.
నా గుండెల్లో దుఃఖపు సముద్రాలు పొంగుతున్నాయి. బస్సు వేగంగా పోతుంది. సన్నని ముసురు కమ్ముకుని ఉంది. మధ్యాహ్నం పూటే చీకటయింది. వాతావరణం కూడా నాతో పాటే విషాదగీతాన్ని ఆలపిస్తున్నట్టుగా ఉంది.
నిజానికి నేను ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నానో నా మనసులో, నాకే స్పష్టమైన అవగాహన లేదు. కానీ, ఈ హైదరాబాదు నగరంలో ఇంకొక్క క్షణం కూడా ఉండలేనన్పించింది. ఊపిరి ఆడనట్టుగా, గుండెకు నెత్తురు సరఫరా కానట్టుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా ఉంది.
Ads
జీవితమంతా ఈ నగరానికే ధారపోసాను. ఎక్కడో పల్లెటూరి నుంచి పొట్ట చేతబట్టుకుని వచ్చి బ్యాంకులో గుమాస్తా ఉద్యోగంలో చేరి, జీవిత సోపానంలో పైపైకి ఎదగాలనే ఆశతో అనేక ఉద్యోగాలు మారి, నా జీవిత లక్ష్యాన్ని సాధించాను.
సంఘంలో అతి పెద్ద హోదా, అంతస్థు, నన్ను చూస్తేనే చాలు గజగజ వణికే స్టాఫూ, అడుగులకు మడుగులొత్తే క్లయింట్లు, నా చల్లని చూపు తమ మీద పడితే చాలనుకునే మిత్ర బృందం – ఇవన్నీ చూసి, నేను మనసులోనే గర్వపడే వాడిని. నా అంతస్థు పెరిగిన కొద్దీ, మా చుట్టాలూపక్కాలూ, స్నేహితులూ వాళ్ళంతట వాళ్ళే దూరంగా జరిగారు. నేను పెద్దగా పట్టించుకోలేదు.
భౌతికంగా నా వైభోగం పెరుగుతున్నా, నా మనసులో ఒక విధమైన లుప్త భావన పేరుకోసాగింది. నా చుట్టూ ఆవరించి ఉన్న మనుషులూ, పదవీ, మిథ్యా గౌరవాలూ – ఇవన్నీ నిజం కాదనే భావన బలపడసాగింది. నేను వారివారి అవసరాలను తీర్చేంత వరకే నాకీ అతిథి మర్యాదలూ, పట్టు పరుపుల మీద నడకలూ, వంగి వంగి దండాలు పెట్టడాలూ, ముఖాలకు తగిలించుకున్న ప్లాస్టిక్ నవ్వులూ ఉంటాయనే భయం నాలో గూడు కట్టుకోసాగింది.
నా పదవి పోగానే, నా ఒక్క ఆకుపచ్చ రంగు సంతకంతో కోట్లు గడించిన వారు కూడా కనీసం పలకరించరేమోననే భయం నన్ను వెంటాడసాగింది.
నా భార్యాపిల్లలు కూడా నేను వారికి సౌఖ్యవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని అందించినంత కాలమే నా మీద ప్రేమానురాగాలు కురిపిస్తారేమోనన్న సంశయం నన్ను పీడించసాగింది.
నాకెందుకో బ్రతుకు భయంభయంగా మారింది.
ఇంతలో, మా అపార్టుమెంటులోనే, మా ఎదురు ఫ్లాటులో నివసిస్తున్న ఛటర్జీ అనే చిరకాల పరిచయస్తుడు, ఆ రోజు అర్థరాత్రి రెండు గంటల సమయంలో గుండె పోటుతో మరణించాడని, తెల్లవారాక తెలిసింది. ఆయన భార్య, భర్త శవం పక్కన ఒంటరిగా రాత్రంతా కూర్చుందని తెలిసి, నా గుండె కింది కండ కలుక్కుమంది. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే గుండె జలదరించింది.
నిజానికి ఆ రాత్రి ఛటర్జీ మరణవార్త తెలిసినా ఎవరూ చేయగలిగిందేమీ లేదు. అదే సమయానికి రాత్రి షిఫ్ట్ ముగించుకుని వచ్చి అన్నం తింటున్న పక్కింటి యువ జంట కూడా, అన్నం తినడం మాని ఉండలేరు. అరవై ఫ్లాట్లున్న మా అపార్టుమెంటులో ఎవరికి వారే యమునా తీరే. నగరంలో బ్రతుకే ఇట్లా ఉంది.
మరునాడు ఉదయాన్నే వాచ్ మెన్ వచ్చి చెప్పే వరకు, తమ పొరుగునే ఉన్న ఒక వ్యక్తి మరణించాడన్న సమాచారమే తెలియదు. ఛటర్జీ పిల్లలు అమెరికాలో ఉన్నారు. బంధువులంతా కలకత్తా వైపు ఎక్కడెక్కడో ఉన్నారు. అపార్టుమెంటు కాబట్టి శవాన్ని ఆ రాత్రి లోపల దహనం చేసేయాలి.
అపార్టుమెంటులో ఛటర్జీకి తెలిసిన వాళ్ళు వచ్చి, చూసి, పరుగుపరుగున వెళ్ళిపోయి, స్నానాలు చేసేసి, తమ దైనందిన కార్యక్రమాల్లో పడిపోయారు.
ఆ ఫ్లోరులోనే ఒక వ్యక్తి మరణించడానికి సంకేతమన్నట్టుగా, మా ఫ్లోరులో నీరవ నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఛటర్జీ భార్య మాత్రం భీతిల్లిపోయి, స్తబ్దుగా కూర్చుండి పోయింది. బిల్డింగ్ మెయింటెనెన్స్ చూసే వాళ్ళే దహనానికి ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందిరా పార్కుకు ఎదురుగా ఉన్న రామకృష్ణ మఠం పక్కనే బెంగాలీ సమితి ఉంది. బహుశా వాళ్ళ సహాయం తీసుకుంటున్నట్టుగా ఉంది.
నాకా రోజు అర్జెంటుగా క్లియర్ చేయవలసిన ఫైలు ఒకటి ఉంది. అందుకే, నేను స్నానం చేసి రాగానే, మా ఆవిడా నేనూ పిల్లలూ ఫలహారం చేసి, నా భార్య బ్యాంకు ఉద్యోగానికి, పిల్లలు ఉద్యోగాలకు, యూనివర్సిటీలకు, నేను ఆఫీసుకు బయల్దేరాము.
ఛటర్జీ శవాన్ని కింద సెల్లార్ లో పడుకోబెట్టారు. పక్కనే సెక్యూరిటీ గార్డు నిలబడి ఉన్నాడు. అంతే మరెవ్వరూ లేరు.
నేనూ ఛటర్జీ వేపు చూడకుండా తప్పించుకుని బయటకు నడిచాను. ఉదయాన్నే మా కార్లన్నీ అపార్టుమెంట్ బయట పెట్టించారు. కానీ, ఛటర్జీ శవయాత్రకు ఎవ్వరూ లేకపోవడంతో సెల్లార్ అంతా బోసిపోయినట్టుగా ఉంది. పైన వాళ్ళ ఫ్లాటులో ఛటర్జీ భార్య జీవచ్ఛవంలా, క్రింద సెల్లార్ లో ఛటర్జీ మరణించి నిర్జీవంగా పడి ఉన్నారు.
మనసంతా బాధగా ఉంది.
నిన్న రాత్రి, ఆఫీసు నుండి నేనొస్తుంటే, ఛటర్జీ వాకింగ్ చేస్తూ కనిపించాడు. ఈ రోజు లేడు. ఇప్పుడు నిర్జీవంగా, ఒంటరిగా, సెల్లారులో అనాథలా పడి ఉన్నాడు. వాళ్ళ అమ్మే గనుక ఇక్కడ ఉండి ఉంటే, ఈ పాటికి ఆమె గుండెలు పగిలేలా రోదిస్తూ ఉండేది. అన్నదమ్ములూ, అక్కాచెల్లెళ్ళూ గుండెలు బాదుకునేవారు. తనవారంటూ ఎవరూ లేక, ఉన్న ఒక్క తనవాడు అంతులేని దూరాలకు ఎగిరిపోయాక, ఏం చేయాలో తోచక, నిశ్చేష్టురాలై, ఛటర్జీ భార్య కూడా ఏడవడం లేదనిపించింది.
ఆఫీసుకు కారు బయల్దేరింది. రోజూ ఉదయం పది గంటల లోపు మా అపార్టుమెంటు దాదాపు ఖాళీ అవుతుంది. పెద్దలు ఆఫీసులకు, పిల్లలు చదువులకు ఉరుకుల పరుగుల మీద వెళ్తారు. ఇది నగర జీవితం. ఉరుకులు పరుగులు తప్పవు. ఈ రోజు కూడా దాదాపు అంతే. కానీ, ఈ రోజు ఒక్క ఛటర్జీయే ఆఫీసుకు వెళ్ళడం లేదు.
కారులో ముందుకు పయనిస్తున్నా, నా మనసు అనేక సంవత్సరాల క్రితం వరకు వెళ్ళి, ఒక చోట ఆగింది. ఆ రోజు క్లాసులో ఉన్న నన్ను హెడ్మాస్టారు పిలిపించి, బంట్రోతుతో మా ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. జనగామలో ఉన్న మా తాతయ్య చనిపోయాడని కబురు రావడంతో, మేము ఒంటి మీద బట్టలతోనే ఊరికి పరిగెత్తాము.
ఆ ఊళ్ళో మా తాతయ్య వాళ్ళది చిన్న కిరాణా షాపు. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. మా తాతయ్యకు ఆస్త్మా వ్యాధి ఉండేది. దాంతో ఆయనకు రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. తెల్లవారుఝామున్నే లేచి భక్తి గీతాలు పాడేవాడు. భజనలు చేసేవాడు. అపర శివభక్తుడు కాబట్టి అందరూ ఆయనను గౌరవించేవారు.
మేం వెళ్ళే సరికి ఆ మెయిన్ రోడ్డంతా జనంతో క్రిక్కిరిసి పోయి ఉంది. ఊళ్ళోని బంధువులు, మితృలు, చుట్టుపక్కల ఊళ్ళ నుండి వచ్చి మా కిరాణా షాపులో సామాను కొనుక్కునే వాళ్ళంతా అక్కడ చేరి,
“రాజయ్యా! రాజన్నా!” అంటూ మా తాతయ్య పేరు పలుకుతూ శోకాలు పెడుతున్నారు.
వాళ్ళను తప్పించుకుని మేము లోపలికి వెళ్ళగానే, మా అమ్మ తాతయ్య మీద పడి భోరున ఏడ్చింది. తాతయ్యకు మా అమ్మంటే చాలా ఇష్టం. నేనంటే పంచ ప్రాణాలే. గోడకు ఆనించి కూర్చోబెట్టిన తాతయ్య శవాన్ని చూసేసరికి నేను ఏడుపు ఆపుకోలేక పోయాను. చుట్టాలు, పక్కాలు, స్నేహితులు, పరిచయస్తుల ఏడుపులు, పెడబొబ్బలతో తాతయ్య శవయాత్ర జరిగింది.
తాతయ్య వాళ్ళకు పెద్దగా ఆస్థులేం లేవు. కానీ, ఓ ముప్ఫై నలభై మంది ముందు నిలబడి అంతిమ సంస్కార బాధ్యతలను వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకున్నారు. శవాన్ని పూడ్చి పెట్టి మేము మగవాళ్ళమంతా ఇంటికొచ్చే సరికి కూడా ఇంటి ముందు వందల మంది వేచి చూస్తున్నారు. కొందరైతే, నన్ను పట్టుకుని,
“మీ తాతయ్యని మట్టిలో కలిపేసి వచ్చావారా!” అని ఏడుస్తుంటే నేను బిక్కచచ్చిపోయాను.
తాతయ్య మరణానికి అంత మంది రావడం, మా తాతయ్య గారి ఊళ్ళో చర్చనీయాంశమయింది. మా తాతయ్య మంచితనం వల్లనే అంత మంది వచ్చారనీ, మా తాతయ్య జీవితం ధన్యమయిందనీ, మనిషి విలువ అతను చనిపోయినప్పుడే తెలుస్తుందని – అవీ ఇవీ మాట్లాడుకున్నారు.
ఇంతలో కారు హారన్ గట్టిగా వినిపించడంతో ఉలిక్కిపడి, ప్రస్తుతంలోకి వచ్చాను. ఛటర్జీ మరణం వలన, మా తాతయ్య అంతిమయాత్ర నాకు గుర్తొచ్చింది.
ఆ రాత్రి ఇంటికొచ్చేసరికి అంతా మామూలుగా ఉంది. ఖాళీ స్థలాల్లో పిల్లలు ఆడుకుంటున్నారు. మహిళలు కుర్చీలు వేసుకుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఒక మనిషి తమ మధ్య నుంచి శాశ్వతంగా మాయమయ్యాడన్న చింత ఎవరిలో కనిపించడం లేదు.
+++
ఆ రాత్రి నాకు ఎంతకూ నిద్ర పట్ట లేదు. మధ్య రాత్రి లేచి కూర్చున్నప్పుడు, నాలో వింత వింత ఆలోచనలు కలగడం ప్రారంభమయింది.
ఛటర్జీ స్థానంలో, సెల్లారులో, ఒంటరిగా, నా శవం ఉన్నట్టుగా కళ్ళ ముందు మెదిలింది. ఆ దృశ్యాన్ని ఊహించుకోగానే కెవ్వుమని కేక వేసాను. కానీ, దాని శబ్దం బయటకు రాలేదు.
ఒకవేళ రేపు నేను చనిపోయినా అంతేనా? నా శవం సెల్లారులో పడుకోబెట్టి, ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారా? ఆ రోజు కూడా నా భార్య బ్యాంకుకు వెళ్తుందా? పిల్లలు సెలవు దొరకలేదని ఆఫీసులకు వెళ్ళిపోతారా? అనాథ శవంలా నన్ను కూడా ‘అంతిమ యాత్ర’ బస్సులో తీసుకెళ్తారేమోనన్న ఆలోచనలతో వణికిపోయాను.
ఇంక ఆ రాత్రికి నిద్ర పట్టలేదు. రెండో నిద్రమాత్ర కూడా పనిచేయలేదు. తెల్లారే సరికి నా ముఖం పీక్కుపోయింది. పక్క బెడ్రూంలో పడుకున్న నా భార్య వచ్చి నన్ను చూసి,
“సరిగ్గా నిద్ర పోలేదా?” అని పరామర్శించి తన పనిలో తాను పడిపోయింది.
నేను ఆ రోజు ఆఫీసుకి పోలేదు. నన్ను అడిగేవారు ఎవ్వరూ లేరు. మధ్యాహ్నం ఆఫీసు నుంచి సెక్షన్ ఆఫీసరు ఫోన్ చేసి, ‘ఆఫీసుకు రావడం లేదా సార్?’ అని అడిగాడు. ఆ రోజంతా ఏవేవో పిచ్చి ఆలోచనలు నా బుర్రను తినేసాయి.
మా బంధువులు, స్నేహితులు, ఆఫీసులో ఉద్యోగులు, చివరకు మా ఇంట్లో నా భార్యాపిల్లలు కూడా నన్ను ఒక కోపిష్టిగా, ఒక కఠినాత్ముడిగా చూస్తారు. కానీ, నాలో చెలరేగే ఆలోచనలు, దుఃఖాలు, స్పందనలు వాళ్ళు గమనించరు. కేవలం నేను కటువుగా మాట్లాడడమే వారికి గుర్తుంటుంది. కానీ, దానికి వారి ప్రవర్తనే కారణమన్న విషయాన్ని గుర్తించరు.
నా మనసు ఆ ఒక్క రోజే కాదు. చాలా రోజుల వరకు నా మనసు కుదుట పడలేదు. నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఛటర్జీ మరణంతో నాలో గొప్ప అంతర్మథనం మొదలయింది. ఛటర్జీ మరణం తత్కాలిక కారణమే అయినా, అంతకు ముందు ఎన్నో రోజుల నుంచి నాలో గూడుకట్టుకుంటున్న బాధలూ, భయాలూ, ఆందోళనలూ అన్నీ కలిసి, ఆ రోజు నుంచి నన్ను వేధించసాగాయి.
అంతే, ఒక ఫైన్ మార్నింగ్ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టాను. ఎవ్వరికీ చెప్పకుండా, ఫోన్ ఇంట్లో వదిలేసి, పొద్దున్నే ఒంటరిగా, ఈ మహానగరానికి ఎలా వచ్చానో, అలాగే బస్టాండుకు చేరుకుని, బయల్దేరాను.
+++
సాయంత్రం వరకు నేననుకున్న ఊరికి చేరుకున్నాను. నా మితృడు శంకరం, ఇంట్లోనే ఉన్నాడు. నన్నూ, నా అవతారం, నేను వాళ్ళింటికి నడుచుకుంటూ రావడాన్ని చూసి బిత్తరపోయి,
“ఏమైందిరా?” అన్నాడు. నేను నిర్లిప్తంగా నవ్వి,
“ఏం కాలేదురా! కానీ, నిన్నొక సాయం అడగడానికి వచ్చాను.” అన్నాను.
“నన్నా? సాయమా? నీకు సహాయం చేయగల స్థోమత నాకుందారా?” అన్నాడు.
“డబ్బులు కాదు. ఒక మాట సాయం కోసం వచ్చాను.” అన్నాను, తలొంచుకుని.
“మాటనా? అంటే?” అన్నాడు శంకరం అయోమయంగా.
నాకెలా చెప్పాలో తెలియడం లేదు. ఆ మాటలు పలకాలంటేనే నాకు దుఃఖం పొంగుకొస్తుంది. అయినా దుఃఖాన్ని బిగపట్టుకుని,
“శంకరం! మనిద్దరం చిన్నప్పటి స్నేహితులం. నువ్వు నీ కష్ట కాలంలో అడిగినప్పుడు నీకు నేను సహాయం చేయలేదు. ఆ విషయం మనసులో పెట్టుకోకుండా…. ” మాట పూర్తి చేయలేకపోతుంటే, శంకర్ నన్ను దగ్గరకు తీసుకుని, ఓదారుస్తున్నట్టుగా, “ఏమైందిరా? ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఇంట్లో అందరూ క్షేమమేనా?” అని ఆప్యాయంగా అడిగాడు.
నాకు దుఃఖం ఆగలేదు. కానీ, బలవంతంగా నోరు తెరిచి,
“శంకరం.. శంకరం! ఒకవేళ నేను చనిపోతే, నువ్వెక్కడున్నా రావాలిరా! నేను అనాథలా… ఆ మహానగరంలో… అక్కడి భూమిలో కలిసిపోదల్చుకో లేదురా! ఇది నా వీలునామా! నా అంతిమ కోర్కె కూడా అందులో రాసాను. నా అంతిమ యాత్ర మనూళ్ళో జరిగి, నా శరీరం మనూరి మట్టిలోనే కలిసిపోవాలిరా!
ఈ బాధ్యత నీకే ఎందుకు అప్పచెప్తున్నానంటే, నువ్వంటే నాకు అపారమైన నమ్మకం. అదీగాక, మా వాళ్ళకు నా కోరిక పిచ్చి కోరిక అనిపించవచ్చు. వారికి తీరిక లేక పోవచ్చును. లేక, అనవసరంగా డబ్బు దండగ ఎందుకు అని వాళ్ళకు అనిపించవచ్చును. నేను నా వాళ్ళందరి మధ్యన, పుట్టిన గడ్డ మీదనే, నేను పోవాలి.” అని కొన్ని కాగితాలు ఇచ్చి బయల్దేరడానికి సిద్ధపడ్డాను.
శంకరం భోరున ఏడుస్తూ,
“ఇదేం కోరిక రా! ఇప్పుడే చావు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావ్? అయినా, ఈ పని నాకెందుకురా అంటగడ్తున్నావ్?” అని నన్ను కౌగలించుకున్నాడు.
నేను మరేం మాట్లాడకుండా బయల్దేరుతుంటే,
“ఎక్కడికి రా? భోంచేసి వెళ్దువు గానీ!” అని అన్నాడు.
“లేదురా! ఇంకా చాలా మందిని పిలవాలి. వాళ్ళను కూడా మన్నించమని అడిగి, నా…. రమ్మని పిలవాలి.” ‘శవయాత్రకు’ అన్న మాటలు బయటకు అనలేక..అంటూ వడివడిగా బయటకు నడిచాను…
+++
రచన: డాక్టర్ ప్రభాకర్ జైనీ
Share this Article