ఫారిన్ రీసెర్చ్ అనగానే మనం కళ్లుమూసుకుని టేకిట్ ఫర్ గ్రాంట్ అన్నట్టుగా పరిగణిస్తున్నామేమో… మనం అంటే ఇక్కడ మన మీడియా అని..! లేక ఏవో ఇంగ్లిష్ వార్తల్లో కనిపించిన అంశాలను మనం వేరుగా అర్థం చేసుకుని జనానికి ట్విస్టెడ్ వెర్షన్ అందిస్తున్నామేమో…
ఒక వార్త చూడగానే అదే అనిపించింది… వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసి, మన మీడియా యథాతథంగా తర్జుమా చేసుకున్న ఆ వార్త ఏమిటంటే..? ప్రపంచవ్యాప్తంగా ఫర్టిలిటీ రేట్ పడిపోతోంది అని..! ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు ప్రపంచజనాభా సగానికి సగం పడిపోవచ్చునని… పలు దేశాల ఎకానమీలు ఎఫెక్ట్ అవుతాయని,., అందులో ఇండియా కూడా ఉంది…
మనం ఇప్పుడు జనాభా విషయంలో ప్రపంచంలోనే నెంబర్ వన్… కానీ గత యాభై ఏళ్లకు పైగా చరిత్ర తీసుకుంటే 1950లో 6.18 ఉండేది… 2021 నాటికి అది రెండుకన్నా కిందకు పడిపోయింది… 2050 నాటికి మరీ 1.3 రేటుకు, 2100 నాటికి 1.04కు పడిపోవచ్చునని అంచనా… లాన్సెట్ కూడా దీనికి పలు కారణాల్ని విశ్లేషించింది…
Ads
ఎందుకు ఫర్టిలిటీ రేటు పడిపోతుందని చెప్పడానికి… మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఆలస్యపు వివాహాలు వంటివి ఏకరువు పెడుతున్నారు…
కానీ రియాలిటీ ఏమిటీ అంటే… కనలేకపోవడం వేరు, కనకపోవడం వేరు… కనలేకపోవడం అంటే వంధ్యత్వం… కనకపోవడం అంటే ఉద్దేశపూర్వకం… చైనా వంటి దేశాల్లో కావాలనే పిల్లల్ని కనడం లేదు, అసలు సంసార బంధాల్లోకే వెళ్లడం లేదు, పొటెన్సీ లేక కాదు…
పెరుగుతున్న జీవనవ్యయాల్లో ఎక్కువ మంది పిల్లల్ని సాకలేమనే భయం, ఒకరు లేదా ఇద్దరు, చాలా కుటుంబాల్లో వన్ ఆర్ నన్… అందుకే చాలా దేశాల్లో ముసలోళ్లు ఎక్కువై, పిల్లలు కనిపించడం లేదు… అది రాబోయే కాలంలో పెద్ద సమస్యగా మారే అవకాశమైతే ఉంది…
కాకపోతే పైన చెప్పిన సమస్యలు కూడా ఉన్నాయి… డౌట్ లేదు, కానీ ఫర్టిలిటీ రేటు పడిపోవడానికి చాలా కారణాలుంటయ్, అంతేతప్ప స్థూలంగా దాన్ని వంధ్యత్వంగా ముద్రవేయలేం… కుటుంబ నియంత్రణ ఒకప్పుడు నిర్బంధంగా, సొసైటీకి ప్రయోజకరంగా ప్రచారం చేయబడింది… ఇప్పుడు జంటలే స్వచ్చందంగా కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు…
చైనాయే కాదు, జపాన్, దక్షిణ కొరియా వంటి తూర్పు దేశాల్లో మరీ ఈ ‘నియంత్రణ’ అధికంగా ఉంది… పిల్లలు తగ్గిపోతుంటారు, ముసలోళ్లు క్రమేపీ మరణిస్తుంటారు, వెరసి టోటల్ జనాభా పడిపోతుంటుంది… అదీ ఆందోళనకారకం… మొన్నమొన్నటివరకూ ప్రపంచ జనాభా పెరిగిపోతోంది, వనరులు సరిపోవు, భూమాత భరించలేదు అని మొత్తుకున్న మనం ఇప్పుడు అయ్యో అయ్యో పిల్లలు పుట్టడం లేదు బాబోయ్ అంటున్నాం… కాలగతి… కాలమహిమ…
ఐనా పర్లేదులే… లాన్సెట్ చెబుతున్నట్టు నైగర్, కాంగో, మాలి, ఛాడ్, సోమలియా వంటి దేశాల్లో ఇప్పటికీ 5.6 నుంచి 6.8 దాకా సంతానోత్పత్తి రేటు వర్దిల్లుతోంది… ఎటొచ్చీ కొన్ని జాతులు కనుమరుగై, కొన్ని జాతులు వర్దిల్లుతాయి… అదీ నిజం..!!
Share this Article