( మణి భూషణ్ ) పర్వ దినాల్లో వరదలా భక్తి పొంగుతుంది.
నా వరకు అంత భక్తి లేదు కాబట్టి… ‘తిరు విలయాడల్ పురాణం’లోని సాహిత్య సంబంధమైన ఓ చిన్న ఘట్టం గుర్తు చేస్తాను. ఇది సాక్షాత్తూ శివుడికి, నక్కీరర్ అనే కవికి నడుమ వివాదం.
పరమ శివుడు రాసిన కవితను రివ్యూలో ఏకిపారేస్తే కోపం రాదా! అందులోనూ భార్యని వర్ణిస్తూ చెప్పిన కవితలో తప్పు బడితే ముప్పే కదా!
—
మదురై రాజ్యంలో తన భక్తుడిని ఆదుకోవడానికి శివుడు ఓ చిన్న కవితా ఖండికను ఇస్తాడు. రాజుకి ఆ కవిత వినిపిస్తే 1,000 బంగారు నాణాలు బహుకరిస్తాడని భక్తుడికి చెబుతాడు.
తీరా బహుమతి అందుకునే సమయంలో ఆస్థాన కవి నక్కీరర్ ఆ కవితను విమర్శిస్తాడు. ’కవితలో ప్రామాణికత శూన్యం‘ అంటాడు. బహుమతి ఆగిపోతుంది. భక్తుడు వెళ్లి శివుణ్ణి తిట్టుకుంటాడు.
ముక్కంటికి రోషం పొడుచుకొస్తుంది.
రాజ సభకు నేరుగా శివుడు వచ్చేసి, ’నన్ను విమర్శిస్తావా?‘ అంటాడు.
వారించబోయిన రాజుకు… “విబేధాలు, వివాదాలు స్కాలర్ల నడుమ సహజం. దీన్నెవరూ మార్చలేరు, ఆపలేరు” అని స్పష్టం చేస్తాడు శివుడు.
నక్కీరర్ : సరే, మీ కవితను మళ్లీ చదవండి.
శివుడు : “ఓ తుమ్మెదా, నీవు తిరుగాడిన పుష్పాలలో, ఈమె కురుల నుంచి వెలువడే సుగంధాన్ని మరపించగల పుష్పమేదైనా ఉన్నదా”
నక్కీరర్ : ఈ భావన అసంభవం, స్త్రీ కురులకు సహజ సుగంధం ఉండదు.
శివుడు : సౌజన్యవతులకు, ఉత్తమ స్త్రీలకైనా ఉండదా?
నక్కీరర్ : ఉండదుగాక, ఉండదు. పూల పరిమళమో, సుగంధపు నూనెల ప్రభావమో సోకి ఉండొచ్చు.
శివుడు : నీ నాలుకపై నడయాడే సరస్వతికైనా ఉండదా?
నక్కీరర్ : ఉండదు. నేను నిత్యం పూజించే పరమ శివుడి పత్ని పార్వతీ మాత కురులకుసైతం సహజ పరిమళం ఉండదు.
శివుడు : నిశ్చయమా? సత్యమా? అనేసి మూడో కన్ను తెరుస్తాడు.
(ఎదురుగా ఉన్నది లీలా వినోది (Thiruvilayadal) అయిన శివుడేనని నక్కీరర్ గ్రహిస్తాడు).
నక్కీరర్ : నీ ఒళ్లంతా కళ్లు చేసి నన్ను బూడిద చేసినా సరే, నా మాట మీద నిలబడతాను. తప్పు తప్పే.
శివుడు : నువ్వట్రా, నన్ను విమర్శించేది. నత్త గుల్లల నుంచి శంఖాలు ఏరుకునేవాడివి.
నక్కీరర్ : అవును, శంఖాలు సేకరించడం నా కులవృత్తి. నగిషీ పట్టడం నా జీవనోపాధి. నీకేం ఉంది?. తిరుపమెత్తుకుని పొట్ట గడుపుకొనేవాడివి అని ఆక్షేపిస్తాడు.
శివుడు భస్మం చేసి మాయమవుతాడు.
రాజు, మంత్రులు ఇతరులు మదుర మీనాక్షి ఆలయానికి వెళ్లి ప్రార్థిస్తే, శివుడు ప్రత్యక్షమై, నక్కీరర్ సత్య నిష్టకు మెచ్చి బతికిస్తాడు.
“నీ కళ్లెదుట ఉన్నది నేనే అని తెలిసినా జంకలేదు. నీవు నీ విమర్శకు కట్టుబడి ఉన్నావు. నీ నిబద్దతకు మెచ్చాను” అని నక్కీరర్ని దీవిస్తాడు శివుడు.
—
ఏ దశలోనూ నక్కీరర్ మెట్టు దిగలేదు. తన సాహితీ విమర్శకు తగ్గలేదు. అలాంటివాడిని మహాశివరాత్రినాడు గుర్తు చేసుకుంటే మంచిదే కదా అనిపించింది.
–––––––––––––––
Ps : Naresh Kandula గారికి శివానుగ్రహ ప్రాప్తిరస్తు….
.
Share this Article
Ads