Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన ఖర్మ కాకపోతే… బజారు రౌడీలకు పోస్టల్ స్టాంపులేమిట్రా..?

December 29, 2020 by M S R

మన వీధి రౌడీల స్టాంపులు ఎప్పుడొస్తాయో?
————————

వాల్మీకి రామాయణం సుందరకాండ. అశోకవనం. ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి? అని చెట్టు కొమ్మకు తలవాల్చి పడుకుని, పడుకోనట్లు దిగులుగా ఉన్న సీతమ్మ. ఈలోపు తాగిన మత్తులో, ఊగుతూ మందీ మార్బలంతో రావణాసురుడు సీతమ్మ వైపు వస్తున్నాడు. మధ్యలో గొంతు పిడచకట్టుకుపోతే ఇబ్బంది అని బంగారు పాత్రల్లో మద్యం పట్టుకున్న అమ్మాయిలు రావణుడి చుట్టూ ఉన్నారు. రోజూ కనీసం తెల్లవారినతరువాత వచ్చి ఏదో వాగేవాడు. ఈరోజేమిటి పొద్దున్నే నాలుగు గంటలకే ఇలా తూలుతూ వస్తున్నాడు అని సీతమ్మలో ఆందోళన పెరుగుతోంది.

“ఇప్పటికి పది నెలలు వెయిట్ చేశాను. ఇంకో రెండు నెలల గడువిస్తా. మనసు మార్చుకుని అంతః పురంలోకి వచ్చి నా చేయి పట్టుకున్నావా- సరే. లేదంటే మరుసటి రోజు ప్రొద్దున్నే నిన్ను నిలువునా కోసి బ్రేక్ ఫాస్ట్ లో తింటా” అని బెదిరించాడు.

సీతమ్మ ఒక గడ్డిపోచ అడ్డుగా పెట్టి- “ఒక్క అడుగు ముందుకొచ్చినా మర్యాద దక్కదు. నీ కొలువులో మంచి చెప్పేవారే లేరా? చెప్పినా వినవా?”
అని గడ్డి పెడుతుంది.

“నాకు మంచి తెలుసు- చేయను. నాకు చెడు తెలుసు- చేయకుండా ఉండలేను. అది నా స్వభావం” అని చాలా గర్వంగా చెప్పుకుంటాడు రావణుడు. అయితే నీ చావు నువ్ చస్తావ్ అని శపిస్తుంది సీతమ్మ.

ఆనాటి నుండి ఈనాటి వరకు విలన్లు, డాన్ లు, రౌడీలకు తాము చేసేది తప్పని తెలుసు. సేమ్ టు సేమ్ రావణుడిలా వీరందరూ చెడు చేయకుండా ఉండలేరు. మంచి చేయడానికి మనసు రాదు.

రామాయణాన్ని నరనరాన జీర్ణించుకుని ప్రతి చిత్రంలో రామాయణసారాన్ని ప్రతిఫలింపచేసిన బాపు ఒక సినిమాలో రావణుడిచేత స్వగతంలో ఇలా చెప్పిస్తాడు.

“లోకాల్లో రాముడు గుర్తున్నంత కాలం ఈ రావణుడు కూడా గుర్తుంటాడు. రాముడు మంచికయితే- నేను చెడుకు. తేడా అంతే. కానీ నా కీర్తి కూడా శాశ్వతం”

ఇప్పుడు మన సినిమాల్లో విలన్లే హీరోలు. రావణాసురుడే ఆదర్శం. సృజనాత్మక విధ్వంసంలో హీరో ఎన్ని అరాచకాలు చేస్తే అంత గొప్ప. లేదా రోజూ నలుగురిని చంపి చెంబుడు రక్తం తాగితేగానీ బయట కాలుపెట్టని హీరో- ఒకరోజు వీధికుక్కల కాలిగాయానికి మందుపూసే హీరోయిన్ ప్రేమలో పడి అరాచకాలను వదిలి పూలమొక్కలకు నీళ్లు పోసే దిక్కుమాలిన కొలువు చేయాల్సి వస్తుంది. ఈలోపు ఒకరోజు విలన్లు పూల కుండీలు కొనడానికి వచ్చి హీరోను గుర్తు పడితే- మళ్లీ హీరో యథాపూర్వం బోయపాటిలా సొరకాయలు తరిగినట్లు మనుషుల తలలు పరపరా కోయాల్సి వస్తుంది. విలన్ను ఆకాశానికెత్తడంలో రాజమౌళికి రాజమౌళే సాటి.

postal don

విలన్లను భయంతోనో, భక్తితోనో, భయంతో కూడిన భక్తివల్ల పుట్టిన జ్ఞానం వల్లో మనం ఆరాధించడం అనాదిగా ఉన్నదే. దేశంలో పేరుమోసిన అండర్ వరల్డ్ డాన్ ల పోస్టల్ స్టాంపులు కాన్పూర్ లో అందుబాటులో ఉన్నాయి. “మై స్టాంప్” అని ఆ మధ్య పోస్టల్ శాఖ ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది. కొంత మొత్తం నగదు చెల్లించి, మనకిష్టమయిన స్టాంపులు పరిమిత సంఖ్యలో ముద్రించుకోవచ్చు. ఈ స్కీమ్ లో ఎవరో వారికిష్టమయిన, పరమ ఆరాధనీయ అండర్ వరల్డ్ డాన్ స్టాంపులు ముద్రించుకున్నారు.

నిజానికి ఇది స్టాంపుల దగ్గరే ఆగిపోవడం మంచిది కాదు. ఇంకా ఇంకా ముందుకెళ్లాలి. మన వీధి గూండాలకు కూడా ఈ ప్రచార అవకాశమివ్వాలి. పోలీసులు గూండాలకు, రౌడీలకు గుర్తింపు కార్డులివ్వాలి. కార్డున్నవారే గూండాగిరీ చేసేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. గూండాలకు సరిహద్దులు, ఏరియా ఆఫ్ ఆపరేషన్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ గీతలు స్పష్టంగా గీయాలి. అండర్ వరల్డ్ నేరాలు నేర్చుకోవడానికి తగిన సిలబస్ రూపొందించి ఔత్సాహిక విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి!

ఖర్మ కాకపొతే- మై స్టాంప్ స్కీమ్ ఏమిటి?
అండర్ వరల్డ్ డాన్ ల స్టాంపులను సాక్షాత్తు పోస్టల్ శాఖ ముద్రించడమేమిటి?
దేశమా!
తలదించుకో!

  • పమిడికాల్వ మధుసూదన్

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now