.
పండోరా బాక్స్… అంటే, ఒకసారి గెలికితే లేదా ప్రారంభిస్తే లెక్కలేనన్ని కొత్త చిక్కులు రావడం… తెలుగులో తేనెతుట్టె కదపడం… పాలనా సౌలభ్యం వంటి ఎన్ని పడికట్టు పదాలు వాడినా సరే, ఒకసారి కొత్త జిల్లాలు, జిల్లాల పునర్వ్యస్థీకరణ అంటూ మొదలుపెడితే… ఇక బోలెడు డిమాండ్లు, చిక్కులు ఎట్సెట్రా తప్పవు…
అంతటి నియంత పోకడలతో వెళ్లిన కేసీయారే ఎడాపెడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది… చివరకు ఓ రెవిన్యూ డివిజన్‌కన్నా చిన్న జిల్లాలు కూడా..! ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా జిల్లాల పునర్వ్యస్థీకరణ యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి…
Ads
ఇంకేముంది..? అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా చర్చలు… కొత్త డిమాండ్లు, మమ్మల్ని దీంట్లో కలపండి, మమ్మల్ని దీంట్లో నుంచి తీసేయండి ఎట్సెట్రా… రాజకీయవర్గాల్లో కూడా బోలెడంత చర్చ… ఒక్క సిద్దిపేట విషయం మాత్రం అందరి నోళ్లలోనూ నానుతోంది… (సికింద్రాబాద్ మీద తలసాని కూడా ఏదో స్పందించినట్టున్నాడు)…
సిద్దిపేట జిల్లాను మారిస్తే బహుపరాక్ అని హరీష్ రావు హెచ్చరిస్తున్నాడు… నిజానికి కొన్నాళ్లుగా సిద్దిపేట జిల్లాయే కాదు, నియోజకవర్గం కూడా బహుళ చర్చల్లో ఉంటోంది… సొంత పార్టీ పెట్టుకోబోయే కవిత ఆ సీటుపైనే కన్నేసిందని, నేరుగా హరీష్ రావుతో ఢీకొడుతుందనే ప్రచారమూ ఉంది… భలే ఉంటుంది అది నిజంగా సాకారం అయితే..!
(నిజంగా కవిత అక్కడ నిలబడితే రేవంత్ రెడ్డి కూడా పరోక్ష సహకారం అందిస్తాడేమో బహుశా… అదే కాదు, ఈసారి సిరిసిల్ల, గజ్వెల్‌లలో కూడా రేవంత్ రెడ్డి ప్లానింగ్ డిఫరెంటుగా ఉండబోతోంది…)
మరోవైపు మరో చర్చ… పొన్నం ప్రభాకర్‌కు హరీష్ రావుకు సత్సంబంధాలే ఉన్నాయి… ఇద్దరూ కావాలనే సిద్దిపేట జిల్లాను చర్చల్లోకి తీసుకొస్తున్నారనే ప్రచారం బాగా సాగుతోంది… ఇద్దరికీ ఉపయోగకరం అయ్యేలా…!

పదే పదే సిద్దిపేట జిల్లాను మారిస్తే ఊరుకోను అంటుంటే… ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మారుస్తాడు అని ఉద్దేశమట… పొన్నం ప్రభాకర్ అనుకోకుండా హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చినా, తన ఇంట్రస్టు అంతా కరీంనగర్ పైనే… సో, హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలిపితే తనకు ఖుషీ…
ఇప్పుడు సిద్దిపేట జిల్లా మంత్రిగా ఉన్న పొన్నం నియోజకవర్గం గనుక అటు కరీంనగర్ జిల్లాలోకి వెళ్లిపోతే… ఇక మిగిలిన సిద్దిపేట జిల్లాలో హరీష్ రావుకు ‘మంత్రి పెత్తనం’ తప్పుతుంది, తను చెప్పిందే సాగుతుంది… తనూ ఖుషీ… అందుకని సిద్దిపేట జిల్లా మార్పులు అని రేవంత్ రెడ్డిని గోకుతున్నాడు… ఇదీ ప్రచారం…
ప్లానింగు బాగానే ఉంది గానీ... రేవంత్ రెడ్డికీ కొన్ని లెక్కలుంటాయి... తన మనసులోనే స్కెచ్చులు గీస్తుంటాడు... ఈ ఇద్దరూ అది మరిచిపోయినట్టున్నారు..! అవునూ, రేవంత్ రెడ్డి సాబ్, ఈ ప్రచారం నీదాకా వచ్చిందా..? తెలిసిందా..?! జిల్లాల సంఖ్య పెరగనుందా, ఉన్నవే అటూ ఇటూ మారతాయా..?!
Share this Article