మనిషి పరిణామక్రమం ఏమిటి…? అబ్బే, ఇదొక ప్రశ్నా..? దేవుడు అన్ని జంతువులనూ సృష్టించినట్టే మనిషినీ సృష్టించాడు… అంతే… ఓహో, నెమలి సంతానక్రమం ఏమిటి..? ఇదీ ఈజీ జవాబే… దాని కన్నీళ్లు తాగి గర్భం ధరిస్తుంది, చాలా సింపుల్… మరి కోతి నుంచి మనిషి పుట్టాడు అంటారు కదా, నిజం కాదా..? ఎహె, ఎవరో కోతి మెదడు ప్రతిపాదించిన తిక్క పరిణామ సిద్ధాంతం అది…
ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటివే జవాబులు మనం వింటూనే ఉంటాం కదా… వీటినే పిల్లలకు నేర్పి, వాళ్లను కూడా మనం బతికే పాతరాతియుగంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలను ఏమనాలి..? బీజేపీ మార్క్ నూతన విద్యావిధానం అనాలి… అప్పట్లో శ్రీశ్రీ అన్నాడు కదా… ‘విశ్వనాథ వారు వెనక్కి వెనక్కి నడవగా వేదకాలం ఇంకా వెనక్కి వెళ్ళింది’ అని… ఇదీ అలాంటిదే… లేకపోతే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాల నుంచి కొట్టేయడం ఏమిటి..?
CBSE సిలబస్ నుంచి డార్విన్ పరిణామ క్రమాన్ని తీసేయడం మీద సైంటిస్టులు, సైన్స్ టీచర్లు 1800 మంది ఆందోళన వ్యక్తం చేస్తూ… ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు లేఖ రాశారని వార్త… నిజంగానే ఈ ధోరణి ఆందోళనకరం… ఢిల్లీ పాదుషాల మీద పాఠాలు తొలగిస్తే పెద్ద పోయేదేమీ లేదు… పిల్లలకు చెప్పనక్కర్లేని చెత్తా పాఠాలను కూడా తీసేయాల్సిన అవసరమూ ఉంది… కానీ పిల్లలను శాస్త్రీయ కాలంలోకి తీసుకువెళ్లే పాఠాలను కూడా తీసేయడం జాతిద్రోహం అనబడుతుంది…
Ads
అసలు ఆ పాఠాలను కొట్టేసిన మూర్ఖుల గురించి ఏం చెప్పేది..? డార్విన్ ఏం చెప్పాడో, సరిగ్గా అదే పరిణామ క్రమాన్ని మనకు పురాణాలు దశావతారాల్లో చెబుతాయి… మొదట మత్స్యావతారంతో మొదలవుతుంది వాటిల్లో మానవ పరిణామ క్రమం… జలచరాల నుంచి ఉభయచరాల మీదుగా మృగం మానవుడిగా పరిణామం పొందిన తీరే దశావతారాల క్రమం… ఆ కోణంలో చూసినా డార్విన్ పరిణామ క్రమం పాఠ్యపుస్తకాల్లో ఉండాలి కదా…
పోనీ, ఇప్పటివరకూ శాస్త్రీయంగా డార్విన్ పరిణామ క్రమాన్ని విభేదించే ఏ కొత్త సిద్ధాంతమూ రాలేదు, లేదు… స్థూలంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆమోదిస్తున్నదే అది… ఉత్పరివర్తనాలు, దేహాల్లో మార్పులు, మనుగడ కోసం పోరాటం, అవసరాల్ని బట్టి దేహంలో మార్పులు, అవసరం లేని దైహిక భాగాల అదృశ్యం వంటి అనేకాంశాల్లో డార్విన్ వివరణ కన్విన్సింగుగా ఉంటుంది… మనల్ని మళ్లీ వేదకాలం అనబడే రాతియుగంలోకి తీసుకెళ్లే ప్రబుద్ధులకు తప్ప..!
చివరకు సైన్స్‌ను కూడా అబద్ధంగా కొట్టిపారేసి… అశాస్త్రీయమైన అంశాల్ని పిల్లలకు బోధిస్తే అది జాతి మీద దీర్ఘకాలిక దుష్ప్రభావాన్ని చూపిస్తుంది… భారతీయులు ఐటీ, మెడిసిన్, ఫార్మసీ వంటి రంగాల్లో అద్వితీయమైన ప్రతిభను ప్రదర్శిస్తూ, ప్రపంచమంతా విస్తరిస్తున్న తరుణంలో జాతి మొత్తాన్ని పీచే ముఢ్ అని ఆదేశించడం వంటిదే ఈ పాఠ్యాంశాల తొలగింపు… ఖండితంగా ఖండించదగిందే…!! అవునూ, వాట్సప్ యూనివర్శిటీ డార్విన్ ఎంతటి ప్రమాదకారో ఇంకా సిద్ధాంతీకరించి, ప్రచారం ప్రారంభించలేదా..? డార్విన్ మరణించి బతికిపోయాడు, లేకపోతే తక్షణం ఈడీ, సీబీఐ దాడులు మొదలయ్యేవి…!!
Share this Article