Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎం సాబ్… తమరు జర్నలిస్టుగా ఉన్న కాలం కాదు… జమానా బదల్ గయా..!!

August 6, 2025 by M S R

.

మనం ఫేక్ జర్నలిస్టులు, రియల్ జర్నలిస్టులు అనే చర్చలో ఉన్నాం కదా… యూట్యూబ్- డిజిటల్, వెబ్ జర్నలిస్టుల మీదే ఎక్కుపెడుతున్నాం కదా ఓనమాలు కూడా రాని జర్నలిస్టులు అని…

మరి మెయిన్ స్ట్రీమ్ ఏమైనా శుద్దపూసా..? ఆ పత్రికలు, ఆ టీవీలు ఏమైనా సత్తెపూసలా..? బోలెడు అవలక్షణాలు, అపాత్రికేయ దుర్గంధం… మరి వాటి మాటేమిటి..?

Ads

మొన్నామధ్య జర్నలిస్టుల గురించి కందనాతి చెన్నారెడ్డి గారి ‘పల్లకి’లో పనిచేసిన ఒకప్పటి జర్నలిస్టు రేవంత్ జర్నలిస్టు జాతినుద్దేశించి చేసిన ప్రసంగం, ఫేక్ జర్నలిస్టులను మీరే ఏరేయాలి అని మెయిన్ స్ట్రీమ్ జర్నోలకు ఇచ్చిన పిలుపు తరువాత ఈ చర్చ బాగా సాగుతోంది…

నిజమే… రేవంత్ ప్రజెంట్ జర్నలిజం పోకడల మీద చెప్పిన కఠోర నిజాలు విని జర్నలిస్టులు ఉడుక్కోవలసిన పనిలేదు… ప్రధానంగా రేవంత్ వ్యాఖ్యలపై… తమకు వ్యతిరేకంగా రాసే వారిని పది అడుగుల లోతు పాతరేస్తానన్న కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు, ఆ పార్టీకి అనుబంధ- మానసిక మద్దతుదారయిన కొన్ని జర్నలిస్టు సంఘాలు, యూట్యూబర్స్ గుండెలు బాదుకోవడం వింతల్లో వింత…

ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ నిజాలే కాబట్టి! దారితప్పుతున్న జర్నలిజంపై రేవంత్ ఆవేదనలో అణువంత అబద్ధం లేదు. రేవంత్ పుణ్యాన జర్నలిజం తాజా పోకడలు చర్చించుకునే మహద్భాగ్యం దక్కంది. అప్పట్లో ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్, ఆ తర్వాత వార్త యజమానికి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటిచ్చింది. సరే… ఈనాడు మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక -టీడీపీ అనుకూల వైఖరి ప్రదర్శించినదే కాబట్టి అదంతా బహిరంగమే…

ఆంధ్రజ్యోతి తెలంగాణలో తొలుత కొద్దికాలం టీఆర్‌ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్ పల్లకీ మోసిన సంగతి తెలిసిందే. అప్పటి సీఎం కేసీఆర్‌పై అక్షర సమరం చేసిన ఆంధ్ర జ్యోతి యజమానిని… కేసీఆర్ చండీయాగానికి పిలవడంతో వారిద్దరి వైరానికి తెరపడింది. మళ్లీ ఇప్పుడు అగ్గిమండుతోంది… కాబట్టి ఈ విషయంలో ఆంధ్రజ్యోతి, ఎప్పుడు ఎవరి వైపు ఉంటుందో చెప్పలేని పరిస్థితి…

వైఎస్ సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ కోసం సూర్య, సాక్షి పత్రికలను పుట్టించడంతో.. అప్పటివరకూ కాంగ్రెస్‌కు ఉన్న మీడియాలోటు భర్తీ అయింది. వైఎస్ సీఎం అయిన తర్వాత ఆంధ్రజ్యోతి- ఈనాడుకు వ్యతిరేకంగా ‘ఆ రెండు పత్రికల’ని వ్యాఖ్యానించడం, వాటికి ప్రకటనలు నిలిపివేయడం, అవి కోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకోవడం తెలిసిందే.

ఆ తర్వాత కేసీఆర్ నమస్తే తెలంగాణ- టీన్యూస్ ప్రారంభించడం, అప్పట్లో దానికి అదనంగా వీ-6 చానెల్ ఉండటంతో టీఆర్‌ఎస్ మీడియా రంగంలో బాహుబలిగా మారింది… ఫలితంగా తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కథనాలు వండి వార్చే సంప్రదాయం మొదలయింది…

అంతకుముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలు.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వ్యతిరేక వైఖరి తీసుకున్న్పటికీ ఆ పత్రికలపై నిషేధం ఉండేది కాదు. ఆ మీడియా జర్నలిస్టులను ఆ పార్టీలు గౌరవించేవి. కానీ ఎప్పుడయితే కాంగ్రెస్- టీఆర్‌ఎస్ పార్టీలు సాక్షి, నమస్తే తెలంగాణ మీడియాను పుట్టించాయో, అప్పటినుంచే బహిష్కరణల పర్వం ప్రారంభమయింది. ఈనాడు, జ్యోతిని తమ ప్రెస్‌మీట్లకు రానివ్వని పరిస్థితి. అటు టీడీపీ కూడా సాక్షి, నమస్తే తెలంగాణ, ఆ తర్వాత టీవీ9ని ప్రెస్‌మీట్లకు పిలవని పరిస్థితి…

ఒక దశలో పెద్ద చానెళ్లయిన ఎన్‌టివి, టీవీ 9, మరికొన్ని చిన్నా చితకా చానెళ్లు తెలంగాణలో పదేళ్లు టీఆర్‌ఎస్ అనుకూలంగా శంఖారావం పూయించారు. అటు ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్‌టివి, 10 టీవీలతోపాటు చిన్నా చితకా చానెళ్లు, వైసీపీ అనుకూల- టీడీపీ వ్యతిరేక వైఖరి తీసుకున్న పరిస్థితి.

ఇక మిగిలిన మధ్య- చిన్న తరహా ప్రింట్‌ మీడియా సంస్థలు కూడా, ప్రకటనల కోసం అధికారంలో ఉన్న పార్టీల ప్రాపకం కోసం అంగలార్చిన అనుభవం చూసిందే. వాటి సర్క్యులేషన్ వందలు, వేలల్లోనే ఉంటుంది కాబట్టి, వాటి ప్రభావం అతి తక్కువే. ఎందుకంటే అవన్నీ జిల్లాల వారీగా ఫ్రాంచైజీలు అమ్ముకునేవి కాబట్టి, జనంలో వాటి ప్రభావం అత్యల్పం. ఫలితంగా మీడియా పార్టీల వారీగా నిట్టనిలువునా చీలిపోయిన వాస్తవ పరిస్థితి…

రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయిన తర్వాత ఆయన కూడా సొంత సోషల్‌ మీడియా టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు… ఆ సమయంలో కేసీఆర్ సర్కారును, తన సోషల్‌ మీడియా టీమ్ ద్వారా వీలైనంతగా కడిగేసేవాడు… బిగ్‌టివి కూడా రేవంత్ ప్రాయోజిత చానెలేనన్నది బహిరంగ రహస్యం… వీ6- వెలుగు సంస్థల యజమాని కూడా, కాంగ్రెస్‌లో చేరటంతో తెలంగాణలో కాంగ్రెస్ గొంతు పెరిగింది…

ఇక మళ్లీ రేవంత్ ‘ఆవేదనా స్రవంతి’కి వెళితే.. డిజిటల్, మీడియా, సోషల్ మీడియా గురించి ఆయన వ్యాఖ్యలు అక్షర సత్యాలే. ఒకప్పుడు ప్రెస్‌మీట్ పెడితే మహా అయితే, జర్నలిస్టులు పది మందికి మించి ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు ఒక నియోజకవర్గ స్ధాయి నేత ప్రెస్‌మీట్ పెడితే, హీనపక్షం 30 మంది వస్తున్న పరిస్థితి… వీరిలో 20 మంది యూట్యూబర్సే. అలాగని ఈ డిజిటల్, సోషల్‌ మీడియాను మరీ తేలిగ్గా తీసుకునేందుకు లేదు…

సరే… ఎలాగూ బ్లాక్‌మెయిలర్స్, పెయిడ్ ఆర్డికల్ బాపతు మీడియా ఉన్నందున వాటిని పక్కనపెడితే.. సుదీర్ఘకాలం జర్నలిస్టులుగా పనిచేసి, యాజమాన్య ధోరణి నచ్చక యూట్యూబులు, వెబ్‌సైట్స్ నిర్వహిస్తున్న వారికి జనాదరణ బాగుంది. వారి స్వేచ్ఛకు పరిమితులు లేవు కాబట్టి, నిజాలను ధైర్యంగా ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలకు అసలు ప్రమాదం ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టుల నుంచే!

ఇది కూడా మీడియా పుణ్యమే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రింట్- ఎలక్ట్రానిక్ మీడియా, ఏదో ఒక సంస్ధకు మానసికంగా అనుబంధంగా ఉన్నవే. అధికారంలో ఉన్నవారి అక్రమాలు ఆ మీడియా, యాడ్స్ మొహమాటంతో బయటపెట్టవు. ఒకవేళ బయటపెట్టినా.. ఏ 20వ పేజీలో చివరన సింగిల్‌కాలమ్‌లో రాసి, తద్దినం పెడతాయి. అదే డిజిటల్, సోషల్‌ మీడియా అయితే జరిగినదంతా పూసగుచ్చినట్లు జనం ముందుంచుతాయి. సోషల్ – డిజిటల్ మీడియాకు ఆదరణ పెరడానికి కారణం అదే.

ఈ సందర్భంగా రేవంత్ ఆవేదనను తేలిగ్గా కొట్టిపారేయలేం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్థానిక విలేకరుల్లో 90 శాతం మంది స్థానికంగా జరిగే బిల్డింగ్ నిర్మాణాలు, ఆ పరిథిలో జరిగే రియల్ ఎస్టేట్‌లపై ఆధారపడి బతికేవాళ్లేనన్నది ఎంత గింజుకున్నా, మనం మనుషులం అన్నంత నిజం. రాత్రివేళ ఇసుక లారీలు ఆపి, వాటి నుంచి వసూలు చేస్తుంటే అరెస్టయిన సందర్భాలు.. గ్రామాల్లో కాంట్రాక్టర్లను బెదిరించినందుకు చెట్టుకు కట్టి కొట్టిన సందర్భాలు కోకొల్లలు.

ఇక గత పదేళ్ల కాలంలో పొట్టపొడిస్తేక్షరం ముక్క కాదు కదా.. జర్నలిస్టు అని ఇంగ్లీషులో రాయడం కూడా రాని అజ్ఞానులతోపాటు.. రౌడీషీటర్లు, డ్రైవర్లు కూడా రేవంత్ చెప్పినట్లు.. జర్నలిస్టుల అవతారమెత్తుతుంటే, మరి వీరిని కూడా జర్నలిస్టులు అనాలా? ఇదో చర్చ…

కొన్నేళ్ల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో, మీడియాకు సంబంధించిన అవలక్షణం ఒకటి విజయవంతంగా కొనసాగుతోంది… పత్రిక సర్య్యులేషన్, ప్రజాదరణ, అర్హత ఎంపిక పరీక్షతో సంబంధం లేకుండా… ప్రెస్ ఐడెంటెటీ- అక్రెడిటేషన్‌ కార్డు కావాలంటే నియోజకవర్గానికి నెలకు ఎంత ఇస్తారు? కేలెండర్ యాడ్స్ ఎంత ఇస్తారు? పండగల యాడ్స్ ఎంత ఇస్తారు? అసలు ఐడి కార్డు కావాలంటే ఎంత చెల్లిస్తారు? జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కావాలంటే ముందు ఎన్ని లక్షలు కడతారు? ఒక జిల్లా ఫ్రాంచైజ్ కావాలంటే ఎంత ఇస్తారు? అక్రిడిటేషన్ కార్డుకు ఎంత ఇస్తారు వంటివే ప్రాతిపదికగా, జర్నలిస్టులను ఎంపిక చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి…

చివరకు రేవంత్ మొన్న హాజరైన సదరు ఎర్ర మీడియా సహా, వామపక్ష అనుబంధ పత్రికలు కూడా ఇదే దారిలో నడుస్తున్న వైచిత్రి… అసలు వామపక్ష పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇచ్చే అక్రెడిటేషన్ల జాబితాలో… ఆయా పార్టీల అనుంబంధ సంఘ నేతల పేర్లూ దర్శనమిస్తున్న పరిస్థితి. ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయు, ఏఐటియుసి వంటి అనుబంధ సంస్థల ఫుల్ టైమర్లు జర్నలిస్టులు కాకపోయినా, వారికి ఆ కోటాలో అక్రెడిటేషన్ కార్టులు ఎలా ఇస్తున్నారు? ఎందుకిస్తున్నారన్నది ప్రశ్న.

లబ్ధప్రతిష్ఠులైన కొన్ని అగ్ర మీడియా సంస్థలను మినహాయించి, తెలుగునాట ఉన్న తెలుగు- ఇంగ్లీషు- ఉర్దు మీడియా సంస్థలన్నీ ఇలాంటి వ్యాపారం చేస్తున్నవే. పోనీ, మీడియా సంస్థలను పెంచి పోషిస్తున్న, స్థానిక విలేకరులకు యాజమన్యాలేమైనా జీతాలు లేదా గౌరవ భృతి ఏమైనా ఇస్తున్నాయా అంటే… అదీ లేదు. జర్నలిజం.. నైతిక విలువల గురించి వాంతులు- విరేచనాలు చేసుకునే చాలా మీడియా సంస్థలు, ఏళ్లు-నెలల తరబడి జీతాలు ఇచ్చే దిక్కులేని పరిస్థితి. పైగా యాడ్స్ వేసుకుని జీతాలు తీసుకోమనే దిక్కుమాలిన సంస్కృతి…

మరి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు- అక్రమాలపై ఇన్ని సుద్దులు, హితోక్తులు చెప్పే పాలకులు.. ఏనాడైనా జర్నలిస్టులకు సక్రమంగా జీతాలు ఎందుకివ్వడం లేదని యాజమాన్యాలను ప్రశ్నించే ధైర్యం చేశారా? కార్మిక చట్టాలకు పదును పెట్టారా? జర్నలిస్టులకు పీఎఫ్, ఈఎస్‌ఐ ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించిన మొనగాడు ఇప్పటివరకూ ఎవరైనా ఉన్నారా అంటే అదీ లేదు…

దానితో విసిగివేసారిన స్థానిక విలేకరులు.. తాము ఎవరికో సంపాదించి పెట్టే బదులు.. తామే యూట్యూబ్ చానెళ్లు పెట్టుకుని, బతికేద్దామన్న ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆ జీవన పోరాటంలోనే వాళ్లు బ్లాక్‌మెయిలర్లుగా మారి, రేవంత్‌రెడ్డితో తిట్టించుకునే పరిస్థితి వచ్చింది…

పోనీ రేవంత్‌రెడ్డి సూచించిన ఆ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులేమైనా సుద్దపూసలా అంటే అదీ కాదు. అసలు ఇప్పుడు ఎవరికి వారే పెద్ద. ఒకరిని మరొకరు నియంత్రించే పరిస్ధితి లేదు. తమ సంఘాల ఉనికి కోసం, గ్రామీణ- పట్టణ విలేకరులకు జిల్లా- రాష్ట్ర పదవులివ్వడం- జిల్లా కలెక్టర్‌కు యూనియన్ల తరఫున అక్రెడిటేషన్లు సిఫార్సు చేయడం ప్రతిష్ఠగా మారింది…

నిజానికి గ్రామీణ విలేకరులకు లైన్ అకౌంట్లతోపాటు, డెస్కుల్లో పనిచేసే సబ్ ఎడిటర్లు, స్టాఫ్ రిపోర్టర్లకు సక్రమంగా నెలవారీ జీతాలు ఇప్పించే దమ్ములేని జర్నలిస్టు సంఘాల వల్ల.. ఒక జర్నలిస్టును ముందస్తు నోటీసు లేకుండా తొలగిస్తే అడ్డుకుని, మళ్లీ సదరు జర్నలిస్టును అదే సంస్థలో ఉద్యోగం ఇప్పించే దమ్ములేని జర్నలిస్టు సంఘాల వల్ల.. పాత్రికేయ లోకానికి వచ్చే లాభమేమిటన్నదే ప్రశ్న.

అసలు జర్నలిస్టు యూనియన్ల సిఫార్సులు చెల్లవని… డబ్బులు చెల్లించి జిల్లాలు కొనుగోలు చేసే ఫ్రాంచైజర్లు కాకుండా, నేరుగా పత్రిక ఎడిటర్/ యజమాని ఇచ్చే లేఖలనే ఆమోదిస్తామని ప్రభుత్వం నిర్మొహమాటంగా ఎందుకు ప్రకటించదు? ఆ పనిచేస్తే ఈ తడికరాయబారం చేసే ఫ్రాంచైజ్ జర్నలిస్టుల బెడద తప్పుతుంది కదా?

అసలు ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసమే ఈ పోటీ కాబట్టి.. అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా, అవి ఇచ్చేస్తే అసలు ఎదురు డబ్బులిచ్చే ఈ ‘కిరాయి జర్నలిజం’ లోకి గ్రామీణ- పట్టణ విలేకరులు ఎందుకు ప్రవేశిస్తారు?

రేపు ఏ దావూద్ ఇబ్రహీం లాంటివాడో వచ్చి.. ఫలానా కరీంనగర్ జిల్లా ఫ్రాంచైజీ కావాలనో, ఏ అమలాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టరు కావాలో చెప్పి దాని ఖరీదు చెల్లిస్తే.. నిక్షేపంగా, నిస్సంకోచంగా వారికి జిల్లా స్టాఫ్ రిపోర్టర్/జిల్లా ఫ్రాంచైజీ ఇస్తున్న యాజమాన్యాలపై కొరడా ఝళిపించే దమ్ము ఈ పాలకులకు ఉందా? బహుశా రేవంత్‌రెడ్డి.. ఇంకా తాను ‘పల్లకి’ పత్రికలో పనిచేసిన జమానాను, ఇప్పటి జమానాతో పోల్చుకుంటున్నారేమో?! జమానా బదల్ గయా సాబ్…!!  ( సౌజన్యం :: Suryaa.co.in మార్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మనసున్న వార్త… ఓ ముసలాయనకు ప్రాణం పోసిన ఓ మనస్విని సేవ…
  • ఎఐసీసీ మంత్రి పదవిని ప్రామిస్ చేస్తే… రేవంత్ రెడ్డిని ఎందుకు అడగడం..!?
  • తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!
  • సీఎం సాబ్… తమరు జర్నలిస్టుగా ఉన్న కాలం కాదు… జమానా బదల్ గయా..!!
  • ట్రావెల్ థెరపీ… సరదాగా చెప్పుకున్నా నిజముంది, ఫలముంది…
  • మోడీ దర్శించిన ఆ హిస్టారిక్ టెంపుల్ కథాకమామిషు ఏమిటంటే..!!
  • జయహో టెస్టు మ్యాచ్ సీరీస్… వన్డేలు, టీ20లకు దీటుగా ప్రేక్షకాదరణ…
  • Ramayana… a story for English readers and civil trainees..!!
  • ఢిల్లీలో ఫైట్‌కు రేవంత్ రెడీ..! కుదరదంటున్న బండి సంజయ్..!!
  • ఫేక్ జర్నలిస్టులపై మరి ప్రభుత్వ తక్షణ బాధ్యత ఏమీ లేదా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions