Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక మేక ప్రధాన ఇతివృ‌త్తంగా ఓ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్… దీపావళి…

September 3, 2024 by M S R

మంచిలోనైనా… చెడులోనైనా… మన కులదైవాన్ని మాత్రం మనం ఎప్పటికీ వదిలిపెట్టకూడదని చెప్పే సినిమా… ‘దీపావళి’.

ఒక మేకను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని సినిమా తీయడం… అసలు ఇలాంటి కథతో ఓ సినిమా తీయొచ్చని అనిపించడమే ఓ వింత. అందులోని నటీనటులను చూస్తే మన ఆశ్చర్యం రెట్టింపవుతుంది. ఎవరు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరూ పెద్దగా పరిచయమున్న నటులు కాదు. కానీ ప్రతి ఒక్కరూ… తమ తమ పాత్రలలో ఇట్టే ఇమిడిపోయారు.

శీనయ్య అనే ఓ వృద్ధుడు… తన భార్య, మనవడితో ఓ చిన్న గుడిసెలో జీవిస్తుంటాడు. మనవడు గణేశ్ తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోవడంతో పిల్లాడి పోషణ బాధ్యత ఈ వృద్ధులపై పడుతుంది. ఒకప్పుడు చెట్లెక్కి కొబ్బరికాయలు దించడం వృత్తిగా జీవించిన శీనయ్యకు… ఇప్పుడు వయసు రీత్యా ఆ పని చెయ్యడానికి వీలుపడని పరిస్థితి. గణేశ్ తో పాటుగా ఆ ఇంట్లో ప్రాణం పోసుకున్న మరో జీవి… నల్ల మేక. అది కూడా ఆ ఇంట్లో గణేశ్ తో పాటుగా పెరుగుతూ వస్తోంది. దాన్ని వాళ్లు కర్రోడా… అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.

Ads

దీపావళి పండగొచ్చింది. తన మనవడి స్నేహితులందరూ కొత్త బట్టలు, టపాకాయలు కొంటున్నారు. వాటి గురించి మనవడు గణేశ్ దగ్గర రకరకాలుగా వర్ణించి చెప్తున్నారు. “మీ తాత నిన్ను టౌనుకి తీసుకెళ్ళి ఇవన్నీ కొనివ్వడం జరిగే పనేనా?” అంటూ ఎగతాళి కూడా చేస్తున్నారు. పండక్కి తనకు కొత్త బట్టలు కొనిమ్మని మనవడు పట్టుబట్టాడు. ఎలాగైనా సరే మనవడి కోరిక తీర్చాలని శీనయ్య తాత పంతం పట్టుకు కూర్చున్నాడు.

మరోవైపు… భాయ్ మటన్ కొట్లో పనిచేసే వీరాస్వామి… రోజూ రాత్రి తాగి, పొద్దున ఆలస్యంగా పనికి వెళుతుంటాడు. వీరాస్వామి తీరు నచ్చని భాయ్ కొడుకు, వీరాస్వామి మీద గుర్రుగా ఉంటాడు. వీరాస్వామి వల్లే తమ వ్యాపారం వృద్ధి చెందిందని భాయ్ కి వీరాస్వామి మీద ఒకింత అభిమానం. కానీ భాయ్ కొడుకు… వీరాస్వామితో గొడవపడి రేపటి నుంచి పనిలోకి రావద్దు పొమ్మంటాడు. “ఈ దీపావళికి నీ ఎదురుగానే కొట్టు పెట్టి నీకంటే గొప్పగా వ్యాపారం చేస్తా”నని వీరాస్వామి భాయ్ కొడుకుతో సవాల్ చేస్తాడు. కానీ వీరాస్వామికి తన భార్య దేవుడి దగ్గర ముడుపు విప్పి ఇచ్చిన 500 రూపాయలు మినహా పెట్టుబడికి ఇంకేమీ ఉండదు. పైగా… డబ్బులివ్వకుండా తాము మేకల్ని ఇవ్వలేమని ఊళ్లో వాళ్ళందరూ వీరాస్వామికి తేల్చి చెప్పేస్తారు.

మరోవైపు వీరాస్వామి కొడుకు ఆటో నడుపుకుంటూ ఉంటాడు. మేనమామ కూతురు, ఇతను పరస్పరం ప్రేమించుకుంటూ ఉంటారు. వారికి పెళ్లి చేయడం… అమ్మాయి తండ్రికి సుతరామూ ఇష్టం లేదు.

అయితే… అదే సమయంలో మనవడి కోర్కె తీర్చడం కోసం తనకున్న ఐదు సెంట్ల భూమిని అమ్మజూపి అది వీలుపడకపోవడంతో తన దగ్గరున్న మేకను అమ్మాలని శీనయ్య తాత అనుకుంటున్న సంగతి వీరాస్వామికి తెలుస్తుంది. కానీ… శీనయ్య మనవడు గణేశ్ మాత్రం… తనకు పండక్కి కొత్త బట్టలు తీసివ్వకపోయినా ఫరవాలేదు… కర్రోడిని మాత్రం అమ్మొద్దని తాత, అవ్వల దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాడు. అయినా సరే… శీనయ్య కర్రోడిని అమ్మడానికే నిశ్చయించుకుని వీరాస్వామితో బేరం కుదుర్చుకుంటాడు. శీనయ్యకు డబ్బులు కట్టడానికి ఊళ్లో కొందరికి పండక్కి మటన్ ఇస్తానని చెప్పి వాళ్ల దగ్గర ముందుగానే డబ్బులు తీసుకుంటాడు వీరాస్వామి.

ఇంతలో ఊళ్లో చిల్లర దొంగతనాలు చేసే ముఠా ఒకటి శీనయ్య కర్రోడిని దొంగిలిస్తారు. కర్రోడు దొరికాడా? శీనయ్య పండక్కి మనవడికి బట్టలు తీసివ్వగలిగాడా? వీరాస్వామి, మాటకి కట్టుబడి ఊళ్లో వాళ్ళకి మటన్ సప్లై చెయ్యగలిగాడా? వీరాస్వామి కొడుకు తన ప్రేమను గెలిపించుకోగలిగాడా? గణేశ్, కర్రోడ్ని కాపాడుకోగలిగాడా? అనేది బుల్లి తెర మీద చూడాల్సిందే.

ఓటీటీలో, ఈటీవీ విన్ లో అందుబాటులో ఉన్న ఈ రెండు గంటలా రెండు నిమిషాల సినిమా ‘దీపావళి’ మనల్ని మధ్యలో బాత్రూంకి కూడా వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపూ అసలు మనకు సినిమా చూస్తున్నట్టే ఉండదు. మన ఊళ్లో, మనవాళ్ల మధ్యే ఉన్నట్టుంటుంది. అన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా… వాటన్నిటికీ మనమే సాక్ష్యమన్నట్టుగా ఉంటుంది.

సినిమాలోని ప్రతి పాత్రా మన తాత, మన అమ్మమ్మ, మన అమ్మ, మన నాన్న, మన ఊరి మటన్ కొట్టతను, మన ఊళ్లోని షావుకారు, మన ఊళ్లోని యువతీ యువకులే అనిపిస్తారు. నటీనటుల ఎంపిక అత్యద్భుతం. ఎలాంటి మేకప్పు పైకప్పులూ లేని నటులు కావడంతో… సినిమాలోని పాత్రలన్నీ మనకు పరిచయమున్నవే అనిపిస్తాయి. నిజానికి నాకైతే… వారిలో ఒక్క నటుడు, నటీమణి కూడా తెలిసినవారు కానే కాదు. ఒకరిద్దరిని మాత్రం ఇంతకుముందు కొన్ని సినిమాలలో చూసినట్టుగా అనిపించింది కానీ, వాళ్ల పేర్లు, వివరాలు అస్సలు తెలీదు.

అసలు ఇలాంటి కథని తీసుకొచ్చిన దర్శకుడిని నమ్మి సినిమా తీసిన స్రవంతి రవి కిషోర్ గారిని ముందుగా అభినందించి తీరాలి. ఇక దర్శకుడు ఆర్. ఏ. వెంకట్ ని ఎంత ప్రశంసించినా తక్కువే. నటీనటులలో, సన్నివేశాలలో, లొకేషన్లలో, సంభాషణలలో ఎంత సహజత్వమంటే… నేనైతే సినిమా చూస్తున్నంత సేపూ నేను సినిమా చూస్తున్నానన్న సంగతే మరిచిపోయాను. అసలు ఈ సినిమాలో పాటలున్నాయో లేదో కూడా గమనించలేకపోయాను. అది తెలుసుకోవాలంటే మళ్ళీ సినిమా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు నాది.

ఓ సన్నివేశంలో… తన మనవడి కోర్కె తీర్చలేకపోయానని, పండుగ చేసుకోలేకపోతున్నాననే అక్కసుతో శీనయ్య తాత… తమ కులదైవాన్ని నిందించి, ఇక ఎప్పటికీ నిన్ను పూజించబోనని చెప్పబోతాడు… ఇంతలో వీరాస్వామి అడ్డుకొని… “చూడు శీనన్నా… ఎంత మంచిలోనైనా… చెడులోనైనా… మన కులదైవాన్ని మాత్రం మనం ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. మనం పుట్టినప్పటినుంచి చచ్చేవరకూ మనకు తోడుండేది మన కులదైవమే.” అని చెప్తాడు. ‘తంగలాన్’ లాంటి తల తిక్క సినిమాలతో జనాల మెదళ్ళలో విషాన్ని నింపే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్న ఈ రోజుల్లో… ఇంత అద్భుతమైన సత్యాన్ని… ఇంత సింపుల్ గా… ఒక చిన్న సన్నివేశంలో… ఒక చిన్న సంభాషణలో… చెప్పే డైరెక్టర్ ఒకరుండడం సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

ఏదేమైనా… మన ఊరిని… మన వారిని… మన దైవాన్ని… మన విశ్వాసాల్ని… మన పల్లెల్లో పరచుకున్న పచ్చదనాన్ని… పల్లె మనసుల్లోని, మనుషుల్లోని మంచితనాన్ని చాటే చిత్రం, మనందరం తప్పకుండా చూసి తరించాల్సిన చిత్రం దీపావళి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. రావాలంటే ఇలాంటి సినిమాలు బ్రతకాలి. బ్రతకాలంటే… మనం బ్రతికించాలి. బ్రతికించడమంటే… ఆదరించటం… ఆదరించాలి. ఆదరించటమంటే… టిక్కెట్ల నీరు పొయ్యటం… ఓటీటీలో అయితే.‌‌.. వ్యూస్ ఎరువు వేసి ఏపుగా సాకాలి‌…. – శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions