సింగపూరుల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి తెలియనిదేమంటే, ఒక్కో కెమెరా విలువ యాక్సెసరీస్ తో కలిపి కోటి రూపాయల పైనే ఉంటుంది. ఈ కెమెరాలకు వాడే అల్ట్రా ప్రైమ్, మాస్టర్ ప్రైమ్ లెన్సుల విలువ కూడా యాభై అరవై లక్షల పైనే ఉంటుంది.
వీటికి తోడు, మానిటర్లూ, ఫిల్టర్లూ, కేబుల్స్, లాప్ టాపులూ వంటి అనేక పరికరాలు ఈనాటి అత్యాధునిక సినిమా షూటింగుకు అవసరమవుతాయి. కెమెరా విభాగం ఇప్పుడొక ప్రత్యేక సబ్జెక్టుగా రూపుదిద్దుకుంది. కొందరు నిర్మాతలకు ఈ కెమెరాల సాంకేతిక పరిఙ్ఞానం ఉండదు. వాటి మెయింటెనెన్స్ కు సంబంధించిన అవగాహన కూడా ఉండదు.
అందుకే వాళ్ళు బయట నుండి కెమెరాలను అద్దెకు తీసుకుంటారు. ప్రతీ కెమెరా వెంబడి మా తరఫున నలుగురైదరు కెమెరా అసిస్టెంట్లు షూటింగులకు వెళతారు. కెమెరా యోగక్షేమాలు చూడడం, లెన్సులు మార్చడం, కెమెరాను మోసుకెళ్ళడం వంటి పనులు చేస్తారు.
వాళ్ళకు యూనియన్ నిర్ణయించిన ప్రకారం బేటాలు ఉంటాయి. అన్నీ కలిపి, కెమెరా రేంజ్ బట్టి, లైట్లు, లెన్సులను బట్టి కెమెరా అద్దె రోజుకు అరవై డెబ్భై వేలు ఉంటుంది. ఇది కెమెరామెన్ కు నిర్మాత చెల్లించవలసిన రెమ్యునరేషన్ కు అదనం. అలాగే, కేవలం రోజుకు రెండు మూడు వేలకు దొరికే కెమెరాలు కూడా ఉంటాయి. అందుకే, మా లాంటి వాళ్ళు ఈ బిజినెసులోకి దిగాల్సి వచ్చింది.
కాబట్టే ఒక కొత్త సినిమా మొదలవుతుందనగానే, ఆ కెమెరా కాంట్రాక్ట్ సంపాదించడానికి కెమెరా ఓనర్లు ఎవరి ప్రయత్నం వారు చేస్తుంటారు. ఒక సినిమాకు అగ్రిమెంట్ అయిపోతే మాకు యాభై అరవై లక్షల ఆదాయం ఎటూపోదు. కెమెరాలను షూటింగులకు అద్దెలకు తిప్పకుండా, ఇంట్లో ఉంచుకుంటే డెడ్ ఇన్వెస్ట్ మెంట్. ఆదాయం లేకపోగా కెమెరా అసిస్టెంట్లకు జీతాల భారం కూడా మన మీద పడుతుంది.
అందుకే, నేను కూడా మార్కెట్లో బాగా తిరుగుతుంటాను. కెమెరామెన్లూ, ప్రొడక్షన్ మేనేజర్లతో సత్సంబంధాలు పెట్టుకుంటాను. క్రమం తప్పకుండా వాళ్ళకు పార్టీలూ, గిఫ్టులూ ఇస్తూ వారి గుడ్ లుక్స్ లో ఉంటాను కాబట్టి వారు నిర్మాతలకు నా పేరు రికమెండ్ చేస్తుంటారు.
ఆ క్రమంలోనే, నాకు తెలిసిన మేనేజర్, ఒక కొత్త నిర్మాతను పట్టుకొస్తున్నానని చెప్పడంతో ఆఫీసులో వెయిట్ చేస్తున్నాను.
నిర్మాత మా ఆఫీసుకు వస్తున్నాడనగానే మా వాళ్ళు హాల్లో ట్రైపాడ్ స్టాండుల మీద కొత్తగా వచ్చిన కెమెరాలను మౌంట్ చేసి అంటే అమర్చి, షూటింగ్ మోడ్ లో ఉంచుతారు. ఆ హాలును దాటిన తర్వాతనే నా రూములోకి రావలసి ఉంటుంది. ఆ కాస్త సమయంలో కెమెరాలను నిర్మాత అబ్బురంగా చూస్తూ ఉండిపోవాలని మా ఆలోచన.
కాసేపటికి నిర్మాతతో పాటూ కెమెరామెన్, మేనేజర్ కూడా వచ్చారు. అతని పేరు నాయుడు అని పరిచయం చేసారు. నేను నా విజిటింగ్ కార్డు ఇచ్చాను. అతను సినిమా రంగానికి కొత్తవాడని ఐదు నిముషాల్లోనే నాకర్థమయ్యింది.
రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ఇబ్బడిముబ్బడిగా సంపాదించినట్టుగా అతను చెప్పిన హౌజింగ్ వెంచర్ల గురించి చెప్తే నాకర్థమయ్యింది. లెక్కలేనంత డబ్బు సంపాదించిన వారి నెక్స్ట్ గోల్ సినిమా రంగమే కాబట్టి కెమెరామెన్, మేనేజరు కలిసి అతన్ని ముగ్గులోకి దింపాలని ప్రయత్నిస్తున్నారని కూడా అర్థమయింది. నేను ఎంత వ్యాపారవేత్తనే అయినా నిర్మాతను ముంచి డబ్బులు సంపాదించాలని అనుకోను. అందుకే, అన్యమనస్కంగానే, వాళ్ళకు కొటేషన్ ఇచ్చి పంపాను.
ఆ రోజు రాత్రి నాకో ఫోన్ వచ్చింది. నన్ను ఒక ఐదు నక్షత్రాల హోటలుకు రమ్మని నిర్మాత ఫోన్ చేసాడు. నేను వెళ్ళగానే,
“ఇప్పుడు చెప్పండి?” అన్నాడు నవ్వుతూ.
“ఏంటి సార్?” అన్నాను నేను బిత్తరపోయి చూస్తూ.
“కాకమ్మ కబుర్లు చెప్పి మా వాళ్ళు నన్ను సినిమా ముగ్గులోకి దించుతున్నారు. ఇదే కదా మీ ఆలోచన?” అన్నాడు గ్లాసులోని విస్కీ సిప్ చేస్తూ. నేను రెండు నిముషాలు ఆలోచించి,
“ఔను నాయుడు గారూ! మీకు సినిమా రంగంలో అనుభవం లేదు. అందుకే, మొదటి సారే ఇంత పెద్ద బడ్జెటుతో ప్లాన్ చేస్తున్నారని నాకు అనుమానమొచ్చింది. ఇంకా హీరో హీరోయిన్లే కన్ఫర్మ్ కాలేదు. కథ, పాటలు ఫైనలైజ్ కాలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులేవీ మొదలే పెట్టలేదు. అప్పుడే షూటింగు కోసం కెమెరాలు కావాలని రావడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ, అడగందే సలహా ఇవ్వొద్దని నేను ఈ రంగంలో నేర్చుకున్న మొదటి పాఠం. అందుకే పొద్దున మౌనంగా ఉన్నాను. కానీ, నా మనసులో ఇటువంటి ఆలోచన ఉందని మీరెలా కనిపెట్టగలిగారు?” అని ప్రశ్నించాను.
“రెడ్డి గారూ! నేను సినిమా ఫీల్డులో లేకపోయినా, వ్యాపారం ఎలా చేయాలో, వ్యవహారం ఎలా నడపాలో క్షుణ్ణంగా తెలిసిన వాణ్ణి. మీరు పొద్దున్న మేం వచ్చినప్పుడు ఉన్నంత హుషారుగా తర్వాత లేరు, ఎందుకో ఇబ్బందిగా ఫీలయ్యారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు అత్యుత్సాహం చూపుతున్నా మీరు ఏదో చెప్పాలనుకుని చెప్పలేక తటపటాయించడం నేను గమనించాను. అందుకే, అసలు విషయం తెలుసుకుందామని ఇక్కడికి పిలిచాను. ప్లీజ్ తీసుకోండి!” అంటూ విస్కీ అందించాడు.
నాకు సంతోషం కలిగింది. నాయుడు గారు నేననుకున్నంత అమాయకుడు కాదు. అటువంటి వాళ్ళతో వ్యవహారం నెరిపితే, నాకైతే, ఎదుటి వారిని మోసం చేస్తున్నామన్న గిల్టీ కాన్షియస్ నెస్ ఉండదు.
“మీ ఆలోచన సరైందే సార్? ఎందుకో వాళ్ళు చాలా ఆతృతలో ఉన్నట్టు అనిపించింది. సినిమా తీయాలనుకోవడం అనే నిర్ణయం సులభమే కానీ, అందుకు చాలా తతంగం ఉంటుంది. బ్యానర్, సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించాలి. ఎఫ్‌డీసీలో పర్మిషన్ తీసుకోవాలి. ఆఫీసు, స్టాఫ్ వంటి చాలా పనులుంటాయి. వీటన్నింటికీ కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది. అవేవీ లేకుండానే కెమెరాలు కావాలని రావడం నాకు ఆశ్చర్యమేసింది. నిర్మాత కలకాలం సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని సార్ నేను! ఏదో దొంగ మాటలు చెప్పి రెండు రూపాయలు సంపాదించడం నా పద్ధతికి విరుద్ధం సార్! ఇప్పటి వరకు డబ్బులు ఏమైనా ఇచ్చారా?” అని అడిగాను.
“ఎక్కవ ఏం ఇవ్వలేదు. రెండు మూడు లక్షలు ఖర్చయ్యాయి. అంతే!” అన్నాడు.
ఆ రోజు నుంచి నాయుడుగారూ నేను మంచి దోస్తులమయ్యాము. నాయుడు గారు సినిమా తీసారు కానీ, పాత బ్యాచ్ తో కాదు. వాళ్ళు నలభై కోట్లు ఖర్చవుతుందని చెబితే నేను వేరే టీమును మాట్లాడి ఒక మీడియం రేంజ్ సినిమాను పది కోట్లలో పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసాను. అది ఒక మోస్తరు హిట్ అయింది కూడా. అయితే, నేనెక్కడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాలేదు. నా కెమెరాలు కూడా నేను ఇవ్వనన్నాను. దాంతో నాయుడి గారికి నా మీద గురి కుదిరింది. స్నేహం పెరిగింది.
నాయుడు గారు తరువాత సినిమాలు తీయలేదు. ఏదో, ఇంట్లో వాళ్ళ తృప్తి కోసం, ఓ సినిమా తీసి పడేసారు. కానీ, నాతో స్నేహం మాత్రం మానలేదు.
ఆయన చాలా బిజీ. నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులతో హైదరాబాదు నగరంలో రియల్ ఎస్టేట్ శరవేగంగా పుంజుకుంది. విల్లాలు, డూప్లెక్స్ భవంతులు, అపార్టుమెంట్ల సంస్కృతి బాగా పెరగడంతో నాయుడు గారు ఆ పనుల్లో తలమునకలుగా ఉండేవారు.
రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అంత స్మూత్ గా సున్నితంగా పరిష్కారం కావు. వాటికి అంగబలం, అర్థబలంతో పాటు రాజకీయ నాయకుల, పోలీసుల సహాయ సహకారాలు కూడా అవసరం. మనం న్యాయంగా ఉన్నా, అవతలి వారు, పోటీదారులు పన్నే ఎత్తుగడలను తట్టుకోవాలంటే ఆ మాత్రం పటాటోపం ఉండాల్సిందే.
అందుకే నాయుడు గారు అడుగు తీసి అడుగేస్తే ఆయన చుట్టూ అంగరక్షకులూ, బౌన్సర్లూ తెల్ల చొక్కా మాటున కదిలేవారు. ఎవరైనా చూస్తే వాళ్ళంతా ఏదో రాజకీయ పార్టీ కార్యకర్తల్లా ఉండేవారు.
ఆయనకు నాలో ఏం నచ్చిందో గానీ నాకు రోజూ ఫోన్ చేసేవాడు. నాకు తెలియని స్థలాల విషయంలో నా సలహాలు అడిగేవాడు. నేను, “నాకేం తెలుసు సార్?” అంటే..,
“మీకు తెలియదని నాకు తెలుసు రెడ్డి గారూ! కానీ మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేసా! బాగున్నారా? చేతి మీద సినిమాలున్నాయా? ఏమైనా పని ఉంటే చెప్పండి! సీయంతోనైనా సరే చెప్పి చేయిస్తా!” అని నవ్వేవాడు.
“అంత పెద్ద పనులు నాకేం ఉంటాయి సార్?” అనడంతో ‘సరే, సరే’ అంటూ సంభాషణ ముగించేవాడు.
ఆయన వ్యవహారంలో ఎంత ఘనుడైనా, సుకుమార హృదయం కలవాడు. సమాజంలో జరిగే ప్రతీ చిన్న అన్యాయానికి చలించి పోయేవాడు. భార్య భుజం మీద తలాన్చి కన్నీరు కార్చేవాడు. నాతో ఆ విషయాలన్నీ పంచుకునేవాడు. పిల్లలిద్దరితోనూ, భార్యతోనూ వీలైనప్పుడల్లా సంతోషంగా గడిపేవాడు.
అట్లాంటిది నాకు ఒక రోజు ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.
“బాగున్నా….. ” అని అడగబోతుండగానే, ఫోనులో ఆయన భార్య ఏడుపు వినిపించింది. నా గుండె గతుక్కుమంది. వణుకుతూ,
“ఏమైందండీ?” అని అడిగాను.
“నాయుడు గారు హాస్పిటల్లో ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది!” అని చెప్పడంతో నేను నిర్ఘాంతపోయాను.
వెంటనే నాయుడిగారిని చూడడానికి బయల్దేరాను. కానీ, పాత విషయాలన్నీ గుర్తుకొచ్చాయి.
తర్వాత హాస్పిటలుకు వెళ్ళినప్పుడు, ఏదో ల్యాండ్ స్కాం జరగడంతో మెదడులో నరాలు చిట్లి, కోమాలోకి వెళ్ళాడనీ, ఆపరేషన్ చేసినా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మాత్రమే అని చెప్పారని అనడంతో విషాద సాగరంలో లంగరు వేసినట్టుగా నా మనసు కృంగిపోయింది.
+++
వారం రోజుల తర్వాత నాయుడి గారిని పరామర్శించడానికి వెళ్ళాను. అనుకున్నట్టుగానే నాయుడి గారికి చేసిన శస్త్రచికిత్స ఫెయిలయిందనీ, వెంటిలేటర్ మీద ఉంచారని చెప్పారు. వెంటిలేటర్ తీస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారట.
నా మనసు చేదు మాత్ర తిన్నట్టుగా అయింది. నవ్వుతూ, కులాసాగా, దర్జాగా ఉన్న నాయుడి గారి ముఖమే కళ్ళ ముందు మెదిలింది.
నాకు నాయుడు గారూ ఆయన భార్య తప్పా అక్కడ ఎవరూ తెలియదు. నాయుడు గారి భార్య ఎక్కడో లోపల ఉంది. అయినా నాకు అక్కడి నుంచి వెళ్ళాలని అనిపించలేదు. నిస్తేజంగా ఆ స్పెషల్ రూం ముందే కూలబడిపోయాను. ఆ స్పెషల్ రూం ముందర చాలా మంది హడావుడిగా తిరుగుతున్నారు. బహుశా వాళ్ళంతా నాయుడు గారి బంధువులయి ఉండవచ్చు.
ఐదు నిముషాల తర్వాత ఒక జ్యోతిష్య సిద్ధాంతి లోపలికి వెళ్ళడం గమనించి కొంచెం ఆశ్చర్యపోయాను. ఓ గంట తర్వాత ఆ సిద్ధాంతి నోట్ల కట్ట జేబులో దోపుకుంటూ బయటకు వచ్చాడు.
ఆయనతో పాటూ ఒక పెద్దాయన కూడా బయటకు వచ్చి సిద్ధాంతికి నమస్కారం పెట్టి, సాగనంపి,
‘హుష్.. అబ్బబ్బ… ‘ అనుకుంటూ నా పక్క కుర్చీలో కూలబడ్డాడు. రెండు నిముషాల తర్వాత తేరుకుని, నన్ను చూసి,
“మీరూ….?” అంటూ అనుమానంగా చూసాడు.
నేను విచారంగా,
“నేను నాయుడి గారి ఫ్రెండునండీ! నాయుడి గారి మిస్సెస్ లేరా? ఇప్పుడు నాయుడి గారికి ఎలా ఉంది?” అని ఆతృతగా అడిగాను.
“ఇంకెక్కడి నాయుడు గారండీ? బ్రెయిన్ డెడ్ అయి వెంటిలేటర్ మీద ఉన్నాడు. మంచి ముహుర్తం చూసి వెంటిలేటర్ తీసేయడమే!” అన్నాడు.
నేను విస్తుపోయి,
“అంటే నాయుడు గారిని ముహుర్తం చూసి చంపేస్తారా?” అని గద్దించాను. ఆయన కొంచెం కంగారు పడుతూ,
“మేం చంపేయడమేమిటండీ? ఆయనే కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నాడు. అలా ఎన్ని రోజులు ఉంచుతామండీ? రేపటి తర్వాత నెలరోజుల వరకు మంచి రోజులు లేవు. అందుకే, ఈ రాత్రికే సిద్ధాంతి ముహుర్తం పెట్టాడు. ఆ ముహుర్తానికి వెంటిలేటర్ తీసేస్తే, మరణించిన తర్వాత సద్గతులు ప్రాప్తిస్తాయి. ఇంతకు మీ పేరేమిటన్నారు? నాయుడి గారి భార్యను పిలుస్తాను!” అంటూ లేచి నిలబడ్డాడు.
నేను తల అడ్డంగా ఊపుతూ, లేచి నిలబడి మౌనంగా అక్కడి నుంచి బయటకు నడిచాను.
లోపల మంచం మీద వెంటిలేటర్ మీద ఉన్న నాయుడిగారిని దూరం నుండే చూస్తూ బయటకు నడిచాను.
‘మనం ఎంతో అభివృద్ధి సాధించాము. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి చెందాను. కానీ, ఇదేమిటి? చావుకు ముహుర్తం పెట్టుకోవడమా? ముహుర్తం పెట్టుకుని చావును ఆహ్వానించడమా? అట్లా చేస్తే సద్గతులు ప్రాప్తిస్తాయా? ఒకవేళ నిజంగానే అటువంటి సద్గతులే ఉన్నాయనుకుంటే కృత్రిమ ముహుర్తపు మరణం వల్ల అవి లభిస్తాయా?
మూఢాచారాలు ఎంత వరకు వెళ్ళాయంటే గ్రహబలం చెప్పే సిద్ధాంతులు ఆ రోజు వర్జ్యం, రాహుకాలంతో పాటూ, సిజేరియన్ ఆపరేషన్ల జననాలకు కూడా ముహుర్తాలు ఫేస్బుక్కులో పోస్ట్ చేస్తున్నారు.
నేను చూసిన ఓ తమిళ సినిమాలో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్లోనే ఒక జ్యోతిష్య సిద్ధాంతి ఉండి డెలివరీకి వచ్చిన వాళ్ళకు ముహుర్తాలు పెడుతుంటాడు. ఆ పర్టిక్యులర్ సుముహుర్తంలో పుట్టిన పిల్లలు శుభయోగంతో ఐఏఎస్ ఆఫీసర్లు, సినిమా స్టార్లు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు అవుతారని చెబుతుంటాడు.
కానీ, నిజానికి అలా పెట్టుడు ముహుర్తాన పుట్టిన వాళ్ళంతా శుంఠలూ, రౌడీస్, స్మగ్లర్లూ, హంతకులుగా తయారవుతారు.
స్వాభావికంగా ప్రసవం జరిగినప్పుడు మంచి ముహుర్తం ఉంటే, అలా పుట్టిన వాళ్ళు గొప్పవారవుతారని అనుకున్నా – నిజానికి అది కూడా కరెక్టు కాదు – అందులో కొంత అర్థం ఉంది. పిల్లలను పెంచేటప్పుడు వాళ్ళకు నేర్పే విద్యాబుద్ధులు, సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఏదైనా సాధిస్తారు గానీ, సిజేరియన్ ముహుర్తంలో కన్నంత మాత్రాన అది సాధ్యమా? అలా అయితే స్మగ్లర్లు, హంతకులు, రాజకీయ నాయకులకు పుట్టే పిల్లలంతా గొప్పవాళ్ళు అవుతారు. మరి పేదల సంగతి ఏమిటి?
నాకైతే ఇదంతా జగన్నాటకసూత్రధారి అయిన ఆ పరమాత్ముడి సృష్టినే వెక్కిరించినట్టుగా, దేవుడితోనే గేమ్స్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది.
కానీ, ఇప్పుడు ఇలా మరణానికి కూడా ముహుర్తం పెడతారని మీరెప్పుడైనా అనుకున్నారా? …….. ( రచన – ప్రభాకర్ జైనీ)
Share this Article