Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇక ప్రతి జంట 16 మందిని కనాలేమో … కనండి కానీ తమిళ పేర్లే పెట్టాలి…

October 23, 2024 by M S R

.

జనాభాను నియంత్రించారుగా! ఇక మీకు ఎంపీలెందుకు? దక్షిణాదికి తీరని ద్రోహం

కేంద్ర ఎన్నికల సంఘం 2019 ఎన్నికలప్పుడు ప్రకటించిన లెక్కల ప్రకారం మన దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు. 2024 ఎన్నికల నాటికి 97 కోట్ల ఓటర్లు. అంటే 140 కోట్ల జనాభాలో ఈ 97 కోట్ల ఓటర్లను తీసేస్తే మిగతావారు ఓటు హక్కు వయసు రాని పిల్లలు. ఓటు హక్కున్నవారిలో సగటున అరవై నుండి డెబ్బయ్ శాతం మంది మాత్రమే ఓటు వేస్తుంటారు. మిగిలినవారికి అదే రోజు ఏవేవో అర్జెంట్ పనులు పడి ఓటు వేయడానికి కుదిరి చావదు.

Ads

దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు వెళ్లి పార్లమెంటులో కూర్చోవాలంటే భౌతికంగా ఇప్పుడున్న పార్లమెంట్ చాలదు. ఎప్పటికీ అంతటి పార్లమెంట్ కట్టడం సాధ్యం కాదు. కాబట్టి దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఒక ఎంపిని తమ ప్రతినిధిగా ఎన్నుకుంటున్నారు. అందుకే అది అక్షరాలా ప్రాతినిధ్యం అయ్యింది.

ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ. ఒక ప్రజాస్వామిక పాలనా సంవిధానం. చట్ట సభలకు బాధ్యత వహించే ఒక సువిశాల నిర్మాణం. ప్రభుత్వం ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం ఒక భరోసా. ప్రభుత్వం ఒక రక్షణ. ఆచరణలో ప్రభుత్వంలో ఎన్నో లోపాలు ఉండి ఉండవచ్చు. కానీ- యుగయుగాల పాలనా వ్యవస్థల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మించిన మంచి ప్రత్యామ్నాయం లేదు, రాదు.

అలాంటి ప్రభుత్వ విధానాల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకానొక అలాంటి విచిత్రాన్ని ఆమధ్య తమిళనాడు హై కోర్టు పసిగట్టింది. కేంద్ర ప్రభుత్వ ఒకానొక విధానాన్ని ఉతికి ఆరేసింది. అనేక ప్రశ్నలను లేవనెత్తింది. దేశం గురించి స్పృహ ఉన్నవారందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయాలను తమిళనాడు హై కోర్టు వెలుగులోకి తెచ్చింది.
విషయం:-

దక్షిణాదిలో తమిళనాడుతో పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా నియంత్రణలో ముందున్నాయి. దాంతో జనాభా నియంత్రణ లక్ష్యం నెరవేరినా- ఇతర విషయాల్లో ఈ రాష్ట్రాలకు అంతులేని అన్యాయం జరుగుతోంది. జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ సీట్లు తగ్గుతున్నాయి. భవిష్యత్తులో ఆ దామాషాలో రాజ్యసభ సీట్లు కూడా తగ్గుతాయి.
కేంద్రానికి హై కోర్టు ప్రశ్నలు:-

1 .
ఎం పి సీట్లు తగ్గినందుకు- రాజ్యసభ సీట్లు పెంచుతారా?

2 . జనాభాను నియంత్రించినందుకు ఏటా ఈ రాష్ట్రాలకు (అంటే ఇప్పుడు మూడు రాష్ట్రాలకు) ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తారా?

3.
గతంలో 1972లో పునర్విభజన జరిగినప్పుడు కొన్ని స్థానాలు తగ్గలేదా?

4.
నియోజకవర్గాలను పునర్విభజించినా సంఖ్యా పరంగా తగ్గకుండా జాగ్రత్త పడతారా?
——————–

మన అభివృద్ధి నమూనాను వెక్కిరించే పెద్ద ఉదాహరణ ఇది. పేదరికాన్ని నిర్వచించడానికి లక్డా వాలా కమిటీ నివేదికను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. ఇరవై ఏళ్లుగా అనేక మంది ముఖ్యమంత్రులు లక్డా వాలా కమిటీ నివేదిక ప్రమాణాలే తప్పు అని గొంతు చించుకుని అరుస్తున్నా కేంద్రానికి వినపడ్డం లేదు.

సులభంగా అర్థం కావడానికి కల్పిత ఉదాహరణలతో ఇలా చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో జనాభా నియంత్రణ ఉద్యమం సత్ఫలితాలనిచ్చింది. జనం ఉన్నంతలో చదువుకుంటున్నారు. ఉన్నంతలో ఆరోగ్యంగా ఉన్నారు. పద్ధతిగా పన్నులు కడుతున్నారు.

బీహార్, ఉత్తర ప్రదేశ్ లో జనాభా నియంత్రణ జరగలేదు. నిరక్షరాస్యత పెరిగింది. పేదరికం పెరిగింది. ఆరోగ్యాలు దెబ్బ తిన్నాయి. పన్నులు కట్టలేకపోతున్నారు. లేదా పన్నులు కట్టే స్థాయికి ఎదగలేకపోతున్నారు.

కేంద్రం దగ్గర గ్రాంటుగా ఇవ్వదగ్గ (తిరిగి కట్టాల్సిన పనిలేని) ఒక లక్ష కోట్లు ఉందనుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో లక్డా వాలా కమిటీ సిఫారసు ప్రకారం బీహార్, ఉత్తర ప్రదేశ్ లకు తొంభై వేల కోట్లు ఇచ్చి; మిగతా పది వేల కోట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు సర్దాలి.

అవసరాల ప్రకారం, జనాభా సంఖ్య ప్రకారం చూసినప్పుడు ఇది చాలా సహజం, న్యాయంగా అనిపిస్తుంది. కానీ- లోతుగా చూస్తే ఇందులో గాయం కనపడకుండా కొట్టే దెబ్బలు ఎన్నో ఉన్నాయి.

పన్నులు కట్టేవారి సొమ్ము పన్నులు కట్టనివారికి వెళుతోంది. జనాభాను నియంత్రించిన వారికి ఆకుల్లో, నియంత్రించని వారికి కంచాల్లో వడ్డిస్తున్న విచిత్రమయిన దాతృత్వం కనిపిస్తుంది. నిరుపేదలకు, నిర్భాగ్యులకు ఇవ్వడం ప్రభుత్వ విధి. అయితే ఆ పేరుతో దశాబ్దాలుగా అభ్యుదయం బాటలో వడివడిగా అడుగులు వేసే రాష్ట్రాల గొంతు కోయడం మాత్రం అన్యాయం. చివరికి అది ఎంతదాకా వెళుతుందంటే- కేవలం జనాభాను నియంత్రించినందుకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ఎంపిల సంఖ్య నామమాత్రమై పార్లమెంటు మొదటి గేటు దగ్గర గుంపులు గుంపులుగా వెళ్లే బీహార్, ఉత్తర ప్రదేశ్ ఎంపిలకు మనం స్లిప్పులిచ్చి…
“బాబ్బాబు కుదిరితే కొద్దిగా పార్లమెంటులో మా ఈ దయనీయమయిన ప్రశ్న అడుగు!
బాగా సంస్కరణలను అమలు చేసి, అభివృద్ధి సాధించడం వల్ల మాకు ఎంపిలు లేకుండా పోయారు! ప్లీజ్! మీకు పుణ్యముంటుంది!”
అని పశ్నకొక కాలు పట్టుకోవాల్సిన డెమొక్రటిక్ కంపల్షన్ రావచ్చు.

తమిళనాడు హై కోర్టు ప్రశ్నకు సమాధానం వస్తుందో? లేక ప్రశ్న పునర్విభజన అయి అనేక మహా ప్రశ్నలుగా మిగిలిపోతుందో?

ఇంగ్లీషులో
Policy paralysis అని ఒక మాట వాడుకలో ఉంది.
విధాన పక్షవాతం అని తెలుగులో అనుకోవచ్చు. ఇంతకంటే పక్షవాతం, పక్షపాతం, ఆశ్రిత పక్షపాత విధానాల గురించి మాట్లాడ్డం సభా మర్యాద కాదు.

అయినా- ఇదొక సమస్యా?
మూడో పెళ్ళాం రెండో హనీమూన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా? థియేటర్లలో రిలీజ్ అవుతుందా? లేక ఒకే సమయంలో రెండు చోట్లా రిలీజ్ అవుతుందా?
టెన్షన్ తట్టుకోలేక మెదడు వెయ్యి ముక్కలయిపోతున్న మన తక్షణ సమస్యలు ఇలాంటివెన్నో ఉండగా…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పచ్చని పెళ్లి పందిరిలో నవదంపతులను ఆశీర్వదిస్తూ…
“నియోజకవర్గాల పునర్విభజన వల్ల నష్టం జరగకూడదంటే ఇక దక్షిణాదిలో ఒక్కో జంట పదహారు మంది పిల్లల్ని కనాలేమో!” అని వైరాగ్యంతో ఎందుకన్నారో మనకెందుకు?

దక్షిణాది వాడికి, వాడి వాణికి విలువ లేకుండా చేసేవారు కొందరు.
దక్షిణాదికి ప్రాతినిథ్య బలమే లేకుండా చేసేవారు కొందరు.
పేరుగొప్ప ప్రజాస్వామ్యంలో…ప్రజాస్వామ్యం కత్తితో…ప్రజాస్వామ్యం గొంతు కోయడమంటే ఇదే!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions