యతో ధర్మహ తతో జయహ… కవిత నోటి వెంట వచ్చిన సూక్తి ఇది… నిజమే, ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది… జయించాలి కూడా… తథాస్తు, నీ కోరిక నిండుగా నెరవేరాలక్కా… అయితే ఇక్కడ డౌటేమిటంటే… ఏది ధర్మం, ఏది జయించాలి… నేను కవిత బినామీని అని పిళ్లై అంగీకరిస్తాడు, స్కామ్ నిజమే అంటాడు… ఐఫోన్లన్నీ అందుకే ఫర్నేస్ చేశామనీ చెబుతాడు, అదంతా ఓ స్కామ్ అని సీబీఐ, ఈడీ దర్యాప్తులో నిజాలు వెల్లడవుతున్నాయి… మరి ఆ దర్యాప్తు ధర్మమా కాదా… అది అక్రమాన్ని జయించాలా వద్దా…
బీజేపీవి క్షుద్ర రాజకీయాలు నిజమే… అదానీ కావల్సినోడు కాబట్టి వదిలేస్తారు, తమ పార్టీలో చేరితే కాపాడతారు, ఓ దుష్ట పార్టీ… నిజమే… దానికి నైతికత లేదు… అయితే దానికి నైతికత లేదు కాబట్టి… సీబీఐ, ఈడీ దర్యాప్తులన్నీ అక్రమాలేనా..? ప్రతిపక్షంలో ఉంటే ఎవరూ ముట్టుకోకూడదా..? బారా ఖూన్ మాఫీయా..? ప్రజల కోణంలో చూస్తే… రాజకీయ నేపథ్యంలోనైనా సరే, ఇలా కొందరి అక్రమాలైనా బయటపడుతున్నాయి కదా… మంచిదే కదా… ధర్మమే కదా… మరి అది జయించాలి కదా…
విచారణ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో చేయాలట… ప్రతిపక్షంలో ఉన్నవాళ్ల మీద కేసు పెడితే రాజకీయంగా కక్షసాధింపట… ఈ యవ్వారాన్ని ఇంకా గాయిగత్తర చేస్తే జనంలో ఇంకా ఇంకా ప్రచారం జరుగుతుంది… అది ఎవరికి నష్టం… బీజేపీ వేధిస్తున్నదట అనరు జనం… ఆమె అవినీతికి పాల్పడిందట అనే అంటారు… రాజకీయంగా ఎవరికి నష్టం..?
Ads
రేప్పొద్దున ఓ మంత్రి అగ్నిగుండం చేస్తాడట తెలంగాణను… ఓహో, మీరేం చేసినా ఎవరూ టచ్ చేయవద్దన్నమాట… చేస్తే అది రాజకీయ కక్షసాధింపు అవుతుందా..? వ్యక్తులు చేసే అక్రమాలకు తెలంగాణ ఎందుకు అగ్నిగుండం కావాలి…? ఎవరిని ఉద్దరించడానికి..? కేసులు పెడితే లీగల్‌గా పోరాడండి, రాజకీయం చేస్తే రాజకీయంగానే ఎదుర్కొండి… తెలంగాణకు ఎందుకు అగ్గిపెడతారు..? మీకు వోట్లేసి, ఇన్నేళ్లు మిమ్మల్ని నెత్తిమీద మోసినందుకు శిక్ష విధిస్తారా..?
అసలు తెలంగాణ ఉద్యమ ఫలాలే అనర్హులకు దక్కుతున్నయ్… నాడు ప్రాంతేతరులు దోచుకుంటే… నేడు ప్రాంతీయులే దోచుకుంటుంటే… తెలంగాణ ఎప్పుడూ బాధితురాలే…! సరే, ఈ కేసులో చాలామంది అరెస్టయ్యారు..? కవిత జోలికి మాత్రం మోడీ వెళ్లడం లేదు… భయమా..? అల్లర్లు రేగుతాయనే వణుకా..? మోడీ ప్లేసులో యోగి గనుక ఉండి ఉంటే..? సర్లెండి, మోడీ దిక్కుమాలిన దౌర్బల్యాల గురించిన చర్చ దేనికిలే గానీ… ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత కవితకు అకస్మాత్తుగా వుమెన్ రిజర్వేషన్లు ఎందుకు గుర్తొచ్చాయి..?
ఇవన్నీ రకరకాల సాకులు… మేం ఏదో సోషల్ ఇష్యూ మీద పోరాడుతుంటే… భయపడి, వణికిపోయి, మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి మోడీ కక్షసాధిస్తున్నాడు అని చెప్పుకోవడానికి..! బీఆర్ఎస్ మీద పోరాడలేక కేసులు అనే సాకులు… ఏదైనా కాజ్ మీద పోరాడితే నిజాయితీ ఉండాలి… అవసరార్థం పొలిటికల్ షీల్డ్ కోసం కాదు… మొదటి కేసీయార్ మంత్రివర్గంలో ఎందరు మహిళా మంత్రులు ఉన్నారో ప్రకటించి, మహిళా రిజర్వేషన్ల ఆందోళనను స్టార్ట్ చేస్తే అది ధర్మం అయి ఉండేది… అవును, అంతిమంగా ధర్మమే జయిస్తుంది… జయించాలి కూడా…!!
కవిత ఏమన్నదంటే… ‘‘దుర్యోధనుడు వెళ్లి గాంధారిని యుద్ధంలో గెలవడానికి ఆశీస్సులు కోరితే, తప్పు తన కొడుకు వైపే ఉంది కాబట్టి, ఏమీ అనలేక… యతో ధర్మహ తతో జయహ అందట…’’ అవునూ, ఇక్కడ దుర్యోధనుడు ఎవరు, గాంధారి ఎవరు..? నువ్వు గెలుస్తావు అని చెప్పలేక ఆ సూక్తి వల్లెవేసింది ఎవరు..? నిన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు ఫోన్‌లో కేసీయార్ ఏమన్నాడు కవితతో..? తను కూడా నిఖార్సయిన ధర్మాభిలాషి..!!
‘‘జైలులో పెట్టి కృష్ణుడి పుట్టుకను ఆపలేరు, వనవాసంతో రాముడి బలం తగ్గలేదు’’ అనేదీ నిజమే… మరి భయమెందుకు..? కవితక్కా విజయోస్తు… జైలువాసాలు, ఈ కేసులు నిన్ను ఓడించలేవు… నిలువరించలేవు… వివక్షాయుత, మగవారసత్వాల్ని బద్దలు కొట్టి… ఎప్పటికైనా నువ్వు ముఖ్యమంత్రిణివి కావాలని కోరుతూ……
Share this Article