.
అబ్బే, ఆ బొద్దింకల పార్టీలతో ఒరిగేదేముంది అన్నాడు ఓ మిత్రుడు… కానీ, తప్పు..! అది హఠాత్తుగా ఇప్పటికిప్పుడు నేపాల్, శ్రీలంక తరహాలో అధికారాన్ని హస్తగతం చేసుకోలేకపోవచ్చుగాక… కానీ ఇది ఖచ్చితంగా జెన్‌జీ యుగం- సోషల్ మీడియా శకం… ప్రభుత్వాలు, పార్టీలు, సామాజిక అంశాలపై బలమైన నిరసనను, ప్రతిఘటనను వ్యక్తీకరించడానికి అది సరైన వేదిక అవుతుంది…
పైగా యువతలోకి బలంగా ఒక మెసెజ్, ఒక పిలుపు రీచ్ కావాలంటే ఇవే పనిచేస్తాయి… పైగా ఇప్పుడు ఏర్పాటైన కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్ వేదికల ఫాలోయింగులో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది… కొన్ని గంటల్లోనే మిలియన్ల రీచ్… 4 రోజుల్లో 9 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోయర్లు…
Ads
అయితే చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలకు ఆయనే వివరణ ఇచ్చారు… తన వ్యాఖ్యలు మొత్తం నిరుద్యోగ యువత గురించి కాదనీ, దారితప్పిన వాళ్ల గురించేనని..! నిజంగానే దారితప్పిన యువత, నిరుద్యోగుల గురించి ఆయన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు… ఎవరి వైపు నుంచీ మందలింపు లేకపోతే ఎలా..? సరే, ఒకాయనకు నచ్చలేదు, ఈ పార్టీ పెట్టాడు…
ఇది డిజిటల్ పార్టీ… జస్ట్, ఓ సెటైరిక్ ప్లాట్‌ఫామ్… భారతీయ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్… నిన్నటి మొన్నటి వరకు రీల్స్, మీమ్స్, ఆన్‌లైన్ గేమింగ్‌లకే పరిమితమనుకున్న Gen Z (నేటి యువత) ఒక్కసారిగా సీరియస్ రాజకీయ చర్చల్లోకి వచ్చేసింది… ట్రెండింగ్ రీల్స్ నుండి డైలీ అప్‌డేట్స్ వరకు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నీ ఇప్పుడు ఒకే ఒక్క పేరుతో మారుమోగిపోతున్నాయి… అదే—‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP)…
మరో అంశం… దీని వెనుక ఉన్న వ్యక్తి అనామకుడేమీ కాదు… డిజిటల్ ప్రచారాలు జనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలిసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి… అందులోనే ఉపాధి పొందుతున్న వ్యక్తి… రాజకీయ పార్టీలకు పనిచేసిన వ్యక్తి… సో, ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభావవంతంగా నడపగల సాధన సంపత్తి, టెక్నికల్ జ్ఙానం పుష్కలంగా ఉన్నవాడే…
ఎవరీ అభిజీత్ దీప్కే?
ఈ సంచలన డిజిటల్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రధాన సారథి అభిజీత్ దీప్కే… ఆయన కేవలం ఒక సాధారణ నెటిజన్ కాదు, పదునైన ‘పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్’… నేరేటివ్ బిల్డింగ్, పబ్లిక్ మెసేజింగ్, డిజిటల్ ప్లాట్‌ఫాంలు రాజకీయ అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై ఆయనకు పట్టుంది…
పూణేలో జర్నలిజంలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభిజీత్, ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు… గతంలో (2020 నుండి 2023 వరకు) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా టీమ్‌లో వాలంటీర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకుంది…
ముఖ్యంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్స్ ఆధారిత డిజిటల్ క్యాంపెయినింగ్‌తో ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు తను… అదే వ్యూహాత్మక అనుభవంతో, ఇప్పుడు ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ని తెరపైకి తెచ్చాడు… (సీజేపీ… ఇందులో బీజేపీ, సీజే, తను చేసిన బొద్దింక వ్యాఖ్యలన్నీ కలగలిసి ఉన్నాయి)…
- కేవలం సామాన్య యువతే కాదు, సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చల ద్వారా ప్రభావితమై.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్‌లు సైతం ఈ పార్టీలో సభ్యులుగా చేరడం విశేషం… సో, సిజేపిని ఫస్ట్ దశ నుంచే దారితప్పించే శక్తులు చేరుతున్నాయి అందులో… ఇది అపశకునం… గత నాలుగు రోజులుగా ఆ అకౌంట్ ని ఫాలో అవుతున్న వాళ్లలో ఎక్కువమంది బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ దేశస్తులు చేరుతున్నారు, ఇది మరో ప్రమాద సంకేతం…
నవ్వుకుంటూనే వ్యవస్థను నిలదీసే 5 మేనిఫెస్టో వాగ్దానాలు
పైన నవ్వులాటగా అనిపించినా, CJP ప్రకటించిన ఐదు ప్రధాన వాగ్దానాలు భారత దేశ ప్రస్తుత రాజకీయ, న్యాయ వ్యవస్థల్లోని లోపాలను అత్యంత పదునైన వ్యంగ్యంతో ఎండగడుతున్నాయి…
న్యాయవ్యవస్థ జవాబుదారీతనం…: సీజేపీ అధికారంలోకి వస్తే, రిటైర్మెంట్ తర్వాత ఏ చీఫ్ జస్టిస్‌కు కూడా బహుమతిగా రాజ్యసభ సీటు ఇవ్వబడదు (క్విడ్ ప్రో కో నిరోధానికి)…
ఓటు హక్కు పరిరక్షణ…: సీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా లేదా ప్రతిపక్షాల పాలనలోనైనా.. ఏదైనా అసలైన ఓటు గనుక కావాలని తొలగించబడితే, సదరు ఎన్నికల అధికారిని ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేస్తారు… పౌరుల ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదం కంటే తక్కువ ఏమీ కాదు…
మహిళా సాధికారత…: చట్టసభల్లో, అన్ని రంగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తారు…
మీడియా స్వేచ్ఛ…: కార్పొరేట్ శక్తులు, ప్రభావవంతమైన వ్యాపారవేత్తల యాజమాన్యంలోని అన్ని ప్రయోజన ఆధారిత మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తారు…
ఫిరాయింపుల నిరోధం…: ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి కోరలు చాచే ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా సరే.. 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా లేదా ప్రభుత్వ పదవులను చేపట్టకుండా నిషేధిస్తారు…
సిజేపిలో చేరడానికి విచిత్రమైన అర్హతలు….
యువతను ఆకర్షించేందుకు ఈ పార్టీ పెట్టిన నిబంధనలు కూడా ‘క్రానికల్లీ ఆన్‌లైన్’ ట్రెండ్‌కు అద్దం పడుతున్నాయి…
నిరుద్యోగి… బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా లేదా సిద్ధాంతపరంగానైనా నిరుద్యోగి అయి ఉండాలి…
సోమరిపోతు…: శారీరకంగా సోమరితనంగా ఉన్నా, మెదడు మాత్రం ఆలోచనలతో పరుగెడుతూ ఉండాలి…
క్రానికల్లీ ఆన్‌లైన్…: బాత్రూమ్ బ్రేక్స్‌తో కలుపుకుని రోజుకు కనీసం 11 గంటలు ఆన్‌లైన్‌లో గడపాలి…
ప్రొఫెషనల్ విమర్శకుడు…: చేసే విమర్శ పదునైనదిగా, నిజాయితీగా, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి…
ఈ సెటైరిక్ డిజిటల్ పార్టీలతో ఒరిగేదేముంది?
ఈ పార్టీ ఇంకా అధికారికంగా ఎన్నికల సంఘం దగ్గర నమోదు కానప్పటికీ, దేశ రాజకీయాలపై విరక్తి చెందిన భారతీయ యువతను చివరకు రాజకీయాల వైపు నడిపించే సాధనంగా ఇది మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు…
1. ప్రజాస్వామ్య నిరసనకు “సేఫ్టీ వాల్వ్” (Safety Valve)… వ్యవస్థపై, పాలకులపై యువతలో ఉండే అసంతృప్తి, కోపం ఒక్కోసారి హింసాత్మకంగా మారే ప్రమాదం ఉంది… కానీ, వ్యంగ్యం (Satire) అనేది ఆ కోపాన్ని ఒక నిర్మాణాత్మకమైన, ఆలోచింపజేసే డిజిటల్ రూపంలోకి మారుస్తుంది… శాంతియుతంగా నవ్వుకుంటూనే వ్యవస్థలోని లోపాలను ఎండగట్టడానికి ఇది యువతకు ఒక ‘సేఫ్టీ వాల్వ్’ లా పనిచేస్తుంది…
2. పాలిటిక్స్ అంటే బోర్ అనే భావనను తుడిచేయడం… సగటు యువతకు సంప్రదాయ రాజకీయ ప్రసంగాలు అంటే బోర్… కానీ మీమ్స్, ట్రెండింగ్ రీల్స్ ద్వారా పాలిటిక్స్ మాట్లాడితే Gen Z త్వరగా కనెక్ట్ అవుతుంది… CJP ఐదు వాగ్దానాలను గమనిస్తే… దేశానికి ఏం కావాలో యువత చర్చించుకునేలా చేయడంలో ఇవి సఫలమవుతున్నాయి…
3. పెద్దలకు “కనువిప్పు”… డిజిటల్ మీడియాలో ఒక్క చిన్న సెటైరికల్ క్యాంపెయిన్ సృష్టించే ఇంపాక్ట్.. పెద్ద పెద్ద ధర్నాలు కూడా సృష్టించలేవు…. రోజుల్లోనే లక్షల మంది ఫాలో కావడం అంటే… వర్తమాన రాజకీయాల తీరుపై యువతలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు…
4. అంతర్జాతీయంగా సక్సెస్ అయిన దాఖలాలు… ఇలాంటి వ్యంగ్య పార్టీలతో ఒరిగేదేముంది అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో వీటికి పెద్ద చరిత్రే ఉంది… ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ నిజానికి ఒక టీవీ షోలో వ్యంగ్యంగా దేశ అధ్యక్షుడు అయిన నటుడు… ఆ రీల్ లైఫ్ పాపులారిటీయే ఆయన్ను నిజ జీవితంలో అధ్యక్షుడిని చేసింది… అలాగే, ఐస్లాండ్‌లో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కొందరు కళాకారులు స్థాపించిన వ్యంగ్య పార్టీ “బెస్ట్ పార్టీ” (Best Party), ఏకంగా రాజధాని రేక్యావిక్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి, మేయర్ పీఠాన్ని దక్కించుకుని సమర్థవంతంగా పాలన సాగించింది…
ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ రేపు ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు, సీట్లు గెలవకపోవచ్చు… కానీ, ఒక వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని, రాజకీయాలపై ఉదాసీనంగా ఉండే యువతలో ఒక కొత్త చైతన్యాన్ని ఇది ఖచ్చితంగా తీసుకురాగలదు… తుపాకీ గుండు కంటే పదునైన వ్యంగ్య బాణం… వ్యవస్థలో మార్పునకు తొలి అడుగు కాగలదని ఈ ‘బొద్దింకల విప్లవం’ నిరూపిస్తోంది…
- అప్‌డేట్… 10 మిలియన్ల ఫాలోయర్లు దాటిన తీరుపై ఇంటలిజెన్స్, కేంద్ర హోం శాఖ ఆరాలు తీస్తున్నాయి… ఇది భవిష్యత్తులో ఏమైనా బెడదగా మారే ప్రమాదం ఉందనే కోణంలో విశ్లేషణలు చేస్తున్నాయి… యాంటీ ఇండియా శక్తుల చేతుల్లో పడితే కష్టం కాబట్టి… ఇండియాలో అలాంటి శక్తులు చురుకుగా ఉన్నాయి కాబట్టి…
Share this Article