.
నీళ్లు – నిధులు – నియామకాలు… ఇవే కదా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ఉద్వేగాలు… అనేకానేక కారణాలున్నా సరే ఇవే ముఖ్యంగా తెరపైన పరుగులు తీసినవి… నీళ్ల విషయానికి వస్తే ఇప్పుడు బనకచర్ల ప్రధానంగా వార్తల తెర మీద ప్రముఖంగా కనిపిస్తోంది…
రేవంత్ రెడ్డి ఏమాత్రం చిన్న అవకాశం ఇచ్చినా సరే… అది కాంగ్రెస్‌కు, రేవంత్‌కు కూడా నష్టమే… అసలే చంద్రబాబు… ఆపై బనకచర్ల ఏటీఎం కోసం ఆతృతగా ఉన్నాడు… ఆ ప్రాజెక్టుకు గనుక కేంద్రం వోకే అంటే… తెలంగాణలో ఇక కాంగ్రెస్, బీజేపీ ప్రజల ఎదుట తలలు దించుకోవాల్సిందే… బీఆర్ఎస్ వదిలిపెట్టదు…
Ads
ఏపీ సింగిల్ పాయింట్ ఎజెండాతో వచ్చింది… తన దృష్టంతా దానిపైనే ఉంది… అసలు కేంద్రం దగ్గర భేటీ ఏర్పాటు చేయించిందే తను… కేంద్రం పిలిస్తే, ఇద్దరు సీఎంల భేటీ అని చెబితే బహిష్కరించడం కుదరదు, ఇవేమైనా పాకిస్థాన్- ఇండియా దేశాల నడుమ సింధుజలాలా..? సో, వెళ్లక తప్పదు, తెలంగాణ వాదన వినిపించకా తప్పదు…
అనవసరంగా లేనిపోని అనుమానాల్ని, సంకేతాల్ని తెలంగాణ సమాజంలోకి పంపించినట్టు అవుతుంది… లేదు, ఇదేమీ అపెక్స్ కమిటీ భేటీ కాదు, బనకచర్ల కడతామని వాళ్లు అడగలేదు, అడగనప్పుడు మేం అభ్యంతరం ఎలా చెబుతాం అంటున్నాడు రేవంత్ రెడ్డి… ఏపీ నీటి మంత్రేమో బనకచర్ల మీదే హైలెవల్ కమిటీకి అంగీకారం అంటున్నాడు… సరే, ఏపీ మంత్రి తప్పు చెప్పాడు అనుకుందాం, కానీ ఏపీ వాళ్లు వెళ్లింది సింగిల్ పాయింట్ బనకచర్ల డిమాండ్ మీదే అయినప్పుడు, మేం రాబోం అని లేఖ రాసీ, మళ్లీ వెళ్లడంతో సర్కారే ఇరుకునపడ్డట్టయింది…
ఈనాడు వార్త నిజమే అని నమ్మితే… బనకచర్ల పేరు ప్రస్తావించకపోయినా చంద్రబాబు పోలవరం వద్ద 500 టీఎంసీల నీళ్లున్నాయనే ప్రస్తావన తీసుకొచ్చాడు, అంటే బనకచర్ల కోసమే… పేరుకు వరద జలాలు అని చెబుతున్నా వెదిరె శ్రీరాం చెబుతున్నట్టు వరదజలాలు అంటేనే ఓ భ్రమపదార్థం, ఆ ఊహాజలాల మీద ఆధారపడి 80 వేల కోట్ల ప్రాజెక్టు ఎలా కడతాడు..? తెలంగాణ కృష్ణా ప్రాజెక్టులకు కేటాయింపులు, అనుమతులు, ఇచ్చంపల్లి వద్ద నీటి లభ్యతను తెలంగాణ టీం ప్రస్తావించింది… అంటే చర్చ బనకచర్ల కేంద్రంగా జరిగినట్టే కదా…
కేంద్ర జలశక్తి కార్యదర్శి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి ఒకే బ్యాచ్‌మేట్లు కూర్చుని సొల్యూషన్ వెతకొచ్చుగా అనే సరదా సంభాషణ దాకా భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి…
ఎస్, తెలంగాణ ప్రభుత్వం ఓ స్ట్రాటజీతో అడుగులు వేసింది ఇన్నాళ్లూ… ఫలితంగా కేంద్ర పర్యావరణ, పోలవరం అథారిటీలు, సీడబ్ల్యూసీ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి… ఏపీలోనే చంద్రబాబు కోటరీ సహా అందరూ అదొక చెత్తా, గుదిబండ ప్రాజెక్టు అని వాదిస్తున్నారు… కేసీయార్ పుణ్యమాని నదీజలాలను యథేచ్ఛగా తీసుకుపోయే ప్లాన్లు వేసిన జగన్ కూడా బనకచర్ల కష్టమే సుమీ అంటున్నాడు లేటుగా… అది విడిగా చెప్పుకుందాం…
Share this Article