Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రజాస్వామిక సర్పయాగం అనబడు కన్నడ పాముల కథ…

May 3, 2023 by M S R

Snake – Sentiment: తమిళంలో “గరుడా! సౌఖ్యమా?” అని ఒక సామెత. పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి…తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం కంటే వేగంగా తిరగడంతో ఒళ్లు వేడెక్కింది…అలా చల్లగా హిమాలయాల కూల్ కూల్ కులూ మనాలి కాశ్మీర పర్వత సానువుల రిసార్టులో సేద తీరుదామని బయలుదేరాడు గరుత్మంతుడు. పైన దూది కొండల్లాంటి చల్లటి మేఘాలు, కింద వెండి కొండల్లాంటి మంచు పర్వతాలు. ప్రకృతి పరవశ గీతం పాడుతోంది. గరుత్మంతుడు ఒళ్లు మరిచి చల్ల గాలుల్లో ఎగురుతున్నాడు. ఈలోపు మేఘమండలం మధ్యలో శివుడు ధ్యాన ముద్రలో కళ్లు మూసుకుని కనిపించాడు. అంతే- ఒక్కసారిగా గరుత్మంతుడు వేగం తగ్గించి…రెక్కల చప్పుడు కూడా చేయకుండా వెనక్కు తిరగబోయాడు. పరమశివుడు చూడలేదు కానీ…శివుడి మెడలో పాము గరుత్మంతుడిని చూసింది.

బయట ఎక్కడయినా పాము కనపడితే గరుత్మంతుడు గుటుక్కుమని నోట్లో వేసుకునేవాడు. అది శివుడి మెడలో వాసుకి.
“ఏమి గురుత్మంతుడా!
బాగున్నావా?
ఏమిటి విశేషాలు?
(గరుడా! సౌఖ్యమా?)”
అని పాము అడిగేసరికి గరుత్మంతుడి పై ప్రాణాలు పైనే పోయినంత పని అయ్యింది.

మహా ప్రభో!
హాలిడే మూడ్లో ఉండి స్పీడ్ పెంచి కైలాసం దాకా వచ్చేశాను. నువ్వు నన్ను చూడలేదు. నేను నిన్ను చూడలేదు. దయచేసి నా ట్రెస్ పాసింగ్ గురించి మీ స్వామికి కంప్లైంట్ చేయకు. వచ్చినదారినే వెళ్లిపోతా. ప్లీజ్ అని రెక్కలు జోడించి దండం పెట్టి…బతుకు జీవుడా అనుకుని బయటపడ్డాడు.

Ads

కైలాసంలో ఒక పవిత్ర కార్తిక మాసం సాయం సంధ్యవేళ. పుట్టపర్తివారు చెప్పినట్లు మొదట శివుడు తాండవం చేశాడు. తరువాత పార్వతి లాస్యం అయ్యింది. ఇద్దరూ ఇసుమంతయినా అలుపు లేకుండా ఉన్నత స్థానంలో ఒకరి పక్కన కూర్చున్నారు. దేవతలందరూ పోటీలు పడి స్తోత్రాలు చేస్తుంటే…పార్వతి మనసు పొంగిపోయింది. పక్కనున్న శివుడి చేతి మీద చేయి వేసి ప్రేమపొంగిన మనసుతో అభినందించబోయింది. ఆమె చేతికి మెత్తగా ఏదో తగిలింది. వెంటనే చేయి తీసేసి…నవ్వుకుంది. శివుడు కూడా ప్రతిగా ముసిముసిగా నవ్వాడు. ఆ నవ్వుకు లోకాలు ఆనంద తాండవం చేశాయి. అలాంటి వేళ శివ పార్వతులకు నమస్కరించాడు ఆది శంకరాచార్యుడు. ఆ క్షణంలో పార్వతి చేతికి మెత్తగా తగిలినది శివుడి ముంజేతికి, వేళ్లకు ఆభరణంగా ఉన్న పాము!

మృత్యువును జయించినవాడు- మృత్యుంజయుడు కాబట్టి శివుడు పామును మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటాడు. విష్ణువు కూడా అంతే కాబట్టి ఆయన పాము మీదే పడుకుని ఉంటాడు.

వేదాంత భాషలో పాము మృత్యువుకు సంకేతం. యోగాభాషలో పాము పైకి పాకే కుండలినీ శక్తి. సామాన్య భాషలో పాము పామే. పామంటే ఎవరికయినా భయమే. అందుకే పాముకు పాలు పోసి పెంచినా అది పాలన్నీ తాగి…పాలు పోసినవారిని కృతజ్ఞతాపూర్వకంగా కాటు వేస్తూ ఉంటుంది. పామును పక్కలో పెట్టుకుని పడుకున్నట్లు అని లోకం  భయపడుతూ…మానవరూపంలో ఉన్న ఎన్నో సర్పాలతో సహజీవనం చేస్తూ ఉంటుంది.

చిన్న పామునయినా పెద్ద కర్రతో కొడతామని తెలుసు కాబట్టి పెద్దవి అయ్యాకే పాములు వీధుల్లో తిరగడం అలవాటు చేసుకున్నాయి. మనదగ్గర పాముకు- గద్దకు అస్సలు పడదు. విష్ణువు దగ్గర వేయిపడగల పాము- గరుత్మంతుడు క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ వన్ బై టు టీ తాగుతూ ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కూడా అంతే. నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటే పాము పడగ విప్పి మిత్రధర్మం పాటిస్తూ అడుగులో అడుగు వేస్తుంది.

“తలనుండు విషము ఫణికిని,
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్‌,
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!”

పాముకు పడగ కోరల్లోనే విషం. తేలుకు తోకలోనే విషం. మనిషికి నిలువెల్లా విషమే అని సుమతీ శకకారుడి స్కానింగ్ రిపోర్ట్ లో శతాబ్దాల క్రితమే తేలిపోయింది.

మనుషుల్లో కాలనాగులు, విషనాగులు, విషకన్యలు, మన్ను తిన్న పాములు…ఇలా స్వభావాన్ని, సైజును బట్టి ఎన్నెన్నో రకాలు. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నవేళ బి జె పి ప్రధానిని కాంగ్రెస్ “విషనాగు” అంటే…కాంగ్రెస్ సోనియాను బి జె పి “విషకన్య” అని అన్నది.

మన శాస్త్రాల ప్రకారం మనకు పైన-
1. భూలోకం
2. భువర్లోకం
3. సువర్లోకం
4. మహర్లోకం
5. జనోలోకం
6. తపోలోకం
7. సత్య లోకం

మనకు కింద-
1. అతల
2. వితల
3. సుతల
4. తలాతల
5. మహాతల
6. రసాతల
7. పాతాళం
లోకాలు ఉన్నాయట. ఈ కింది లోకాల్లో మహాతలమంతా విషనాగులు, విషకన్యలది. నాగలోకం.

ఇప్పటి ఎన్నికల విషనాగులు, విషకన్యల భాష ప్రకారం మన కింద ఇంకా రసాతల, పాతాళ లోకాలున్నాయి. ఈ సంస్కార వేగంతో మనం పాతాళం కిందికి ఎప్పటికి చేరుకుంటామో! ఏమో!

ఇంకా నయం!
కలియుగారంభంలో తన తండ్రి పరీక్షిత్తును తక్షకుడు(సర్పం) చంపేశాడని జనమేజయుడు సర్పయాగం చేయబట్టి కొన్ని కోట్ల సర్పజాతులు తుడిచిపెట్టుకుపోయాయి. లేకుంటే పద్నాలుగు భువన భాండాల్లో బుస్సు బుస్సుమని విషం చిమ్ముతూ…కనిపించినవారినందరినీ కాటు వేస్తూ కాలనాగులు, విషనాగులు, విషకన్యలే ఉండి ఉండేవేమో! ఏమో!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

ఎన్నికల పాములు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions